సలహా
ABN , Publish Date - Jan 16 , 2025 | 07:30 AM
సాధారణంగా పెరిగే వయసుతోపాటు ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్(పి.ఎం.ఎస్) తగ్గుముఖం పడుతుంది. కానీ అరుదుగా కొందరిలో అది ఎంతకీ అదుపులోకి రాదు. పెళ్లై, పిల్లలున్న కొందరు మహిళలను కూడా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది.
నెలసరితో అదుపు తప్పే భావోద్వేగాలు
డాక్టర్! మా అమ్మాయికి 18 ఏళ్లు. నెలసరి సమయంలో చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. విపరీతమైన కోపం, ప్రతి చిన్న విషయానికీ చిరాకు పడిపోతూ ఉంటుంది. నెలసరి సమయంలో ఈ మార్పు ఎందుకు? ఈ భావోద్వేగాలను ఎలా అదుపు చేయాలి?
- ఓ సోదరి, హైదరాబాద్.
సాధారణంగా పెరిగే వయసుతోపాటు ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్(పి.ఎం.ఎస్) తగ్గుముఖం పడుతుంది. కానీ అరుదుగా కొందరిలో అది ఎంతకీ అదుపులోకి రాదు. పెళ్లై, పిల్లలున్న కొందరు మహిళలను కూడా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే తొలి నెలసరి కనిపించే 13 ఏళ్ల వయసు నుంచీ 20 - 25 ఏళ్ల వయసువరకూ ఈ రకమైన ‘మూడ్ స్వింగ్స్’ సర్వసాధారణం. ఈ మార్పులన్నిటికీ నెలసరి సమయంలో శరీరంలో చోటుచేసుకునే హార్మోన్ల హెచ్చుతగ్గులే కారణం. ఈ విషయాన్ని తల్లులతోపాటు, పిల్లలూ అర్థం చేసుకోవాలి. తల్లులు పిల్లలకు ఇదంతా సహజమైనవనే భరోసా కల్పించాలి.
అప్పుడేం చేయాలంటే?
అలాగే ఆ భావోద్వేగాలను అదుపు చేయడం కోసం యోగా, లేదంటే క్రమం తప్పక వ్యాయామం చేయించాలి. పీరియడ్స్‌కి రెండు రోజుల ముందు నుంచీ ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఒకవేళ ఈ లక్షణాలు నెలసరికి 10 రోజుల ముందు నుంచీ మొదలై, నెలసరి పూర్తయిన తర్వాత కూడా కొనసాగుతూ, లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యులను కలవాలి. ఈ సమస్యకు క్యాప్సూల్ రూపంలోని విటమిన్ ఇ, ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ వాడితే ఫలితం ఉంటుంది.
డాక్టర్ కీర్తి,
స్త్రీల నిపుణులు, హైదరాబాద్.