హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్నారా?.. అయితే జాగ్రత్త
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:37 PM
హెల్మెట్ లేకుండా బైకు నడిపిన ఓ లా స్టూడెండ్‌కు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. ఏకంగా 10 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. దీంతో ఆ స్టూడెంట్ షాక్ అయ్యాడు.

హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదం అని తెలిసినా జనం దాన్ని పట్టించుకోరు. జుట్టు ఊడిపోతుందనో.. క్రాప్ చెరిగిపోతుందనో.. తల మీద బరువు ఎందుకనో.. చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కనిపించినపుడో.. చెకింగ్ జరుగుతున్నపుడో టక్కున హెల్మెట్ తీసి పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. ఫైన్లు పడుతూ ఉంటాయి. సాధారణంగా హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసులకు దొరికితే 500 నుంచి 1000 రూపాయల వరకు ఫైన్ ఉంటుంది. కానీ, ఓ విద్యార్థికి మాత్రం పోలీసులు ఏకంగా 10 లక్షల రూపాయల ఫైన్ వేశారు. అంత పెద్ద మొత్తంలో ఫైన్ పడటం చూసి అతడు షాక్ అయ్యాడు.
ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అనిల్ హాదియా.. లా చదువుతున్నాడు. బైకు మీదే లా కాలేజీకి వెళుతూ ఉంటాడు. తరచుగా హెల్మెట్ ధరించకుండా బైకు నడపటం అతడికి అలవాటు. 2024, ఏప్రిల్ నెలలో కూడా హెల్మెట్ లేకుండా బైకు నడుపుకుంటూ కాలేజీకి వెళుతూ ఉన్నాడు. శాంతిపుర ట్రాఫిక్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. దీంతో పోలీసులు అతడికి ఫైన్ వేశారు. కొద్దిరోజుల తర్వాత అతడి ఇంటికి కోర్టు సమన్లు వచ్చాయి. ఆ సమన్లలో ఫైన్‌కు సంబంధించిన అమౌంట్ ఉంది. అతడు ఆ సమన్లు చదివి షాక్ అయ్యాడు. హెల్మెట్ లేకుండా బైకు నడిపినందుకు గాను..
అక్షరాలా 10,00,500 రూపాయలు కట్టాలని అందులో ఉంది. అనిల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. అతడు స్టూడెంట్.. తండ్రి ఓ చిన్న వ్యాపారస్తుడు. తన కుటుంబం అంత పెద్ద మొత్తం ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ బాగా ఒత్తిడికి కూడా గురయ్యాడు. ఇలాంటి టైంలో సోషల్ వర్కర్ హర్షద్ పాటిల్ అనిల్‌కు అండగా నిలిచాడు. అనిల్‌ను మెట్రో పాలిటన్ కోర్టుతో పాటు పోలీస్ కమిషనర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అనిల్ అక్కడ తన గోడు వెల్లబోసుకున్నాడు. పోలీస్ కమిషనర్ ఈ ఘటనపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 500 రూపాయలకు బదులుగా 10,00,500 రూపాయలు అని తప్పుగా పడినట్లు తేలింది. దాన్ని సరిచేస్తామని అధికారులు అనిల్‌కు భరోసా ఇచ్చారు. దీంతో అనిల్ ఊపిరి పీల్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
హెల్మెట్ లేకుండా రోడ్డెక్కిన హీరో
Dangerous Players in IPL 2025: రాజస్తాన్, కోల్‌కతాలో డేంజరస్ వీళ్లే..తేలికగా తీసుకుంటే తాట తీసుడే
Share Market closing bell: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు