Navy Officer Case: డబ్బులు భర్తవి.. జల్సాలు ప్రియుడితో.. అక్కడితో ఆగకుండా
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:46 PM
మేరఠ్ నేవీ అధికారి హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్.. భర్త డబ్బులతో ప్రియుడి చేత బెట్టింగ్ వేయించి జల్సాలు చేసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను.. ప్రియుడి సాయంతో అత్యంత దారుణంగా హత్య చేసి.. 15 ముక్కలుగా చేసి సిమెంట్ డ్రమ్ములో పెట్టిన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తరప్రదేశ్, మేరఠ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని అతడి భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్.. భర్త కష్టపడి సంపాదించిన సొమ్ముతో.. ప్రియుడి చేత బెట్టింగ్‌లు వేయించేది. అలా వచ్చిన డబ్బుతో ఇద్దరూ జల్సాలు చేశారని.. విహారయాత్రలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి నెలా రూ.లక్ష
కుటుంబ పోషణ నిమిత్తం సౌరభ్.. విదేశాలకు వెళ్లాడు. తన భార్యాబిడ్డల ఖర్చుల కోసం ప్రతి నెలా లక్ష రూపాయలు పంపించేవాడని పోలీసులు గుర్తించారు. ముస్కాన్ అకౌంట్‌లో డబ్బులు పడగానే.. ఆమె వాటిని తన ప్రియుడికి ట్రాన్స్‌ఫర్ చేసేది. ముస్కాన్ పంపిన డబ్బులతో సాహిల్.. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ వేసేవాడని పోలీసులు గుర్తించారు.
అలా బెట్టింగ్‌ల మీద వచ్చిన డబ్బుతో ముస్కాన్, సాహిల్ ఇద్దరూ విహారయాత్రలకు వెళ్లే వారని పోలీసులు గుర్తించారు. గతంలో నిందితులిద్దరూ డెహ్రాడూన్, రిషికేశ్ వంటి ప్రాంతాలకు వెకేషన్ కోసం వెళ్లినట్లు దర్యాప్తులో తెలిసింది. అంతేకాక సాహిల్‌కు ఉద్యోగం లేదని.. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు.
మందుల చీటీ ఫోర్జరి చేసి
వీటితో పాటు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. సౌరభ్‌ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్ చేసిందని.. దానిలో భాగంగానే మందుల చీటిని ఫోర్జరీ చేసి.. నిద్రమాత్రలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 25ననే ముస్కాన్ భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. దానిలో భాగంగా స్థానికంగా ఉండే డాక్టర్ వద్దకు వెళ్లి.. తాను ఆందోళన సమస్యతో బాధపడుతున్నాని చెప్పి మందులు రాయించుకుంది.
ఆ తర్వాత మరో ఖాళీ ప్రిస్క్రిప్షన్ పేపర్‌ను సంపాదించింది. దానిలో డాక్టర్ రాసిన మందులతో పాటుగా.. ఆన్‌లైన్‌లో నిద్ర మాత్రల గురించి తెలుసుకుని ఆ పేర్లను ప్రిస్క్రిప్షన్‌లో చేర్చింది ముస్కాన్. వాటిని తీసుకుని ఇంటికి వెళ్లింది. అలా ఫిబ్రవరి 25నే సౌరభ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. కానీ కుదరలేదు. దాంతో మార్చి 4న మరోసారి ప్లాన్ చేసింది. ఆరోజు సౌరభ్ తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. అతడు మత్తులోకి వెళ్లాక.. ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది అని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్
మీరట్ మర్డర్ కేసు.. వెలుగులోకి వెన్నులో వణుకు పుట్టించే విషయాలు..