ఎక్కడికైనా... గంటలోపే...
ABN , Publish Date - Jan 12 , 2025 | 09:58 AM
దిల్లీ నుంచి అమెరికాకు నలభై నిమిషాల్లో వెళ్లొచ్చు... ఇది కలా? నిజమా? అసలు ఊహకే సాధ్యం కాని ప్రశ్న. కానీ, భవిష్యత్తులో నిజం కావొచ్చు.. అమెరికాకు చెందిన ఎలాన్‌మస్క్ నెలకొల్పిన స్పేస్‌ఎక్స్ ఇప్పుడు ఆ పనిలోనే బిజీగా ఉంది. గత ఏడాది చివర్న స్టార్‌షిప్‌ను విజయవంతంగా ప్రయోగించి.. ఎర్త్ టు ఎర్త్ జర్నీకి ఆశలు రేపింది...
దిల్లీ నుంచి అమెరికాకు నలభై నిమిషాల్లో వెళ్లొచ్చు... ఇది కలా? నిజమా? అసలు ఊహకే సాధ్యం కాని ప్రశ్న. కానీ, భవిష్యత్తులో నిజం కావొచ్చు.. అమెరికాకు చెందిన ఎలాన్‌మస్క్ నెలకొల్పిన స్పేస్‌ఎక్స్ ఇప్పుడు ఆ పనిలోనే బిజీగా ఉంది. గత ఏడాది చివర్న స్టార్‌షిప్‌ను విజయవంతంగా ప్రయోగించి.. ఎర్త్ టు ఎర్త్ జర్నీకి ఆశలు రేపింది...
1992.. న్యూయార్క్..
‘‘ఏమో.. ఎవరికి తెలుసు? ఈ భూమ్మీద మనందరికీ నూకలు చెల్లే రోజొకటి వస్తుందేమో?’’ క్యాంటీన్‌లో కాఫీ తాగుతూ చెప్పాడు ఎలాన్‌మస్క్.
‘‘పిచ్చోడిలా ఉన్నావే? నీవి ఎప్పుడూ వింత ఆలోచనలే.. దెయ్యాలు మాట్లాడినట్లే ఉంటుంది..’’ అంటూ విసుక్కున్నారు దోస్తులు.
‘‘లేదు లేదు.. మీరు విన్నది నిజమే! చూస్తుండండి కొన్నేళ్లకు అదే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో భూగోళం నివాసయోగ్యం కాకపోవచ్చు. అందుకే మరో ప్రత్యామ్నాయ ఆవాసం వెతకాలి. మనిషి మనుగడ సాగించాలంటే రెండో ఇల్లు తప్పనిసరి..’’ అంటూ మళ్లీ రెట్టించాడు. అప్పుడాయన వయసు ఇంచుమించు ఇరవై ఏళ్లు. దుందుడుకు స్వభావం. దూకుడు మనస్తత్వం. విపరీత ఆలోచనలు. ఎలాన్‌మస్క్ అనగానే మనుషుల్లో మనిషిగా కాకుండా ప్రత్యేక మరమనిషిగా వింతగా చూసేవారంతా!.
2024 టెక్సాస్..
