Share News

Rimjim Joshi Shinde: ప్రేమతో మొదలై!

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:25 AM

రోడ్డు ప్రమాదంలో వీధి కుక్క ఒకటి తీవ్రంగా గాయపడి... మరణించింది. ఆ దృశ్యం రిమ్‌జిమ్‌ జోషీ షిండేను కలచివేసింది.

Rimjim Joshi Shinde: ప్రేమతో మొదలై!

రోడ్డు ప్రమాదంలో వీధి కుక్క ఒకటి తీవ్రంగా గాయపడి... మరణించింది. ఆ దృశ్యం రిమ్‌జిమ్‌ జోషీ షిండేను కలచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా... వీధుల్లో తిరిగే శునకాలకు రక్షణగా... ఏదైనా చేయాలని ఆ క్షణమే ఆమె నిర్ణయించుకున్నారు. వెంటనే కార్యక్షేత్రంలోకి దిగారు. క్యూఆర్‌ కోడ్‌ రిఫ్లెక్టివ్‌ కాలర్స్‌ తయారీ మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అదే ఆమెను వ్యాపారవేత్తను చేసింది. పేద మహిళలకు ఉపాధి మార్గమైంది.

‘‘ఒక చిన్న ప్రయత్నం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇది నేను అస్సలు ఊహించలేదు. రాత్రిళ్లు రోడ్డుపై సంచరించే వీధి కుక్కలు చీకట్లో వాహనదారుల కంట పడకపోవడంవల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. నా ఆలోచనల్లా... ఈ ప్రమాదాల నుంచి వాటిని రక్షించాలని. అదే నేడు ఒక చక్కని ఆవిష్కరణకు కారణమైంది. నేను రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌గల రిఫ్లెక్టివ్‌ కాలర్స్‌... వీధుల్లో తిరిగేవాటికే కాదు, పెంపుడు కుక్కలకూ రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. రేడియం స్టికర్లలా లైటు పడగానే వాటి మెడలోని కాలర్‌ మెరుస్తుంది. దాంతో వాహనదారులు అప్రమత్తమవుతారు. దీనివల్ల మూగజీవాలకే కాదు... నాకు కూడా ఒక ఆదాయ వనరు అయింది. ‘పా’జిటివిటీ అనే కంపెనీ ఏర్పాటుకు కారణమైంది. మరికొంతమంది పేద మహిళలకు ఉపాధి కల్పించే సాధనమైంది.

ఆ ఘటన కలచివేసింది...

నేను కంపెనీ ప్రారంభించడం వెనుక బలమైన కారణమే ఉంది. అది 2015. ఓ రాత్రి వేళ. వీధిలోకి వెళితే రోజూ కనిపించే శునకం. రోడ్డుపై సంచరిస్తూ ఏదో బండి కింద పడింది. ప్రాణాలు కోల్పోయింది. సదరు వ్యక్తి నిర్లక్ష్యంవల్ల కాదు... చిమ్మ చీకట్లో అది అతని కంటికి కనిపించకపో వడంవల్ల ప్రమాదం జరిగిందని అర్థమైంది. రోడ్డునపోయే వారు ఆ శునకాన్ని బతికించడానికి ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. ఇంటి సమీపంలో జరిగిన ఆ దృశ్యం నన్ను కలచివేసింది. దీనికి ఒక పరిష్కారం కావాలి. మనలాగే జంతువులకు కూడా ఈ సమాజంలో జీవించే హక్కు ఉంది. ఆ హక్కును పరిరక్షించడానికి నావంతుగా రోడ్లపై సంచరించే జంతువులకు రక్షణ కల్పించాలని అనుకున్నాను. అందులో నుంచి పుట్టిందే కుక్కల మెడలో మెరిసే బెల్టుల ఆలోచన. అదే మా ‘పాజిటివిటీ’కి అంకురార్పణ అయింది.

చిన్న ఆలోచనే... కానీ...

