Share News

Los Angeles fires : లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. నష్టం 5 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:43 AM

అమెరికాలోని లాస్‌ ఏంజెలె్‌సలో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్‌ ఫైర్‌.. ఈటన్‌ ఫైర్‌.. సన్‌సెట్‌ ఫైర్‌.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది. రెండ్రోజుల వ్యవధిలో వేల ఎకరాలు ఆహుతవ్వగా.. హాలీవుడ్‌ కొండలను అగ్ని చుట్టుముట్టింది. అమెరికా

Los Angeles fires : లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. నష్టం 5 లక్షల కోట్లు

ఐదుగురి దుర్మరణం.. 1.37 లక్షల మంది తరలింపు

వేగంగా విస్తరిస్తున్న మంటలు.. నేడూ గాలులు

బైడెన్‌ కుమారుడు హంటర్‌ నివాసం కూడా దగ్ధం

హాలీవుడ్‌కు ముప్పు.. ఆస్తులు కోల్పోయిన స్టార్లు

ఆస్కార్‌ వేడుకపై నీలినీడలు.. క్రీడా టోర్నీలు రద్దు

వాషింగ్టన్‌, జనవరి 9: అమెరికాలోని లాస్‌ ఏంజెలె్‌సలో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్‌ ఫైర్‌.. ఈటన్‌ ఫైర్‌.. సన్‌సెట్‌ ఫైర్‌.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది. రెండ్రోజుల వ్యవధిలో వేల ఎకరాలు ఆహుతవ్వగా.. హాలీవుడ్‌ కొండలను అగ్ని చుట్టుముట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు సహా.. పలువురు హాలీవుడ్‌ స్టార్ల ఇళ్లు బుగ్గిపాలవ్వగా.. ఐదుగురు పౌరులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కడపటి వార్తలందేసరికి 2 వేలకు పైగా ఆవాసాలు దగ్ధమయ్యాయని, ఆస్తులు, వనరుల నష్టం విలువ రూ.5 లక్షల కోట్లు(57 బిలియన్‌ డాలర్లు)గా ఉంటుందని గుర్తించినట్లు తెలిపారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉంటుందని, కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హాలీవుడ్‌ చుట్టూ..

లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చులో అతిపెద్దదైన పాలిసాడ్స్‌ ఫైర్‌ కారణంగా 15,800 ఎకరాలు, ఈటన్‌ ఫైర్‌ వల్ల ఆల్టడేన, పసాడెనా ప్రాంతాల్లోని 10 వేల ఎకరాలు, సన్‌సెట్‌ ఫైర్‌ 5 వేలకు పైగా ఎకరాలు, హురెస్ట్‌ ఫైర్‌ సైల్మర్‌లో 700 ఎకరాలు, లిడియా ఫైర్‌ 340 ఎకరాలను బుగ్గిపాలు చేయ గా.. ఉడ్లీ ఫైర్‌ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. సన్‌సెట్‌ ఫైర్‌ ప్రస్తుతం హాలీవుడ్‌ కొండలను చుట్టముట్టిందని, వేగంగా విస్తరిస్తోందని, హెలికాప్టర్ల ద్వారా నీటిని చిమ్ముతున్నా అదుపులోకి రావడం లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం(గురువారం రాత్రి కడపటి వార్తలందేసరికి) హాలీవుడ్‌కు 8 మైళ్ల దూరంలో మంటలు కొనసాగుతున్నాయి. స్టూడియో సిటీ, రన్‌యాన్‌కెనాన్‌లో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. రియాల్టీ టీవీ స్టార్‌ పారిస్‌ హిల్టన్‌, నటులు యూజిన్‌ లెవీ, బిల్లి క్రిస్టల్‌, జాన్‌ గుడ్‌మన్‌ ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి. స్టూడియోసిటీ పరిసరాల్లో చాలామంది సినీతారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు. ఇప్పటి వరకు 2 వేల ఇళ్లు (లగ్జరీ విల్లాలు కలిపి) బుగ్గిపాలవ్వగా, రూ.5లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్కతేల్చారు. ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని, 2005లో నెలకొన్న కార్చిచ్చు తర్వాత ఇదే అతిపెద్ద వినాశకారిగా ఉందని పేర్కొన్నారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రాంతంలో గాలిలో నాణ్యత(ఏక్యూఐ) దారుణంగా ఉందని వివరించారు.


ఆస్కార్‌ వేడుకలపై నీలినీడలు!

మాలిబు మొదలు.. శాన్‌ డియాగో కౌంటీ వరకు దక్షిణ కాలిఫోర్నియాలో 1.6 కోట్ల జనాభా ఉంటుం ది. ఈ ప్రాంతాలకు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ‘శాంటాఅనా’ గాలులు బలంగా వీస్తాయని, దీంతో.. పరిస్థితులు మరింత జటిలంగా మారే ప్రమాదాలున్నాయని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో హాలీవుడ్‌లో జరగనున్న ఆస్కార్‌ వేడుకలపై నీలినీడలు కమ్ముకున్నాయని, పలు క్రీడలు(లీగ్‌లు), సాంస్కృతిక కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. మాలిబులో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ఇల్లు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ లగ్జరీ ఇంటిని 1950లో నిర్మించారు. అయితే.. ఈ ఘటనపై తనకు సమాచారం లేదని బైడెన్‌ తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 04:43 AM