Maha Kumbh Mela : మహాకుంభమేళా.. చీకట్లో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:44 AM
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తీవ్ర అపశ్రుతి చోటు చేసుకుంది! మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమస్థలి వద్ద బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచీ కోట్లాది మంది భక్తులు

60 మందికి తీవ్ర గాయాలు.. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లో పెను విషాదం ‘మౌని అమావాస్య’ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృతస్నానాల కోసం కోట్ల మంది రాక అనుకోని ఈ ఘటనఎంతో బాధాకరం: ప్రధాని మోదీఅరకొర ఏర్పాట్ల వల్లే: విపక్షాలుతీవ్ర రద్దీ.. మరో మూడు వారాలు అయోధ్యకు రాకండి: ట్రస్టు ఏర్పాట్లు సరిగ్గా లేక.. చీకట్లో దారి కనిపించక భక్తులకు ఇబ్బందులు చెత్త డబ్బాలు తగిలి కిందపడ్డ కొందరు వారిని తొక్కుకుంటూ ముందుకెళ్లిపోయిన మరికొందరు ఎటుచూసినా మృతదేహాలు.. బాధితుల ఆర్తనాదాలతో భీతావహంగా ఘటనాస్థలి 25 మంది మృతుల వివరాలు గుర్తింపు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఘటనపై న్యాయ విచారణ: సీఎం యోగి బుధవారం ఒక్కరోజే 7.5 కోట్ల మంది అమృతస్నానాలు ఆచరించినట్టు అంచనా
మహాకుంభ్‌నగర్, జనవరి 29: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తీవ్ర అపశ్రుతి చోటు చేసుకుంది! మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమస్థలి వద్ద బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచీ కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్‌కు చేరుకున్న వేళ.. అక్కడ తొక్కిసలాట జరిగి 40 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగిందీ విషాదం. ఒకవైపు అంబులెన్స్ సైరన్లు.. మరోవైపు పోలీసు వాహనాల సైరన్లు.. భక్తుల ఆర్తనాదాలు.. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. అయినవారిని కోల్పోయి, తీవ్రంగా గాయపడి రోదిస్తున్నవారితో.. చిందరవందరగా పడిపోయిన సంచులు, పాదరక్షలు, బ్యాక్‌ప్యాక్‌లు, దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో మేళా ఏరియాలో ఏర్పాటు చేసిన ఆస్పత్రికి, మృతదేహాలను మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చినవారిలో కొందరికి ఎముకలు విరిగిపోయాయని.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయని.. కొంతమంది అప్పటికే చనిపోయారని వైద్యుడొకరు వెల్లడించారు. అయితే, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల దాకా మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రికి మృతదేహాల తరలింపు కొనసాగుతూనే ఉందని తెలిసింది. మృతుల బంధువులు ఆ ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకుని తమవారి మృతదేహాల కోసం సాయంత్రం దాకా ఎదురుచూశారు.
చీకటిలో కనిపించక..
మౌని అమావస్య కావడంతో పది కోట్ల మంది దాకా భక్తులు వస్తారని తెలిసినా అధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని, చీకటిగా ఉండడంతో అసలు ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితి నెలకొందని.. తొక్కిసలాటకు అదే కారణమైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగమస్థలికి వెళ్లే దారిలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన చెత్తడబ్బాలు చీకటి కారణంగా కనపడకపోవడంతో కొంతమంది భక్తులు వాటిని తట్టుకుని కింద పడిపోయారని.. అప్పటికే విపరీతమైన రద్దీ ఉండడంతో వెనక వచ్చేవారు కిందపడ్డవారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘భక్తుల్లో చాలామంది చేతుల్లో బ్యాగులు, ఇతర లగేజీ ఉంది. వారు నడిచే దారిలో పెద్ద సంఖ్యలో చెత్తడబ్బాలున్నాయి. వాటిని తట్టుకుని కొంతమంది కిందపడిపోయారు. వారి చేతుల్లో ఉన్న బ్యాగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని తట్టుకొని మరికొందరు కిందపడిపోయారు. నా కాలు కూడా ఒక డస్ట్‌బిన్‌లో ఇరుక్కుపోయింది. వెనక వస్తున్నవారిలో కొందరు యువకులు ముందున్నవారిని తోసుకుంటూ వచ్చేశారు. ఈ తొక్కిడిలో నేను కిందపడిపోవడంతో.. నా కాలికి గాయమైంది. ఎలాగోలా పైకి లేచి, కిందపడిపోయిన మా అమ్మానాన్నల్ని, మరో మహిళను కాపాడి పక్కకు తీసుకెళ్లా’’ అని ప్రయాగరాజ్‌కు చెందిన వివేక్ మిశ్రా అనే కంటెంట్ క్రియేటర్ అక్కడ జరిగిన విషాదాన్ని కళ్లకు కట్టారు. ‘‘మేం రెండు బస్సుల్లో మొత్తం 60 మందిమి మహాకుంభమేళాకు వచ్చాం. తెల్లవారుజామున తొమ్మిది మంది ఒక బృందంగా వెళ్తుండగా ఉన్నట్టుండి తోపులాట మొదలైంది. దాంట్లో మేం చిక్కుకుపోయాం. ఆ తొక్కిసలాటలో మాలో చాలా మంది కిందపడిపోయాం. అన్నివైపుల నుంచి జనం ఒకరినొకరు తోసుకోవడంతో మాకు అసలు తప్పించుకునే అవకాశమే లేకపోయింది. ఎలాగోలా బయటపడ్డాం’’ అని కర్ణాటక నుంచి వచ్చిన సరోజిని అనే మహిళ తెలిపారు. పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆమె మండిపడ్డారు. ‘‘తోపులాటలో ఎటువెళ్లాలో తోచని పరిస్థితి. మమ్మల్ని తోసేస్తున్న చాలా మంది పెద్దగా నవ్వుతున్నారు. కనీసం పిల్లల మీదయునా దయచూపించాలని వేడుకున్నా వారు పట్టించుకోలేదు’’ అని ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో మహిళ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించారు. సామాన్యభక్తులతోపాటు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉండడం.. భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం కూడా తొక్కిసలాటకు కారణాలుగా చాలా మంది చెబుతున్నారు.
