Shiv Sena: కమలంతో పొత్తు పొడవొచ్చు
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:46 AM
బీజేపీతో భవిష్యత్తులో పొత్తుకు ఉన్న అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత రౌత్ వ్యాఖ్యలు
పుణె, జనవరి 11: బీజేపీతో భవిష్యత్తులో పొత్తుకు ఉన్న అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకనాడు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరూ మాకు మిత్రులే. రాజ్ ఇప్పటికీ మా మిత్రుడే. ఉద్ధవ్ మాత్రం మాకు శత్రువు కాదు’’ అంటూ శుక్రవారం నాగ్‌పూర్‌లో సీఎం ఫడణవీస్ వ్యాఖ్యానించారు. ఫడణవీస్ వ్యాఖ్యలకు స్పందనగా ఆ మరునాడే రౌత్ పైవిధంగా స్పందించారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ పేరు ప్రస్తావిస్తూ... బీజేపీకి గట్టి ప్రత్యర్థిగా ఉన్న నితీశ్ ఇప్పుడు అదే పార్టీ కూటమిలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. బీజేపీ, శివసేన మధ్య పాతికేళ్ల మిత్రత్వం ఉన్నదని, తమను బీజేపీయే వద్దనుకున్నదని రౌత్ అన్నారు. తాము భాగస్వామిగా ఉన్న మహా వికాస్ అఘాడీపై వ్యాఖ్యానిస్తూ.. తమ కూటమి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రమే ఏర్పడిందని రౌత్ అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థలకు త్వరలో జరిగే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు శివసేన (ఉద్ధవ్ వర్గం) మద్దతు ప్రకటించింది.