Share News

అందుకే ఈ పోరాటం!

ABN , Publish Date - Jan 16 , 2025 | 07:55 AM

ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌)కు... ఓఆర్‌ఎస్‌-ఎల్‌కు మధ్య తేడా తెలుసా? తెలుసుకోకుండా మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల పౌడర్లు, పానీయాలను ఉపయోగిస్తే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు అంటున్నారు డాక్టర్‌ శివరంజని సంతోష్‌. ఈ అంశంపై ఆమె పోరాటం కూడా చేస్తున్నారు. ఆ వివరాలను ‘నవ్య’తో పంచుకున్నారు

అందుకే ఈ పోరాటం!

అందుకే ఈ పోరాటం!

వారియర్‌

ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌)కు... ఓఆర్‌ఎస్‌-ఎల్‌కు మధ్య తేడా తెలుసా? తెలుసుకోకుండా మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల పౌడర్లు, పానీయాలను ఉపయోగిస్తే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు అంటున్నారు డాక్టర్‌ శివరంజని సంతోష్‌. ఈ అంశంపై ఆమె పోరాటం కూడా చేస్తున్నారు. ఆ వివరాలను ‘నవ్య’తో పంచుకున్నారు

డయేరియాతో బాధపడుతూ, ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన పిల్లలను తల్లితండ్రులు నా దగ్గరకు తీసుకొచ్చేవారు. వాళ్లను ఆరా తీస్తే, మందుల షాపుల్లో, రెడీమేడ్‌ టెట్రాప్యాక్‌లో దొరికే ఓఆర్‌ఎస్‌ పానీయాలను పిల్లలకు ఇస్తున్నట్టు తెలిసింది. వాటిని తెప్పించుకుని చూస్తే, అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన అసలైన ఓఆర్‌ఎ్‌సలు కావనీ, చక్కెర మోతాదులు ఎక్కువగా కలిగి ఉన్న ఓఆర్‌ఎస్‌ మారు రూపాలనీ, వాటి వల్లే పిల్లల్లో డీహైడ్రేషన్‌ పెరిగి, ఆరోగ్యం క్షీణిస్తోందనీ కనిపెట్టాను. అధిక చక్కెర వల్ల విరోచనాలు మరింత పెరిగి, డీహైడ్రేషన్‌ రెట్టింపై, పిల్లల్లో ప్రాణాంతక పరిస్థితి తలెత్తుతుంది. ఈ రకమైన మోసాన్ని నేను భరించలేకపోయాను. అన్ని మందుల షాపుల్లో, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. తీయగా ఉండడంతో పిల్లలూ, పెద్దలూ వీటిని తాగుతున్నారు. కలరాతో పాటు ఎండదెబ్బకు గురైన సందర్భాల్లో, వ్యాధుల నుంచి కోలుకునే సమయాల్లో, నీరసాన్ని దూరం చేసుకోవడం కోసం వీటి మీదే ఆధారపడుతున్నారు. ఇది ప్రమాదకరం. అందుకే గత ఆరేళ్లుగా ఓఆర్‌ఎ్‌సల మీద ఉద్యమం చేస్తున్నాను.


ప్రజలు తప్పుదోవలో...

ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌)ను ఒక ఔషధంగా వర్గీకరించడం జరిగింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్ట్‌ కంట్రోల్‌ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తయారుచేయాలి. కానీ కొన్ని కంపెనీలు ఆ ప్రమాణాలకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఫార్ములాకు భిన్నంగా ఓఆర్‌ఎ్‌సను ఇష్టారాజ్యంగా తయారుచేసి మార్కెట్లో ప్రవేశపెడుతూ ఉండడంతో, వాటికి అడ్డుకట్ట వేయాలని, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్ట్‌ కంట్రోల్‌కు ఉత్తరం రాశాను. వాళ్లు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయమని అన్నారు. దాంతో ఆ సంస్థకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తర్వాత, 2022లో టెట్రాప్యాక్‌ల మీద ఓఆర్‌ఎస్‌ ఆక్షరాలను ఉపయోగించకుండా నిషేధిస్తూ సంస్త, ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రెండు నెలల తర్వాత ఓఆర్‌ఎ్‌స‘ఎల్‌’ అనే మరొక పదంతో, ఎనర్జీ డ్రింక్‌ల పేరుతో ఈ ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తాయి. నిజానికి మన దేశంలోని ఔషఽధ చట్టాల్లో, ప్రజల్ని తప్పుదోవ పట్టించే లేబుల్స్‌ వాడకూడదనే నియమం ఉంది. ఈ నియమాన్ని ఖాతరు చేయకుండా, ఎన్నో ఓఆర్‌ఎ్‌సఎల్‌ పానీయాలు రూపొందుతూనే ఉన్నాయి. నియమాల ఉల్లంఘన నెపాన్ని తప్పించుకోవడం కోసం... ‘డయేరియా సమయంలో వాడకూడదు’ అనే సూచనను చిన్న అక్షరాల్లో ముద్రించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నాయి. దాంతో ఓఆర్‌ఎ్‌సకూ, ఓఆర్‌ఎ్‌సఎల్‌కూ మధ్య తేడాను కనిపెట్టలేని వినియోగదారులు వీటిని విరివిగా కొని వాడుకుంటున్నారు. దీని వల్ల తల్లితండ్రులు మోసపోవడం, పిల్లలు ఆరోగ్యాన్ని నష్టపోవడం పరిపాటిగా మారుతోంది. కాబట్టి ఎవరో ఒకరు ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే, మున్ముందు మరెంతో మంది పిల్లల విలువైన ప్రాణాలను నష్టపోవలసి వస్తుంది. ఇలాంటి పానీయాలకు చోటు కల్పించవద్దని అన్ని కార్పొరేట్‌ ఆస్పత్తులకూ, ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకూ ఉత్తరాలు రాయబోతున్నాను. 2022లో తెలంగాణా హైకోర్టులో నకిలీ ఓఆర్‌ఎ్‌సలకు వ్యతిరేకంగా ఒక పిల్‌ కూడా వేశాను. ప్రస్తుతం ఎండోక్రైన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, విమెన్‌ పీడియాట్రిక్‌ ఫోరం మద్దతుతో నా పోరాటాన్ని మరింత ముమ్మరం చేయబోతున్నాను.


సామాజిక మాధ్యమాల ద్వారా...

అంతర్జాలంలో లెక్కలేనంత తప్పుడు సమాచారం అందరికీ అందుబాటులో ఉంటోంది. దాన్ని గుడ్డిగా అనుసరించి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్లూ ఉంటున్నారు. అలాగే మనలో చాలా మందికి ప్రాథమిక చికిత్సల పట్ల కూడా అవగాహన ఉండడం లేదు. గొంతులో ఆహారం అడ్డుపడడం మూలంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లే హఠాత్పరిణామాల్లో ఎలా వ్యవహరించాలో తెలియదు. నిజానికి ఈ పరిస్థితి నాక్కుడా ఎదురైంది. ఎమ్‌డి చదివే రోజుల్లో రేగి పండు నా గొంతులో విరుక్కుపోయి, ఊపిరి అందక ఎంతో సతమతమైపోయాను. ఆ సమయంలో తోటి ఇంటర్న్‌ హౌస్‌ సర్జన్‌, అరుణ్‌ వెంటనే స్పందించి, సహాయపడడంతో ప్రాణాలతో బయటపడ్డాను. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ల ద్వారా ఓఆర్‌ఎస్‌, ఫస్ట్‌ఎయిడ్‌, సిపిఆర్‌, అపోహల పట్ల కూడా అవగాహన కల్పిస్తున్నాను. మా అమ్మాయి అదితితో కలిసి, ఇప్పటివరకూ 20 వేల మందికి ఫస్ట్‌ ఎయిడ్‌, సిపిఆర్‌లలో శిక్షణ ఇచ్చాను. తెలుగు సినీ కథానాయకుడు నాని కూడా నా దగ్గర సిపిఆర్‌ శిక్షణ తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

- గోగుమళ్ల కవిత

Updated Date - Jan 16 , 2025 | 07:59 AM