బ్యారికేడ్లు విరగ్గొట్టడం వల్లే..
చీకటి, ఏర్పాట్లు సరిగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భక్తులు ఆరోపిస్తుండగా.. యూపీ సర్కారు భిన్న వాదన వినిపిస్తోంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొంత మంది భక్తులు బ్యారికేడ్లను విరగ్గొట్టి అవతలివైపునకు దూసుకెళ్లడంతో.. అప్పటికే అటువైపు ఉన్నవారు వీరికింద నలిగిపోయారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహాకుంభ్ డీజీపీ వైభవ్‌కృష్ణ చెప్పడం గమనార్హం. ఈ తొక్కిసలాటలో 30 మందికిపైగా మరణించారని.. 60 మంది గాయపడ్డారని వైభవ్‌కృష్ణ బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 90 మందికి పైగా గాయపడ్డారని.. ఆస్పత్రికి తరలించేటప్పటికే వారిలో 30 మంది మరణించారని ఆయన వివరించారు. మృతుల్లో 25 మందిని ఇప్పటికే గుర్తించినట్టు చెప్పారు. వారిలో నలుగురు కర్ణాటకవాసులు, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల భక్తులు ఉన్నట్టు చెప్పారు. క్షతగాత్రుల్లో 36 మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండగా.. మిగతావారు ప్రాథమిక చికిత్స చేయించుకుని వెళ్లిపోయినట్టు తెలిపారు. ఇక.. తొక్కిసలాటకు కారణాలపై న్యాయవిచారణకు రిటైర్డ్ జడ్జి హరీశ్‌కుమార్, మాజీ డీజీపీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ డీకే సింగ్‌తో కూడిన త్రిసభ్య ప్యానెల్‌ను నియమించినట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. దీంతోపాటు విడిగా పోలీసు విచారణ కూడా జరిపించనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ఘోరం జరగడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ గురువారం ఘటనాస్థలికి వెళ్లి దీనిపై లోతైన విచారణ జరుపుతారని యోగి పేర్కొన్నారు. ప్రస్తుతం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్‌లో ఉన్నారని.. వారి భద్రతే తమకు ముఖ్యమని.. భక్తులంతా తాము ఉన్న ప్రాంతాలకు సమీపంలోని ఘాట్లలో స్నానం చేయాలని.. త్రివేణి సంగమ స్థలి వద్దకు చేరుకునే ప్రయత్నాలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
7.5 కోట్ల మంది స్నానాలు
మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో ఒక్క బుధవారంనాడే సాయంత్రం 5 గం టల సమయానికి ఆరు కోట్ల మంది.. మొత్తంగా ఏడున్నర కోట్ల మంది దాకా భక్తులు అమృతస్నానాలు ఆచరించినట్టు సమాచారం.
సాధుసన్యాసులపై పూలవర్షం
మౌని అమావాస్య సందర్భంగా తెల్లవారుజామున అమృత స్నానం ఆచరించాల్సిన సాధుసన్యాసులు, బైరాగులు.. తొక్కిసలాటలో పలువురు మరణించడంతో ఆ ప్రక్రియను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వారంతా ఊరేగింపుగా బయల్దేరగా.. అధికారులు హెలికాప్టర్లతో వారిపై పూలవర్షం కురిపించారు. వారంతా త్రివేణీ సంగమ ప్రాంతానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా అమృత స్నానం చేశారు. అఖాడాలు పవిత్ర స్నానాలు ఆచరించడానికి చక్కటి ఏర్పాట్లు చేశారంటూ అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధిపతి మహంత్ రవీంద్ర పురి ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News