Ramagiri MPP Elections: పెనుకొండకు రామగిరి పాలిటిక్స్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:03 PM
ఏడాది క్రితం రామగిరి ఎంపీపీ మీనిగ నాగమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ, వైసీపీ శ్రేణులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

రామగిరి ఎంపీపీ ఎన్నికలు జిల్లా రాజకీయాలను రసవత్తరంగా మార్చేశాయి. గత కొద్దిరోజుల నుంచి టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ గొడవ పెనుకొండకు చేరింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ ఎంపీటీసీలను పెనుకొండ తహసీల్దార్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పెనుకొండ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వైసీపీ ఎంపీటీసీలను బెంగళూరు వైపు తీసుకెళ్లిపోయారు.
వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
వైసీపీ, టీడీపీ వర్గీయులు బుధవారం ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే సోమందేపల్లిలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. గురువారం జరగబోయే ఎంపీపీ ఎన్నికలకు ఆటంకం సృష్టిస్తున్నారంటూ పోలీసులు ఆయన్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉషశ్రీ అరెస్ట్‌ను ఖండించారు. వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు.
ఎంపీపీ పీఠం కోసం యుద్ధం
సంవత్సరం క్రితం రామగిరి ఎంపీపీ మీనిగ నాగమ్మ అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఎలాగైనా సరే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ, వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నిన్న వైసీపీ నాయకులు హరినాథరెడ్డి, రామాంజినేయులు, నాగిరెడ్డి విప్ జారీ కోసం రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. వీరికి టీడీపీ నాయకులు ఎదురుపడటంతో మాటామాటా పెరిగి గొడవ మొదలైంది. కొద్దిసేపటికే పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ రత్న, ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇవి కూడా చదవండి:
Viral Video: దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో..
Viral Video: మరీ అంత ఓవరాక్షన్ అవసరమా..