యావత్ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. ఆ ప్రయోగం విజయవంతమైతే కొత్త చరిత్ర తిరగరాయడం ఖాయం. టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్‌విల్లెలోని బోకాచికా అనే నిర్జనప్రదేశం. బైనాక్యులర్స్‌తో చూస్తున్నారంతా!. క్షణక్షణం ఉద్విగ్నభరితం. ‘‘ఏమవుతుంది?.. ఏమవుతుంది? ఎగురుతుందా? ఎగిరొచ్చి మళ్లీ ఇక్కడే వాలిపోతుందా? లేదంటే మధ్యలోనే పేలిపోతుందా?’’ రకరకాల సందేహాలు, ప్రశ్నలు. వాళ్ల కళ్లముందున్నది.. స్పేస్‌ఎక్స్ తయారుచేసిన నిలువెత్తు స్టార్‌షిప్. ఏళ్ల శ్రమకు ప్రతిరూపం. మోటార్ల శబ్దం మొదలైంది. నిప్పులు చిమ్ముకుంటూ పైకెగిరింది. కాసేపటికి నిర్దేశించిన లక్ష్యం చేరుకుని.. మళ్లీ వచ్చి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ‘‘హమ్మయ్యా’’ అంటూ ఊపిరిపీల్చుకున్నారంతా. ప్రపంచం చప్పట్లు కొట్టింది. లైవ్‌లో ఆ లాంచింగ్ చూస్తున్న ఎలాన్‌మస్క్ కళ్లలో మెరుపు. కాసింత గర్వం. పిడికిళ్లు బిగించి తన ఏళ్ల కసిని నేలకేసి కొట్టినంత పని చేశాడు. రీయూజబుల్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది.
మస్క్ కల ఇదే..
న్యూయార్క్ క్యాంటీన్‌లో ముప్పయి మూడేళ్ల కిందట ఎలాన్‌మస్క్ కన్న కల... ఈ ‘స్టార్‌షిప్’. దీంతో ఏం చేయబోతున్నాడు? తను అనుకున్నట్లే భూగోళానికి ఆయుష్షు తీరేలోగా మరో గ్రహం (అంగారకుడు) మీదికి జనాన్ని తీసుకెళ్లాలి. ముప్పావు గంటలో టైమ్‌మిషిన్‌లా భూగోళంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలగాలి. అది అయ్యే పనేనా? ఆయన ఊహించినట్లు భూగ్రహానికి ఇప్పటికిప్పుడు ముప్పు ఎందుకొస్తుంది? అన్నవి వేరే ప్రశ్నలు. ఇప్పటికే హాలీవుడ్‌లో ఈ అంశంపై అనేక వైజ్ఞానిక, కాల్పనిక చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే! ‘ఇంటర్‌స్టెల్లార్’ సినిమా అలాంటిదే!. ఇదలా ఉంచితే..
గ్రహాంతర ప్రయాణానికి ముందు.. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం గంటలోపు చేరుకునేలా స్టార్‌షిప్‌ను సన్నద్ధం చేయడం మస్క్ తొలి లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే ఆరుసార్లు ఈ రాకెట్‌ఫ్లైట్‌ను పైకి వదిలాడు. రెండుసార్లు ఫెయిలైనా.. నాలుగుసార్లు విజయవంతం అయ్యింది. కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ కేంద్రంగా ఈ పరిశోధనలు జరిగాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టార్‌బేస్ (స్పేస్‌క్రాఫ్ట్ వదిలే ప్రాంతం) ల నుంచే వీటిని వదిలారు. స్టార్‌షిప్ ప్రయాణం ఎంత వేగమంటే ఊహకందనంత!. సాధారణంగా.. దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు (12,371 కి.మీ.) ఎయిర్ ఇండియా విమానంలో వెళితే 15 ్ఠగంటలు పడుతుంది. అదే స్టార్‌షిప్‌లో ప్రయాణిస్తే కేవలం 40 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే.. నగరాల్లో ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకున్నంత సేపట్లో అమెరికాలో ఉండొచ్చన్న మాట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎలాన్‌మస్క్ లక్ష్యం ఇదే! స్టార్‌షిప్ వల్ల 95 శాతం సమయం ఆదా అవుతుంది.
