Nitin Gadkari: 25 వేల కి.మీ మేర నాలుగు లేన్ల రోడ్లు
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:29 AM
దేశంలోని 25 వేల కిలోమీటర్ల మేర రెండు లేన్ల రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా మారుస్తామని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

రూ. 10 లక్షల కోట్లతో పనులు: గడ్కరీ
న్యూఢిల్లీ, మార్చి 27: దేశంలోని 25 వేల కిలోమీటర్ల మేర రెండు లేన్ల రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా మారుస్తామని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడతామని, తద్వారా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. 16 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను రూ.6 లక్షల కోట్లతో ఆరు లేన్ల రహదారులుగా మార్చుతామన్నారు.
‘‘మేము 10 లక్షల కోట్ల రూపాయలతో 25వేల కిలోమీటర్ల రెండులేన్ల రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా మార్చడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకోసం డీపీఆర్‌లు(సమగ్ర ప్రాజెక్టు నివేదికలు) సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయగలమని ఆశిస్తున్నాం’’ అని ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలోని రహదారుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.