Shashi Tharoor Selfie: శశిథరూర్ సెల్ఫీ కలకలం.. బీజేపీ ఎంపీతో కలిసి జర్నీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:28 PM
శశిథరూర్ ఇటీవల సొంత పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన పలు సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ఇటీవల ప్రశంసించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)కు, ఆ పార్టీ అధినాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం మధ్య తాజాగా ఓ ఫోటో కలకలం సృష్టిస్తోంది. బీజేపీ ఎంపీ జే పాండా (Jay Panda)తో విమానంలో శశిథరూర్ కలిసి ప్రయాణించారు. ఇద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీ (Selfie)ని సామాజిక మాధ్యమంలో పాండ పోస్ట్ చేశారు. ఎట్టకేలకు ఒకే దిశలో మనం ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తోందంటూ నా ఫ్రెండ్, సహ ప్రయాణికుడు చమత్కరించారంటూ పాండ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో సొంత పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న శశిథూరూర్ బీజేపీ వైపు చూస్తున్నారంటూ కొద్దికాలంగా జరుగుతున్న ప్రచారం మరోసారి ఊపందుకుంది.
MCD Elections: ఎంసీడీ ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం
థరూర్ స్పందనిదే...
జే పాండేతో సెల్ఫీపై ఊహాగానాలు వెలువడటంతో వెంటనే థరూర్ స్పందించారు. తన సహచర ప్రయాణికుడు భువనేశ్వర్ వరకూ వెళ్తున్నారని, తాను కళింగ లిటరేచర్ ఫెస్టివల్‌లో రేపు ఉదయం ప్రసంగించేందుకు వెళ్తున్నానని చెప్పారు. ఇది యాదృచ్ఛికమేకానీ, ఇందులో ఎలాంటి రాజకీయ సందేశాలు లేవన్నారు.
ఇదే మొదటిసారి కాదు
శశిథరూర్ సెల్ఫీలతో కలకలం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. కేరళ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్‌తో లిటరరీ ఈవెంట్‌లో ఆయన ఫోటో దిగడం, దానిని షేర్ చేయడం గతంలో జరిగింది. మరో ఈవెంట్‌లో కేరళలోని ఓ ఆలయంలో బీజేపీ ఎపీ, నటుడు సురేష్ గోపీతో ఆయన కనిపించారు. కాగా, శశిథరూర్ ఇటీవల సొంత పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన పలు సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ఇటీవల ప్రశంసించారు. మోదీ-ట్రంప్ సమావేశం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని, చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతిని తీసుకువచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందని శశిథరూర్ కొనియాడారు. ఇవన్నీ బీజేపీకి దగ్గరయ్యేందుకు శశిథరూర్ ఇస్తున్న సంకేతాలు కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..