ఇప్పుడున్న విమానాలకంటే 22 రెట్లు అధిక వేగం దీని సొంతం. ఇది ఎయిర్‌క్రాఫ్ట్ సాంకేతికతతో కాకుండా రాకెట్ పరిజ్ఞానంతో రూపొందింది. విమానంలా టేకాఫ్ అవ్వదు. రాకెట్‌లా నిట్టనిలువున (వర్టికల్) పైకెగురుతుంది. మళ్లీ అదే స్థితిలో నిటారుగా ల్యాండ్ అవుతుంది. విమానాశ్రయ రన్‌వేలు అక్కర్లేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుపగ్రిల్‌లాంటి గూడు చాలు. ఇది పూర్తిగా పునర్వినియోగ వాహనం. ఒక్కో స్టార్‌షిప్ లాంచింగ్‌కు పది కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది కాబట్టి రీయూజబుల్ టెక్నాలజీతో తయారుచేయడం వల్ల ఖర్చు తగ్గుతుందన్నది మస్క్ ఆలోచన. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణికుల్ని చేరవేసే కొత్త రవాణా సదుపాయం స్టార్‌షిప్‌తోనే సాధ్యం అవుతుంది. ఇప్పటికే అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) మద్దతు సాధించాడు ఎలాన్‌మస్క్. దీంతో స్పేస్‌ఎక్స్ తరఫున ఎర్త్ టు ఎర్త్ కార్యక్రమానికి ముందడుగు పడిందనే చెప్పొచ్చు.
చారిత్రక ప్రయోగం..
స్టార్‌షిప్ పొడవు 394 అడుగులు. సుమారు 35 అంతస్థుల ఆకాశహార్మ్యం అంత ఎత్తు ఉంటుంది. తొలిదశలో వంద మంది ప్రయాణికులను తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. స్టార్‌షిప్‌కు బూస్టర్ తోడు ఉంటుంది. సగం దూరం వెళ్లాక షిప్‌తో విడిపోయిన బూస్టర్ స్టార్‌బేస్‌లోకి వచ్చి ల్యాండ్ అవుతుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు అత్యాధునిక సాంకేతికతతో తయారైన అత్యంత శక్తిమంతమైన 33 రాప్టార్ ఇంజన్లు ఉంటాయి. పదమూడు ఇంజన్లు మధ్యలో, మరో ఇరవై బూస్టర్ చుట్టూ అమర్చారు. క్రయోజనిక్ లిక్విడ్‌ఆక్సిజన్, లిక్విడ్ మీథేన్‌ల మిశ్రమం అయిన మెథాలాక్స్ ఇంధనంగా పనిచేస్తుంది. రాప్టార్ ఇంజన్లు ఎంత పవర్‌ఫుల్ అంటే.. చంద్రుడు, అంగారక గ్రహాలపైకి కూడా స్టార్‌షిప్‌ను అవలీలగా తీసుకెళ్లగలవు.
ఈ వాహనం గంటకు ఇరవై ఏడు వేల కి.మీ. వేగంతో దూసుకెళుతుంది కాబట్టి .. ఆ ఒత్తిడిని తట్టుకునేంత దృఢమైన ఉక్కు కవచాన్ని కప్పారు శాస్త్రవేత్తలు. ఇక, స్టార్‌షిప్ లోపల విమానాల్లోలాగ ఆహార సరఫరా, టాయ్‌లెట్ల వంటివేవీ ఉండవు. గంటలోపు ప్రయాణం కాబట్టి అక్కర్లేదు. అందులోనూ మితిమీరిన వేగంతో వెళుతుంది కనక ప్రయాణికులు పైకిలేచి కదిలే అవకాశం లేదు. రాకెట్‌లా ఎగిరినప్పుడు.. కిందికి ల్యాండ్ అయినప్పుడు అచ్చం డిస్నీ స్పేస్ మౌంటెయిన్ రోలర్ కోస్టర్‌లా ఉంటుందని ఊహిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది కేవలం ఎర్త్ టు ఎర్త్ ప్రయాణాలకే కాదు.. భవిష్యత్తులో అంతరిక్షంలోని వ్యోమగాములకు సరుకుల్ని చేరవేయడం.. కక్ష్యలో తిరిగే అంతరిక్షనౌకలకు ఇంధనాన్ని సరఫరా చేయడం.. చంద్రమండలం, అంగారకుడిపైకి వ్యోమగాముల్ని పంపడం వంటివన్నీ స్టార్‌షిప్ చేస్తుంది. దీని తయారీ అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి..
