ప్రాజెక్టులకు నిధుల వినియోగం ఇలాగేనా?
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:28 AM
వివిధ నీటి ప్రాజెక్టుల కోసం కేంద్ర జలశక్తి శాఖకు కేటాయించిన నిధుల వినియోగం తీరుపై జలవనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది.

21,640 కోట్లలో 58 శాతమే ఖర్చు
పోలవరానికి కేటాయింపులు పెరిగాయ్
తొలిదశ అంచనా రూ. 30,436 కోట్లు
అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం
పార్లమెంటరీ కమిటీల నివేదికలు
న్యూఢిల్లీ, మార్చి 13: వివిధ నీటి ప్రాజెక్టుల కోసం కేంద్ర జలశక్తి శాఖకు కేటాయించిన నిధుల వినియోగం తీరుపై జలవనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది. 2024-25లో సవరించిన కేటాయింపులు రూ.21,640 కోట్లు కాగా.. గత డిసెంబరు చివరకు అందులో 58ు మాత్రమే ఖర్చుచేయడాన్ని తప్పుబట్టింది. నిధుల విడుదల, ప్రాజెక్టుల అమలులో ఆలస్యం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపింది. నిధులు సక్రమంగా వినియోగించేందుకు పర్యవేక్షక-అమలు వ్యవస్థలను తక్షణం బలోపేతం చేయాలని జలశక్తి శాఖకు సూచించింది. ఈ మేరకు తన నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టులకు కేటాయింపు లు పెంచడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. 2024-25లో జలశక్తి శాఖకు 21,323.10 కోట్లు మాత్రమే కేటాయించగా.. 2025-26లో 25,276.83 కోట్లకు పెంచారని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు, భూగర్భ జలవనరుల నిర్వహణ, రివర్ బేసిన్ అభివృద్ధికి నిధులు పెంచడం వల్లే బడ్జెట్ పెరిగినట్లు తెలిపింది. పోలవరం పనుల పురోగతిని కమిటీ పరిశీలించింది. ‘2024-25లో ఈ ప్రాజెక్టుకు కేంద్రం 5,512.50 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో రూ.5,936 కోట్లకు పెంచింది. 2026 మార్చికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. గడువు మరో ఏడాది పొడిగించేలా నిబంధనలు చేర్చారు. 41.15 మీటర్ల ఎత్తులో ప్రా జెక్టు తొలిదశ అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు కేంద్రం ఆమోదించింది’ అని పేర్కొంది. అలాగే దేశంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలూ సమగ్ర, భవిష్యత్ దృక్పథంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం తప్పనిసరి చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. ఈ కమిటీకి టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చైర్మన్‌గా ఉన్నారు.
60 ఏళ్లకే ఆయుష్మాన్ వయ వందన కార్డులు
ప్రజల సామాజిక-ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని వర్తింపజేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ముఖ్యంగా ఆయుష్మాన్ వయ వందన కార్డులను 70 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజెన్లకు మాత్రమే పరిమితం చేశారని.. ఈ వయోపరిమితిని హేతుబద్ధం చేసి 60 ఏళ్లకు స్థిరీకరించాలని సిఫారసు చేసింది. తీవ్ర అనారోగ్యాలకు చికిత్సపై జనం భారీగా ఖర్చుచేయాల్సి వస్తోందని.. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా కవరేజీని కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. ఆరోగ్యం-కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం ఈ మేరకు రాజ్యసభకు నివేదిక సమర్పించింది.