Share News

OYO: పెళ్లికాని జంటలకు రూం ఇవ్వం!

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:44 AM

ప్రముఖ హోటల్‌ గదుల బుకింగ్‌ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది.

OYO: పెళ్లికాని జంటలకు రూం ఇవ్వం!

గది కావాలంటే పెళ్లయినట్లు ఐడీ చూపాల్సిందే..ఓయో సంస్థ నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 5: ప్రముఖ హోటల్‌ గదుల బుకింగ్‌ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లలో దిగేవారికి కొత్త చెక్‌-ఇన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై అవివాహిత జంటలకు హోటళ్లలో గది ఇవ్వరు! ఈ మేరకు ఈ ఏడాది అమల్లోకి వచ్చేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇక మీదట పెళ్లికాని జంటలు గదిని బుక్‌ చేసుకునేందుకు వీలుండదు. ఈ నిబంధనలు తొలుత మేరఠ్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది. ఓయో సవరించిన విధానం ప్రకారం.. ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో రూమ్‌ బుక్‌ చేసుకునేటప్పుడు జంటలు పెళ్లి ధ్రువపత్రాలు/రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అంటే కచ్చితంగా వివాహాన్ని నిర్ధారించే గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది.

ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్‌లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు అందించింది. మేరఠ్‌లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురానుంది. క్షేత్రస్థాయి అభిప్రాయాలు, సూచనల (ఫీడ్‌బ్యాక్‌) ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాము సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య విధానాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఓయో ఉత్తర భారత రీజియన్‌ అధిపతి పవాస్‌ శర్మ చెప్పారు. అందులో భాగంగానే తాజాగా కొత్త చెక్‌-ఇన్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

Updated Date - Jan 06 , 2025 | 04:45 AM