మళ్లీ మళ్లీ తిరిగి వాడేందుకు అనువైన సాంకేతికతో (రీయూజబుల్) తయారుచేసింది స్పేస్‌ఎక్స్. మొదట్లో వంద శాతం ఖర్చు పెట్టాల్సిందే! పునర్వినియోగం జరిగిన ప్రతిసారీ పది శాతం ఖర్చు తగ్గుతూ వస్తుంది. స్టార్‌షిప్ తయారీకి 90 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు వార్తలు వచ్చాయి. వాహనానికి వాడే ఒక్కో రాప్టార్ ఇంజిన్ ఖరీదు 2.50 లక్షల డాలర్లు. ఒక ట్రిప్పు వెళ్లినప్పుడు.. ఇంధనానికే పది నుంచి ఇరవై లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. విమానాల్లా స్టార్‌షిప్‌ను షటిల్ సర్వీసులా మార్చినప్పుడు వ్యయభారం మరింత తగ్గుతుంది. స్పేస్‌ఎక్స్ అంచనా ప్రకారం.. ప్రస్తుతం ఎయిర్‌కార్గోలో కిలో బరువున్న వస్తువుల్ని చేరవేయడానికి మూడు నుంచి ఏడు డాలర్లు ఖర్చు అవుతుంది. స్టార్‌షిప్ ఒకసారి భూకక్ష్యలోకి లగేజీని తీసుకెళ్లడానికి అదే కిలోకు మూడొందల డాలర్లు వ్యయం అవుతుంది.
పదిసార్లు వెళ్లొస్తే ముప్పయి డాలర్లకు.. వందసార్లు పునర్వినియోగిస్తే మరింత ఖర్చు తగ్గుతుందన్నది ఒక అంచనా. ఇంధన భారం కూడా ఎక్కువ కాబట్టి.. సౌరశక్తి, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సొంతంగా తయారుచేసుకునే దిశగా స్పేస్‌ఎక్స్ ఆలోచన చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇవన్నీ ప్రయోగదశలో ఉన్నాయి. స్పేస్‌టూరిజంలో స్పేస్‌ఎక్స్‌తో పాటు అనేక కంపెనీలు పోటీపడి ఈ రంగంలోకి దూసుకొచ్చాయి. యునైటెడ్‌లాంచ్ అలయెన్స్, బ్లూఆరిజన్, వర్జిన్ గలాక్టిక్, రాకెట్‌ల్యాబ్, చైనా, ఎన్‌వైఎక్స్, రిలేటివిటీ స్పేస్ వంటివన్నీ అలా వచ్చాయి. ఇదంతా చూస్తే స్పేస్‌రేస్ మొదలైనట్లే!.
నాసా స్ఫూర్తితో..
అంతరిక్షయానం కూడా ఇప్పుడు వ్యాపారమయం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎలాన్‌మస్క్ స్టార్‌షిప్పే అందుకు నిదర్శనం. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ చేస్తున్న ప్రయోగాలకు కచ్చితంగా అమెరికాకు చెందిన నాసా ప్రేరణగా నిలిచింది. అంతకుమునుపు ఏళ్లతరబడి నాసా చేస్తున్న ప్రయోగాలు, కక్ష్యలోకి వదిలిన అంతరిక్షనౌకలకు సంబంధించిన విజయాలు ఈ రంగానికి గట్టి పునాదిని వేశాయి. నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అంతరిక్షనౌకలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి నిరంతరాయ ప్రయోగాలు చేస్తూనే ఉంది. అంతరిక్షప్రయోగాలు, రాకెట్ల పరిజ్ఞానానికి రెండో ప్రపంచ యుద్ధమప్పుడు బీజం పడింది. ఆ యుద్ధ సమయంలోనే జర్మనీ బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి పూనుకుంది. 1930-40 ప్రాంతంలో నాజీ జర్మనీ సుదూర లక్ష్యాన్ని ఛేదించే రాకెట్లను ఆయుధాలుగా చేసుకుంది. అప్పట్లో లండన్‌పై దాడులు జరిగాయి.
