Slouch Caps: స్లోచ్ క్యాప్.. ఇక కనపడదు..
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:35 PM
ఎంతో చరిత్ర ఉన్న స్లోచ్ క్యాప్‌లు ఇక కనబడవు. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి నుంచి అమల్లో ఉన్న ఈ టోపీలను రద్దు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు ధరిస్తున్న టోపీల మార్పునకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేపట్టింది.

- ఎట్టకేలకు రద్దు కానున్న బ్రిటీష్ కాలం నాటి స్లోచ్ టోపీలు
- కానిస్టేబుళ్ల క్యాప్ మార్పునకు ప్రభుత్వం కసరత్తు
- 4న ప్రత్యేక సమావేశంలో తుది నిర్ణయం
బెంగళూరు: ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న టోపీలు మనవి కాదు.. బ్రిటీష్ వారి నుంచి కాపీ కొట్టినవే.. ఎన్నో ఏళ్లుగా వీటిని మర్చాలన్న డిమాండ్ ఉంది. ఇన్నేళ్ల తర్వాత కొత్త టోపీలకు మోక్షం రానుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు ధరిస్తున్న టోపీల మార్పునకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేపట్టింది. బ్రిటీష్ వారి కాలంలో దేశమంతటా స్లోచ్ క్యాప్‌లను ఉపయోగించేవారు. పలు రాష్ట్రాలలో మార్పులు వచ్చేశాయి. కానీ రాష్ట్రంలో మాత్రం అవే టోపీలను కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసు సిబ్బంది దశాబ్దాలకాలంగా టోపీ మార్చాలని డిమాండ్ చేస్తున్నా పలు కారణాలతో అది అమలు కాలేదు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: కావేరి-గుండారు-వైగై నదుల అనుసంధానం చేసి తీరతాం..
ఇటీవలే ఈ డిమాండ్ పెరగడంతో డీజీపీ అలోక్‌మోహన్(DGP Alok Mohan) కానిస్టేబుళ్ల క్యాప్‌ల మార్పు విషయమై పరిశీలించాలని ఆదేశించారు. పోలీస్ కిట్ నిర్ణయ కమిటీ సభ్యులు ఏప్రిల్ 4న ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దీంతో టోపీ మార్పు అంశానికి వారు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసుశాఖలో కానిస్టేబుళ్ల టోపీ మార్పు అంశం కొత్తేమీకాదు. గతంలోనూ పలు సందర్భాలలో ఉన్నతాధికారులకు విన్నవించారు. అయితే లక్షలాది స్లోచ్ క్యాప్‌లు సిద్ధంగా ఉండడంతో అధికారులు వాటిని మార్పు చేసేందుకు వెనుకడగు వేస్తూ వచ్చారు.
స్లోచ్ క్యాప్‌లకు ఎంతో చరిత్ర..
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు ఉపయోగించే స్లోచ్ క్యాప్‌లకు శతాబ్దపు చరిత్ర ఉంది. మైసూరు మహారాజు కాలంలో రాష్ట్ర పోలీసుశాఖ ఖాకీ షర్టు, నిక్కరు, నీలిరంగు పేటా, నల్ల బూట్లు ధరించేవారు. స్వాతంత్య్రం తర్వాత కూడా పోలీసులు అదే సంప్రదాయం కొనసాగింది. 1980-83 మధ్య కాలంలో ముఖ్యమంత్రి ఆర్ గుండూరావు పాలనలో అప్పటివరకు ఉన్న నీలంరంగుపై ఎర్రపట్టీలతో ఉండే టర్బన్‌లకు బదులుగా స్లోచ్ క్యాప్‌లను నిత్యం విధులలో పాల్గొనే సందర్భంలో పరిచయం చేశారు. అయితే పరేడ్ తదితర సందర్భాలలో మాత్రం టర్బన్‌లను వినియోగించేవారు. ఖాకీ నిక్కరుకు బదులు ప్యాంట్లు వచ్చాయి.
2018లో టోపీలను పూర్తిగా మార్చాలని నిర్ణయించారు. కానీ మార్పుల విషయం ప్రస్తావనకు రాకపోవడంతో అప్పటికే లక్షలాది క్యాప్‌లు సిద్ధంగా ఉండేవి. అవి వృథా అవుతాయని మరోసారి వాయిదా వేశారు. పాతకాలం నాటి కానిస్టేబుళ్ల క్యాప్‌లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని స్లోచ్ హ్యాట్‌లను మార్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. దీనికి తోడు నిరసనలు, ర్యాలీలు, నేరస్తులను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో స్లోచ్ హ్యాట్‌లు ఉపయోగించడం ఇబ్బందికరమనే అభిప్రాయాలు ఉన్నాయి.
క్యాప్ కిందపడితే యూనిఫాంకు భంగం కలిగించినట్లుగా భావిస్తారు. క్యాప్‌లకు ఎలాస్టిక్ వంటి వస్తువులు ఉపయోగించి తలనుంచి జారిపడకుండా ఉండేలా తయారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు ఖాకీ రంగు, ట్రాఫిక్ పోలీసులకు తెలుపురంగు టోపీలు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కానిస్టేబుళ్లకు పీక్ క్యాప్‌లను ఇస్తున్నారు.
అదే తరహాలోనే రాష్ట్ర పోలీసులకు ఇవ్వాలనే డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేకసభ జరగనుంది. ఈ డిమాండ్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. కేఎ్‌సఆర్‌పీ ఏడీజీపీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కానిస్టేబుళ్ల క్యాప్‌ల మార్పు కొలిక్కి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇన్నేళ్లకయినా పాత టోపీల స్థానంలో కొత్తవి రాబోతున్నాయని సిబ్బందిలో హర్షం వ్యక్తం అవుతోంది. సమావేశంలో తుది నిర్ణయం తీసు కోనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
Read Latest Telangana News and National News