నా మదిలో మెదిలిన ఒక చిన్న ఆలోచన... నేడు పెను ప్రభావం చూపిస్తోంది. వీధి శునకాలే కాదు, యజమానుల నుంచి తప్పిపోయిన పెంపుడు కుక్కలకు కూడా మా ఉత్పతత్తి ఒక వరంలా మారింది. రోడ్డు ప్రమాదాల నుంచి వాటికి రక్షణ కలుగుతోంది. అలాగే తప్పిపోయిన శునకాలు క్యూఆర్‌ కోడ్‌ కాలర్‌వల్ల తిరిగి ఇంటికి చేరుతున్నాయి. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే, వాటి యజమాని పేరు, అడ్రెస్‌ ఉంటాయి. వీధికుక్కలైతే అవి ఏ ప్రాంతానికి చెందినవి, వ్యాక్సినేషన్‌ అయిందా లేదా తదితర వివరాలు ఉంటాయి. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ జంతు ప్రేమికులు అభినందించారు. స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాలవారు కూడా వచ్చి మా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఏడాది తిరిగేలోపే అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. అందరికీ అందుబాటు ధరలో ఉండాలనే ఉద్దేశంతో యాభై, అరవై రూపాయలకే ఈ కాలర్స్‌ విక్రయిస్తున్నాం.


పని మనిషి సహకారంతో...

2016లో మా సంస్థ ప్రారంభమైంది. అయితే మొదట కాలర్స్‌ తయారు చేద్దామని అనుకున్నప్పుడు వాటి గురించి నాకు అస్సలు ఎలాంటి అవగాహన లేదు. ఎలా చేయాలి? దానికి కావల్సిన సామగ్రి ఎక్కడ దొరుకుతుంది? ఎంత ఖర్చవుతుంది? ఇవేవీ తెలియదు. ఆ సమయంలో మా ఇంట్లో పని చేసే రీనా భరోసా ఇచ్చింది. మెటీరియల్‌ ఎక్కడ లభిస్తుందో తెలుసునని, తనకు కుట్టు పనిలో కూడా ప్రవేశం ఉందని చెప్పింది. ఎలా మొదలుపెట్టాలో తెలియని నాకు రీనా రూపంలో చక్కని మార్గం కనిపించింది. అవసరమైన సామగ్రి తెచ్చి, ఇద్దరం కలిసి పని ప్రారంభించాం. మావారు తుషార్‌ కూడా మాకు అండగా నిలిచారు.

పేద మహిళలకు ఆసరా...

క్రమంగా ఆర్డర్లు పెరుగుతున్నాయి. మేం ముగ్గురం కష్టపడితే సరిపోవడంలేదు. ఆర్డర్లు పెండింగ్‌లోకి వెళ్లిపోతున్నాయి. దాంతో మరికొంతమంది ఉద్యోగులను తీసుకొందామనుకున్నాను. మా సంస్థ తొలి అడుగు ఒక మహిళతోనే మొదలైంది. కాబట్టి... అదే దారిలో మరింత మంది పేద మహిళలకు ఉపాధి కల్పిస్తే చేసే పనికి ఒక సార్థకత ఉంటుందని అనిపించింది. ఆసక్తి గల గ్రామీణ మహిళలను గుర్తించి, వారికి శిక్షణనిచ్చాం. రోజువారీ పనులు చూసుకొంటూనే, ఇంటి వద్దే పని చేసే వెసులుబాటు కల్పించాం. ఇప్పుడు వారు నెలకు పదిహేను నుంచి పద్ధెనిమిది వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో పని ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దీపావళి టపాసుల మోత భరించలేక పెంపుడు కుక్కలు పారిపోతుంటాయి. అందుకే అలాంటి సమయాల్లో ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. ఏదిఏమైనా మా ‘పాజిటివిటీ’ ద్వారా అణగారిన వర్గాల గృహిణులకు ఒక ఉపాధి మార్గం దొరికింది. ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము జీవించే అవకాశం లభించింది. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది.’’


అవంటే భయం... కానీ...

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మాది. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ముఖ్యంగా జంతు సంరక్షణకు సంబంధించి పలు ప్రాంతాల్లో పర్యటించాను. అయితే నాకు కుక్కలంటే చచ్చేంత భయం. అవంటే ప్రేమే కానీ... దగ్గరకు వెళ్లాలంటే వణుకు. అలాంటిది ఇప్పుడు వాటి మధ్యనే గడుపుతున్నాను. ప్రస్తుతం మా కంపెనీ టర్నోవర్‌ 70 లక్షల రూపాయలు దాటింది. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధి సాధించాం. వచ్చినదాంట్లో కొంతమొత్తం వీధి కుక్కల కోసం ఖర్చు చేస్తున్నాను. వాటికి వైద్యం, వ్యాక్సినేషన్లతో పాటు రోజూ ఆహారం అందిస్తున్నాను.

Updated Date - Jan 08 , 2025 | 04:25 AM