రాకెట్ల హవా మొదలైంది. ఈ సంఘటనలతో అమెరికా-రష్యాల మధ్య అంతరిక్ష పోటీ రాజుకుంది. ఎవరికి వారు ఈ రంగంలో అడుగుపెట్టకపోతే వెనకబడిపోతామన్న భయంతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. 1957, అక్టోబర్4న తొలి ఆర్టిఫిషియల్ ఎర్త్ శాటిలైట్ అయిన ‘స్పుత్నిక్ 1’ ను అంతరిక్షంలోకి వదిలింది రష్యా. ఆ మరుసటి ఏడు అమెరికా కూడా ‘ఎక్స్‌ఫ్లోరర్-1’ అనే శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపింది. మూడేళ్ల తర్వాత (1961) రష్యాకు చెందిన లెఫ్టినెంట్ యూరిగగారిన్ అనే వ్యోమగామి వోస్టాక్-1లో భూకక్ష్యలోకి (327 కి.మీ.) వెళ్లొచ్చాడు. ఆ సాహసం చేసిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించడం అప్పట్లో సంచలనం. అదే సమయంలో అలెన్‌షెఫర్డ్ అంతరిక్షంలోకెళ్లి... ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా చరిత్రకెక్కాడు. ఆ దేశానికే చెందిన జాన్‌గ్లెన్ కూడా ఆర్బిట్‌ఎర్త్‌లోకి వెళ్లడం ఇంకో అద్భుతం.
1970లకు వచ్చేసరికి అంతరిక్షంలో అమెరికా తొలి స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం అంటే భూమిచుట్టూ కక్ష్యలో తిరిగే ఒక పెద్ద అంతరిక్షనౌక. వీటన్నిటి ఫలితంగా.. శాటిలైట్ కమ్యూనికేషన్ అభివృద్ధి చెందింది. విప్లవాత్మక ఫలితాలు లభించాయి. ఇళ్లల్లో డిష్ యాంటెన్నాల సహాయంతో శాటిలైట్‌ల ద్వారా సిగ్నల్స్‌ను పొంది.. టీవీ ప్రసారాలను తిలకించారు జనం. కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహాలు భూగోళ వాతావరణాన్ని పరీక్షించడం ప్రారంభించాయి. అంటార్కిటికాలో ఓజోన్ పొరకు అతి పెద్ద రంధ్రం పడిందన్న విషయాన్ని కనుక్కున్నాయి. అరణ్యాల్లో దావానలం వంటి ఉపద్రవాలను గుర్తించాయి. 1986 చెర్నోబిల్ వద్ద జరిగిన అణువిద్యుత్ ప్లాంట్ విపత్తు సంఘటన ఛాయాచిత్రాలను అందించాయి శాటిలైట్స్. కొత్త నక్షత్రాల ఉనికిని కూడా పసిగట్టడం మరో విశేషం. దీంతో గెలాక్సీని కొత్త కోణంలో చూడటానికి శాటిలైట్ టెక్నాలజీ ఎంతో పనికొచ్చింది.
షటిల్ సర్వీసులతో..
