ఏఐ మోసాలతో కాస్త జాగ్రత్త..
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:54 AM
పండగ వచ్చిందంటే కొత్త దుస్తులు... కొత్త వస్తువులు... అంతా షాపింగ్ హడావిడే. ఓ వైపు ఈ- కామర్స్ సైట్లు ఆకట్టుకునే పనిలో ఉంటే.. మరోవైపు కస్టమర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇటీవల కృతిమమేధ (ఏఐ) సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
పండగ వచ్చిందంటే కొత్త దుస్తులు... కొత్త వస్తువులు... అంతా షాపింగ్ హడావిడే. ఓ వైపు ఈ- కామర్స్ సైట్లు ఆకట్టుకునే పనిలో ఉంటే.. మరోవైపు కస్టమర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇటీవల కృతిమమేధ (ఏఐ) సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అలాంటి మోసాల బారినపడకుండా... అప్రమత్తంగా ఉండేందుకు సైబర్ నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలివి...
సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోని నకిలీ ప్రకటనలు, డీల్స్‌కు ప్రభావితమై 31 శాతం మంది వినియోగదారులు వారి నుంచి కొనుగోలు చేస్తున్నారట. అలాగే స్కామర్స్ ఫిషింగ్ ద్వారా 60 శాతం మోసాలకు పాల్పడుతున్నారట.
సైబర్ నేరగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ సైట్ల పేరుతో అచ్చంగా అలాగే ఉన్న ఫేక్ వెబ్ సైట్‌లను సృష్టించి కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఆన్‌లైన్‌లో ఆకర్షణీయంగా కనిపించగానే ఆర్డర్ పెట్టకుండా... ఆ వెబ్‌సైట్ నకిలీదా? అసలుదా? అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
పండగ సీజన్లలో మనదేశంలో దాదాపు 45 శాతం మంది షాపింగ్ మోసాలకు గురవుతున్నారని తేలింది. వారిలో 56 శాతం మంది డబ్బు కోల్పోతున్నారు. ఇందులో 39 శాతం మంది ఈమెయిల్స్ ద్వారా నకిలీ సందేశాలను పొందుతుంటే... 31 శాతం మంది టెక్ట్స్ ద్వారా, 30 శాతం మంది సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా 18-34 ఏళ్ల వయసువారు ఎక్కువగా ఇటువంటి మోసాలకు బలవుతున్నారు.
ఒకప్పుడు ఫొటోలను మార్ఫింగ్ చేసి నకిలీవి తయారుచేసేవారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కృత్రిమమేధ సాయంతో అచ్చంగా ఒరిజినల్ అనిపించేలా నకిలీ ఫొటోలు, వీడియోలు తయారు చేస్తున్నారు. సెలబ్రిటీల డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలతో వినియోగదారులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారి లిప్ మూమెంట్, ముఖ కవళికలు, చేతివేళ్ల కదలికలను నిశితంగా గమనించాలి.
సినీతారలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ఆడియోను వాయిస్ క్లోనింగ్ టెక్ సాయంతో సెకన్లలోనే రీక్రియేట్ చేసి సైబర్ మోసగాళ్లు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆయా వస్తువులను కొనే ముందు వారి పెదవుల కదలికను జాగ్రత్తగా గమనించడం మంచిది.
ఫిషింగ్ ద్వారా స్కామర్స్ ఆన్‌లైన్ షాపింగ్ మోసాలకు పాల్పడు తున్నారు. అంటే నమ్మదగిన ఈ-కామర్స్ సంస్థల లోగో, బ్యానర్, సిగ్నేచర్‌ను వాడుకొని, ఈ-మెయిల్స్, టెక్ట్స్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫేక్ డిస్కౌంట్‌లు, డీల్స్‌ను అందిస్తున్నట్టుగా నకిలీ లింక్స్ పంపిస్తుంటారు. వాటిపై క్లిక్ చేయగానే, మన బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి లింక్ వచ్చినా... పరిశీలించి జాగ్రత్తగా ముందడుగు వెయ్యాలి.
వీటిపై దృష్టి పెట్టండి...
- ఈ-కామర్స్ సైట్‌లో కనిపించే ఆఫర్లు, డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 70 శాతం డిస్కౌంట్ అనే ప్రకటనలు చూడగానే ఆకర్షితులు కాకుండా... ముందుగా దాని రివ్యూస్ చూడాలి. వెరీఫైడ్, అథెంటిక్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి సదరు ఆఫర్ల గురించి చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలి.
- పరిమిత కాలం ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను అస్సలు పట్టించుకోవద్దు.
- ఈ-మెయిల్‌లో వచ్చిన లింకును ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు. బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లలోకి వెళ్లి ఆఫర్ గురించి తెలుసుకోవడమే.
- మోసపూరిత మెయిల్స్‌లో కంపెనీల పేర్లకు సంబంధించి అక్షర దోషాలు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా గుర్తిస్తే మోసపోకుండా ఉండొచ్చు.
- యూఆర్‌ఎల్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి.
- చెల్లింపుల విషయానికొస్తే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (రెండంచెల ధ్రువీకరణ) విధానాన్ని వినియోగించాలి. దీనివల్ల అదనపు రక్షణ ఉంటుంది.