Share News

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:19 AM

భారతీయ యువత శక్తిసామర్థ్యాలతో కచ్చితంగా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మనదేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందడం కష్టమని కొందరు అంటుంటారని.. కానీ అసాధ్యమైతే కాదని తేల్చిచెప్పారు.

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

మన యువత సామర్థ్యాలతో కచ్చితంగా ఎదుగుతాం: ప్రధాని

న్యూఢిల్లీ, జనవరి 12: భారతీయ యువత శక్తిసామర్థ్యాలతో కచ్చితంగా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మనదేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందడం కష్టమని కొందరు అంటుంటారని.. కానీ అసాధ్యమైతే కాదని తేల్చిచెప్పారు. ‘వికసిత్‌ భారత్‌’ స్ఫూర్తితో ప్రతి అడుగు, విధానం, నిర్ణయం తీసుకుంటే.. భారత్‌ను ఎవరూ ఆపలేరని తెలిపారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని ఆదివారమిక్కడ నిర్వహించిన జాతీయ యువజనోత్సవంలో.. దేశం నలుమూలల నుంచీ వచ్చిన ‘వికసిత్‌ భారత్‌ యువ నేతల చర్చ’ను ఆయన ప్రారంభించారు. ఏ దేశమైనా ముందుకు సాగడానికి భారీ లక్ష్యాలు పెట్టుకోవాలని, భారత్‌ ఇప్పుడదే చేస్తోందని ఈ సందర్భంగా అన్నారు. వివిధ రంగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే చేరుకుంటున్నామని చెప్పారు. ‘‘1930ల్లో దారుణ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి అమెరికా అగ్రరాజ్యంగా మారింది. కనీస మౌలిక వసతులు కూడా లేని వెనుకబడిన దేశంగా ఉన్న సింగపూర్‌ ప్రఖ్యాత ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని చిత్తశుద్ధితో వాటిని నెరవేర్చుకునేందుకు కృషిచేయాలని ఈ రెండు ఉదాహరణలు నొక్కిచెబుతున్నాయి. బహిరంగ మలవిసర్జన దేశంగా మారాం. కొవిడ్‌ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశాం. ప్రజలందరికీ అందించాం. వచ్చే దశాబ్దంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఈ దిశగా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నాం. వచ్చే దశాబ్దంలో మన ఎకానమీ రూ.10 లక్షల కోట్లకు చేరుతుంది. 2047 వరకు ఈ పాతికేళ్లూ మన దేశానికి స్వర్ణయుగం (అమృతకాలం). మన యువత వికసిత్‌ భారత్‌ కల నెరవేరుస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని మోదీ తెలిపారు. యువతరంపై స్వామి వివేకానందకు చాలా నమ్మకం ఉండేదని.. అన్ని సమస్యలకూ వారే పరిష్కారాలు కనుక్కుంటారని చెప్పేవారని చెప్పారు. తనకు కూడా వారిపై నమ్మకం ఉందని అన్నారు. వివేకానందుడికి నివాళులర్పించారు.

రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా సుబియాంతో

ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఇండొనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో హాజరుకానున్నారు. భారత్‌ నుంచి ఇండొనేషియా బ్రహ్మోస్‌ క్షిపణలు కొనుగోలు చేయనుందనే కథనాల నడుమ సుబియాంతో పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒప్పందం విలువ 450 మిలియన్‌ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని రక్షణశాఖ వర్గాల ద్వారా తెలిసింది. భారత పర్యటన ముగిసిన వెంటనే సుబియాంతో పాకిస్థాన్‌ వెళ్లాలనుకున్నారని, అయితే భారత్‌ అభ్యంతరం తెలపడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్‌ హాజరుకానున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 04:19 AM