అమెరికాకు చెందిన నాసా అంతరిక్ష పరిశోధనల ప్రయాణంలో మరో మైలురాయి.. షటిల్ ప్రోగ్రామ్. 1981లో కొలంబియా స్పేస్‌షటిల్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. పునర్వినియోగ షటిల్ సర్వీస్ ఇలా మొదలైందనే చెప్పవచ్చు. ఇది 2003లో టెక్సాస్‌లో పదహారు నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా పేలిపోయింది. ఏడుగురు వ్యోమగాములు చనిపోయారు. 1986లో వదిలిన ఆర్బిటర్ ఛాలెంజర్ సైతం పైకి ఎగిరిన 73 నిమిషాల్లో బద్దలైంది. అప్పుడు కూడా ఏడుగురు బలయ్యారు. అమెరికా వదిలిన ఈ రెండు స్పేస్‌షటిల్స్ వైఫల్యంపై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. కొంత విరామం తర్వాత డిస్కవరీ, ఎండీవర్, అట్లాంటిస్ షటిల్స్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది అమెరికా. ఇవన్నీ తిరిగి సురక్షితంగా భూవాతావరణంలోకి ప్రవేశించాయి. పునర్వినియోగానికి వీలైంది. షటిల్స్ ద్వారా విలువైన భూవాతావరణ, ఖగోళ సమాచారాన్ని రాబట్టారు శాస్త్రవేత్తలు. ఇలా.. అమెరికా ముప్పయి ఏళ్ల షటిల్ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది. స్పేస్‌ఎక్స్‌లాంటి సంస్థలకు దారులను ఏర్పరిచింది.
సవాళ్లూ ఉన్నాయ్..
నాసా అంతరిక్షనౌకలు షటిల్‌సర్వీసుల్లా కక్ష్యలోకి వెళ్లడం.. తిరిగి సురక్షితంగా కిందికి చేరుకోవడం.. ఈ రంగం పట్ల ఒక నమ్మకాన్ని కలిగించింది. ఎలాన్‌మస్క్ స్పేస్‌ఎక్స్ కంపెనీ నెలకొల్పడానికి నాసా విజయాలే ప్రేరణగా నిలిచాయి. వందేళ్ల భవిష్యత్తును ఊహించి పనిచేయడం ఎలాన్‌మస్క్ దూరదృష్టికి నిదర్శనం. నాసా అంతరిక్షనౌకలు సక్సెస్ కావడం.. అంతరిక్షయాన పరిశోధనల కోసం పెట్టుబడిదారులు ఆసక్తిచూపించడం.. అంగారకగ్రహంపై నివాసానికి అవకాశముందన్న ఆశలు చిగురించడం.. అంతరిక్షయాత్రలకు కుబేరులు సిద్ధం కావడం.. అత్యంత వేగంగా ప్రయాణించే రవాణా సదుపాయాలకు డిమాండ్ ఏర్పడటం.. ఈ పరిణామాలన్నీ ఎలాన్‌మస్క్ ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లాయి. స్పేస్‌టూరిజంలో వస్తున్న ఆ మార్పును ముందే పసిగట్టిన ఆయన స్పేస్‌ఎక్స్ ద్వారా స్టార్‌షిప్ తయారీకి పూనుకున్నాడు.
కొన్నేళ్ల నుంచి కోట్లు కుమ్మరిస్తూ వృథా చేస్తున్నాడనీ, ఆ ప్రాజెక్టు ఎప్పటికయ్యేననీ, అసలు ప్రభుత్వ అనుమతులు ఎలా వస్తాయనీ.. లెక్కలేనన్ని విమర్శలు మస్క్‌ను వెంటాడాయి. అయినా సందిగ్ధంలో పడలేదు, భయపడి వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు తనముందున్న ఏకైక లక్ష్యం ఒక్కటే.. గంటలోపు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలిగే స్టార్‌షిప్‌ను ప్రపంచానికి అందించడం. ఇప్పటికి ముప్పావువంతు పని పూర్తయింది. అనేకసార్లు స్టార్‌షిప్‌ను ప్రయోగాత్మకంగా వదిలాడు. అనుకున్న ఫలితాలు వచ్చాయి. స్పేస్‌క్రాఫ్ట్ తయారీ, ఇంధన ఖర్చులు తగ్గించడం, అనుమతులు తీసుకోవడం, ప్రయాణఛార్జీలను అందుబాటులోకి తీసుకురావడం, సురక్షిత ప్రయాణానికి వీలుకల్పించడం... ఇవన్నీ ఎలాన్‌మస్క్ ముందున్న సవాళ్లు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. కొన్నేళ్లకు భూగోళంపై మరో కొత్త వాహనం స్టార్‌షిప్ బయలుదేరుతుంది. మనం కూడా దిల్లీ నుంచి న్యూయార్క్‌కు నలభై నిమిషాల్లో చేరుకునే అవకాశం లభిస్తుంది. కాల పరీక్షకు స్టార్‌షిప్ నిలబడుతుందో లేదో వేచిచూద్దాం.
