అద్దం మెరిసేలా...
ABN , Publish Date - Jan 16 , 2025 | 07:23 AM
మనం రోజూ అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో అద్దాన్ని చేతులతో పట్టుకున్నపుడు దాని మీద వేలి ముద్రలు పడుతుంటాయి. డ్రెస్సింగ్ మిర్రర్ మీదయితే దుమ్ము ధూళి పేరుకుపోతుంటాయి. ఇలాంటపుడు అద్దంలో ముఖం సరిగా కనిపించదు. వీటన్నింటినీ పోగొడుతూ అద్దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం!

- ప్రతిరోజూ అద్దాన్ని కాగితంతో గట్టిగా తుడవాలి. దీనివల్ల అద్దం మీద ఉన్న చేతి గుర్తులు, దుమ్ము తొలగిపోతాయి. అద్దం మసకగా కనిపిస్తుంటే దానిమీద రెండు నీటి చుక్కలు చల్లి మరో కాగితంతో రుద్ది తుడవాలి. అద్దం పూర్తిగా శుభ్రమవుతుంది.
- అద్దం మీద మరకలు ఎక్కువగా ఉంటే రెండు చుక్కల వైట్ వెనిగర్ వేసి సన్నని వస్త్రం లేదా కాగితంతో తుడవాలి.
- అద్దం లేదంటే డ్రెస్సింగ్ మిర్రర్ మీద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లాలి. రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత పేపర్ నాప్‌కిన్ లేదా చిన్న రుమాలుతో తుడిచేస్తే అద్దం చక్కగా మెరుస్తుంది
- ఒక కప్పు నీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిని ఓ స్ర్పే బాటిల్‌లో పోసి అద్దం మీద చిలకరించాలి. తరవాత చిన్న తువాలుతో తుడిచేస్తే అద్దం తళతళలాడుతుంది.
- ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా ఉప్పు వేసి కరగించండి. దీనిలో చేతిరుమాలు ముంచి నీటిని పిండి దానితో అద్దాన్ని తుడిస్తే ఎలాంటి మొండి మరకలైనా శుభ్రంగా పోతాయి. అద్దం కొత్తదానిలా మెరుస్తుంది.
- అద్దం మీద మురికి ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీళ్లు చల్లి మెత్తని బట్టతో తుడిచేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
- అద్దం మీదికి వేడి నీటి ఆవిరి పడేలా చేయాలి. తరవాత కాగితంతో తుడిచేస్తే మరకలన్నీ పోయి అద్దం శుభ్రంగా ఉంటుంది.