Uttar Pradesh: భర్తను చంపి, ముక్కలు చేసి.. సిమెంట్ డ్రమ్ములో వేసి..
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:29 AM
తన కంటే వయస్సులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత.. ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లాడిన వ్యక్తినే అత్యంత కిరాతకంగా చంపేసింది.

ప్రియుడితో కలిసి భార్య కిరాతకం
మేరఠ్, మార్చి 19: తన కంటే వయస్సులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత.. ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లాడిన వ్యక్తినే అత్యంత కిరాతకంగా చంపేసింది. కూతురి పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇంటికొచ్చిన భర్తను ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి చంపేసింది. ఆపై, భర్త శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని తడి సిమెంట్ తో నింపిన డ్రమ్ములో వేసి అత్యంత రాక్షసంగా వ్యవహరించింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో మార్చి 4న జరిగి న ఈ ఘటన 14 రోజుల తర్వాత మంగళవారం బయటపడింది. ఈ దారుణ ఘటనలో సౌరబ్ రాజ్‌పుత్(29) అనే మర్చంట్ నేవీ అధికారి.. తన భార్య ముస్కాన్ రస్తోగి(27), ఆమె ప్రియు డు సాహిల్(25) చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేరఠ్‌కు చెందిన సౌరబ్, ముస్కాన్ 2016లో ప్రేమ వివా హం చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలనే ఆలోచనతో పెళ్లి అయిన కొన్నాళ్లకు సౌరభ్ తన మర్చంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈ నిర్ణయంతో సౌరభ్ కుటుంబంలో గొడవలు జరగ్గా.. సౌరభ్ భార్యతో కలిసి మేరఠ్‌లోనే వేరు కాపురం పెట్టాడు.
సౌరభ్ దంపతులకు 2019లో ఓ కుమార్తె జన్మించింది. కానీ, ముస్కాన్‌కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే సంగతి బయటపడడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన సౌరభ్ కుమార్తె భవిష్యత్తు కోసం ఆలోచించి వెనక్కి తగ్గాడు. ఆపై, మర్చంట్ నేవీలో తిరిగి చేరేందుకు 2023లో లండన్ వెళ్లాడు. అయితే, ఫిబ్రవరి 28న తన కుమార్తె ఆరో పుట్టిన రోజు సందర్భంగా 2025 ఫిబ్రవరి 24న సౌరభ్ ఇంటికి తిరిగొచ్చాడు. మరోపక్క, సౌరభ్‌ను ఎలాగైనా హతమార్చాలని ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ అప్పటికే నిర్ణయించుకున్నారు. ముందస్తు పథ కం ప్రకారం.. మార్చి 4న నిద్రమాత్రలు కలిపిన భోజనాన్ని ముస్కాన్ తన భర్తకు వడ్డించింది. ఆ ఆహారం తిని అతను నిద్రలోకి జారుకోగానే.. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్‌ను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం సౌరభ్ శరీరాన్ని దాదాపు 15 ముక్కలు చేసి.. వాటిని ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి.. తడి సిమెంట్‌తో నింపేశారు. ఆపై, ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచేసి.. ముస్కాన్, సాహిల్ కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి వెళ్లారు. తమ వెంట తీసుకెళ్లిన సౌరభ్ ఫోన్‌తో అతని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ తాము చేసిన కిరాతకాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారు. అయితే, ఎన్నిసార్లు ఫోన్లు చేసినా సౌరభ్ నుంచి స్పందన లేకపోవడంతో అనుమానించిన అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నారు.
మా అమ్మాయిని ఉరి తీయండి..
భర్తను హత్య చేసిన ముస్కాన్‌కు ఉరి శిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు విలేకరులతో అన్నారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతో ప్రేమించాడని, అతనిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్ చివరికి ప్రాణాలు కూడా తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.