- మల్లెంపూటి ఆదినారాయణ స్టార్‌షిప్‌లో ప్రయాణానికి పట్టే సమయం..
- లండన్ నుంచి న్యూయార్క్ 29 నిమిషాలు.
- న్యూయార్క్ నుంచి ప్యారిస్ 30 నిమిషాలు
- హొనొలులు నుంచి టోక్యో 30 నిమిషాలు
- టోక్యో నుంచి దిల్లీ 30 నిమిషాలు
- సిడ్నీ నుంచి సింగపూర్ 31 నిమిషాలు
- లాస్‌ఏంజిల్స్ నుంచి లండన్ 32 నిమిషాలు
- లండన్ నుంచి హాంకాంగ్ 34 నిమిషాలు
- లండన్ నుంచి కేప్‌టౌన్ 34 నిమిషాలు
- సిడ్నీ నుంచి దిల్లీ 36 నిమిషాలు
- శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి దిల్లీ 40 నిమిషాలు
- న్యూయార్క్ నుంచి సిడ్నీ 49 నిమిషాలు
- ఎలాన్‌మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టాడు. తండ్రి ఎరోల్ ఆ దేశస్థుడే!. ఆయన ఎలకో్ట్ర మెకానికల్ ఇంజనీర్. తల్లి మాయె కెనడా వాస్తవ్యురాలు. ఆమె పేరున్న మోడల్. ఎలాన్‌మస్క్‌కు అందరిలా అందమైన బాల్యం లభించలేదు. తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. చిన్నప్పటి నుంచే సంఘర్షణ మొదలైంది.
- మస్క్ పన్నెండేళ్ల వయసు నుంచే సంపాదన బాట పట్టాడు. ‘పిసి అండ్ ఆఫీస్ టెక్నాలజీ’ అనే మ్యాగజైన్‌కు ‘బ్లాస్టర్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి విక్రయించాడు. అప్పుడొచ్చిన తొలి సంపాదన ఐదొందల డాలర్లు.
- పాతికేళ్లప్పుడు ఉడుకురక్తం కదా! ఊరకుంటాడా? ఏదోఒకటి చేయాలని పరుగులుపెట్టాడు మస్క్. సరిగ్గా 24 ఏళ్లకే ‘జిప్2’ అనే కంపెనీ నెలకొల్పాడు. తన సోదరుడు కింబల్‌మస్క్, మిత్రుడు గ్రెగ్ కౌరిలు కూడా భాగస్వాములు. కొన్నేళ్ల తర్వాత కంపాక్ అనే సంస్థ (1999) 307 డాలర్లకు జిప్2ను కొనుగోలు చేసింది.
- సాహసమే ఆయన ఊపిరి. అప్పటి వరకు కష్టపడి అభివృద్ధి చేసిన ‘ఎక్స్.కామ్’ని 2000 సంవత్సరంలో కన్ఫినిటీలో విలీనం చేశాడు మస్క్. ఇది 2001లో ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాం ‘పేపాల్’గా మారింది. ఆ తర్వాత ఏడాది ఈ సంస్థను ఈ-బే 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. పేపాల్ ఇప్పుడో పెద్ద సంస్థ.
