Share News

Myanmar Tragedy: బాల్యం శిథిలం

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:00 AM

మయన్మార్ భూకంపం 3,700 మంది మరణానికి దారితీర్చింది. 1,600 మంది చిన్నారులు మృతి చెందగా, మరో 3,400 మందికి గాయాలయ్యాయి, యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది

Myanmar Tragedy: బాల్యం శిథిలం

మయన్మార్‌ భూకంప మృతుల్లో 1,600 మంది చిన్నారులే

  • మరో 3 వేల మందికి గాయాలు

  • ఆందోళన వ్యక్తం చేసిన యునిసెఫ్‌

  • మాండలే, సికాయ్‌లో మళ్లీ భూకంపం

  • నేపిదా(మయన్మార్‌), ఏప్రిల్‌ 1: భూప్రకోపంతో విధ్వంసాన్ని చవిచూసిన మయన్మార్‌లో బాల్యం ప్రమాదంలో పడిందని ఐక్య రాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ-- అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 28 నాటి భూకంపం.. తదనంతర ప్రకంపనలతో జరిగిన విధ్వంసంలో మరణాల సంఖ్య 3,756కు చేరగా.. మృతుల్లో 1,600 మందికి పైగా బాలలు ఉన్నారని యునిసెఫ్‌ తెలిపింది. మరో 3,400 మంది చిన్నారులు గాయాలపాలైనట్లు పేర్కొంది. ‘‘మయన్మార్‌ బాలలు ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నుంచి విపత్తులు బాలల పాలిట శాపంగా మారాయి. గత ఏడాది వచ్చిన యాగీ తుఫాను, ఆ తర్వాత థాయ్‌లాండ్‌, వియత్నాం వరదలతో మయన్మార్‌ అతలాకుతలమైంది. అంతర్యుద్ధం కూడా బాల్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మయన్మార్‌లో చిన్నారులను కాపాడాల్సిన అవసరం అంతర్జాతీయ సమాజంపై ఉంది’’ అని యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేథరిన్‌ అన్నారు.


నిత్యావసరాలకు కటకట

భూకంప ప్రభావిత మాండలే, సికాయ్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపక్కన ఫుట్‌పాత్‌లపై, పార్కుల్లో తాత్కాలిక గుడారాలు వేసుకుని, నివసిస్తున్నారు. అయితే.. తాగునీరు, ఆహారం, ఔషధాలు అందక ఇక్కట్లపాలవుతున్నారు. నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో.. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఒక కోడిగుడ్డు కూడా కొనలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. వివిధ దేశాలు పంపుతున్న సాయం తమకు అందడం లేదని పేర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేక.. రాత్రిళ్లు ప్రజలు పాముకాట్లకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సికిన్‌ నగరంలో ఆరుగురు పాముకాట్ల బారిన పడ్డారు. కాగా.. మాండలే, సికాయ్‌ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 4.7 తీవ్రతతో మరోమారు భూకంపం సంభవించింది. మరోవైపు, అల్పపీడనం తీరాన్ని తాకడంతో.. మయన్మార్‌లో వర్షాలు కురుస్తున్నాయి.

fmmjb.jpg

నలుగురు ఖైదీల మృతి

భూకంపంతో ఓబో జైలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే..! ఈ ఘటనలో చాలా మంది ఖైదీలు చనిపోయి ఉంటారని వార్తలు వచ్చినా.. నలుగురు మృతిచెందారని మిలటరీ సర్కారు మంగళవారం ప్రకటించింది. అయితే.. మాండలేతోపాటు మిగతా జైళ్లలో రాజకీయ ఖైదీల పరిస్థితి ఏమిటని ప్రభుత్వ మాజీ అధినేత అంగ్‌సాన్‌ సూకీ ప్రశ్నించారు. మరోవైపు, అస్త్రాలు లేకుండా యుద్ధం చేస్తున్నట్లుగా పరిస్థితి ఉందని సహాయక బృందాలు వాపోతున్నాయి. థర్మల్‌ ఇమేజింగ్‌, థర్మల్‌ డిటెక్షన్‌ కెమెరాలు, రాడార్లు, డ్రోన్లు లేకుండానే శిథిలాల కింద అన్వేషణను కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. దీంతో సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయని, మిలటరీ సర్కారు ఆంక్షలు కూడా ఇబ్బందికరంగా మారాయని పేర్కొన్నాయి. కనీసం శిథిలాల్లో ఎవరి జాడనైనా కనిపెడితే.. వారికి ఆక్సిజన్‌ అందజేసే వెసులుబాటు కూడా లేదని వివరించాయి.


కొత్త సంవత్సర వేడుకల రద్దు

భూకంపం నేపథ్యంలో బౌద్ధుల కొత్త సంవత్సర(తింగ్‌యాన్‌) వేడుకలను రద్దు చేస్తున్నట్లు మయన్మార్‌లోని మిలటరీ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏటా వారం రోజులపాటు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఈనెల 17న తింగ్‌యాన్‌ ఉండగా.. 13 నుంచి 16వ తేదీ వరకు వసంతోత్సవాలు, ఇతర వేడుకలను షెడ్యూల్‌ చేశారు. సర్కారు తాజా నిర్ణయంతో ఈ వేడుకలు రద్దయ్యాయి.

విధ్వంసంపై ఇస్రో ఫొటోలు

మయన్మార్‌ భూకంపం సృష్టించిన విఽధ్వంసానికి సంబంధించి కార్టోశాట్‌-3 ఉపగ్రహం తీసిన ఫొటోలను ఇస్రో తాజాగా విడుదల చేసింది. భూకంపానికి ముందు, తర్వాత తేడాలను ఆ చిత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మార్చి 28న భూకంపం సంభవించగా.. కార్టోశాట్‌-3 మార్చి 29న మయన్మార్‌లోని మాండలే, సగాయింగ్‌ నగరాలపై నుంచి ఈ ఫొటోలు తీసింది. వాటితోపాటు మార్చి 18న ఇదే ప్రాంతంపై నుంచి కార్టోశాట్‌-3 తీసిన చిత్రాలను పక్కపక్కన ఉంచిన ఇస్రో విపత్తుకు ముందు, తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉందో స్పష్టంగా తెలియజేసింది.


ఇవి కూడా చదవండి..

Ranveer Allahbadia: రెండు వారాల తర్వాతే.. అల్హాబాదియా పాస్‌పోర్ట్ రిలీజ్‌పై సుప్రీంకోర్టు

Pryagraj Demolitions: ప్రయాగ్‌రాజ్ బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం ఆగ్రహం.. నష్టపరిహారానికి ఆదేశం

ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి 12 మంది మృతి

మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ

For National News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:02 AM