- అంతరిక్షయానంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ‘స్పేస్‌ఎక్స్’ను 2002లో స్థాపించాడు ఎలాన్‌మస్క్. ఏరోస్పేస్, అంతరిక్ష పర్యాటక, రవాణా సేవలను అందిస్తుందీ సంస్థ. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయాణం చేయడం, భూమ్మీద గంటలోపు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించడం దీని లక్ష్యం. రాబోయే రోజుల్లో అంగారకగ్రహంపైకి మనుషుల్ని, సరుకుల్ని పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది స్పేస్‌ఎక్స్.
- విద్యుత్ వాహనాల్లో విప్లవం తీసుకొచ్చిన సంస్థ ‘టెస్లా మోటర్స్’ను 2004లో ఏర్పాటు చేశాడు మస్క్. తొలి వాహనం ‘రోడ్‌స్టర్’ను 2008లో విడుదల చేశాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థగా టెస్లా పేరు తెచ్చుకుంది. అమెరికాలో కొత్తతరానికి టెస్లా కారు కొనుక్కోవడం ఒక కల.
- భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలను సృష్టించడం మస్క్‌కు అలవాటు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణలో భాగంగా 2006లో సౌరవిద్యుత్ ఉత్పత్తి సంస్థ సోలార్‌సిటీని ఏర్పాటు చేశాడాయన.బంధువులైన పీటర్, లిండన్ రైవ్‌లు భాగస్వాములు. 2016లో సోలార్‌సిటీని టెస్లా కొనుగోలు చేసింది. ఇప్పుడు ‘టెస్లా ఎనర్జీ’ పేరుతో సౌరవిద్యుత్ సేవలు అందిస్తోంది.
- రేపు అన్నదే ఆయన చూపు అని ముందే అనుకున్నాం కదా!. మస్క్ మదిలో పుట్టిన ఆ అత్యాధునిక ఆలోచన ‘ఓపెన్ ఏఐ’. లాభాపేక్ష లేకుండా కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) సేవలు అందించే సాంకేతిక సంస్థ ఇది. చిటికెలో కోరుకున్న సమాచారాన్ని అందిస్తుంది.
- పర్వతప్రాంతాల్లో, భూగర్భంలో, గనుల్లో టన్నెల్స్‌ను తవ్వడం, నిర్మించడం సవాళ్లతో కూడుకున్న పని. అలాంటి పనులు చేసేందుకు మస్క్ నెలకొల్పిన సంస్థ ‘ద బోరింగ్ కంపెనీ’. ఇది కేవలం టన్నెల్స్‌ను మాత్రమే నిర్మిస్తుంది. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్, లాస్‌వెగాస్‌లలో భారీ ప్రాజెక్టులను చేపట్టింది. అయితే ఎలాన్‌మస్క్ అంత ఫోకస్ పెట్టని కంపెనీల్లో ఇదొకటి.
- ‘న్యూరాలింక్ కార్పొరేషన్’ కూడా ఎలాన్‌మస్క్ కంపెనీల జాబితాలో ఒకటి. 2024లో స్థాపించాడు. న్యూరోటెక్నాలజీ కంపెనీ ఇది. మెదడులో చిప్‌లను అమర్చి కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మెదడును యంత్రాల ద్వారా నియంత్రించే సాంకేతికత మీద పనిచేస్తోందీ కంపెనీ.
ఇప్పటి వరకు అంతరిక్షయానం కథలతో వచ్చిన కొన్ని ఆసక్తికర చిత్రాలు..
- 2001: A Space Odyssey (1968)
- Alien (1979)
- The Right Stuff (1983)
- Enemy Mine (1985)
- Apollo 13 (1995)
- Star Trek: First Contact (1996)
- The Fifth Element (1997)
- Starship Troopers (1997)
- October Sky (1999)
- Mission to Mars (2000)
- Serenity (2005)
- Moon (2009)
- Gravity (2013)
- Interstellar (2014)
- The Martian (2015)
- Hidden Figures (2016)