పక్షులే వీళ్ల ప్రాణం..
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:12 AM
వారికి పక్షులే ప్రాణం.. వారికి పక్షులు తప్ప మరో ధ్యాసే లేదు.. ఆ పక్షుల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే వారి హాబీలనై ఓ ప్రత్యేక కథనం.

స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్ తెలుసుగానీ, స్పారోమాన్, ప్యారట్‌మాన్ గురించి తెలుసా? వీరికి ఎలాంటి శక్తి లేదు. కేవలం సామాన్యులు. పక్షులంటే ప్రాణం. వాటి కోసమే తమ జీవితాన్ని అంకితం చేశారు. స్పారోమాన్ బెంగళూరులో ఉంటే... ప్యారట్‌మాన్ చెన్నైలో ఉంటారు. వారి గురించిన ఆసక్తికర విశేషాలివి..
ఎడ్విన్ జోసెఫ్... 74 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి. ఈ బెంగళూరువాసి ఇంట్లో రోజూ పిచ్చుకల సందడి ఉంటుంది. నీళ్ల తొట్లు, మట్టి కుండలు.. పిచ్చుక గూళ్లుతో ఆయన ఇల్లు ఓ అభయారణ్యంలా ఉంటుంది. రోజూ డెబ్బయికి పైగా పిచ్చుకలు జోసెఫ్ ఇంటికి వచ్చి ఆహారాన్ని తింటాయి. అక్కడే గుడ్లు పెడతాయి. పిల్లల్ని పొదుగుతాయి. ‘డేగలు, గద్దల బారిన పిచ్చుకలు పడకుండా కాపాడే వాచ్‌మాన్‌ను నేను’ అంటారీయన.
అమ్మమ్మ జ్ఞాపకాల వల్లే...
‘‘నా బాల్యం మీద అమ్మమ్మ ప్రభావం చాలా ఉంది. సాయంత్రం పూట ఇంటికొచ్చిన పిచ్చుకలకు గింజలు వేసేది. ఇలా వేస్తే మంచిదని చెప్పేది. అలా పిచ్చుకలతో నాకు అనుబంధం ఏర్పడింది. నేను ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యాను. ఇరవై ఏళ్ల క్రితం నా భార్యతో కలసి ఓ సాయంత్రం మాట్లాడుతుంటే రెండు పిచ్చుకలు వచ్చాయి. చేటలో బియ్యం చెరుగుతోంటే.. అందులోని గింజలను వాటికి వేశా. అలా రోజూ చేస్తుంటే పన్నెండు పిచ్చుకల వరకూ వచ్చేవి. పిచ్చుకలకు ఏదైనా చేయాలనుకున్నా. కొందరు చిన్న చెట్లు తెచ్చారు. ఇంటి మీదనే గూళ్లు నిర్మించా. అలా మెల్లగా పిచ్చుకలు మా ఇంటికి అలవాటయ్యాయి. రెండు వందలకు పైగా పిచ్చుకలు వచ్చేవి. ఎంతో సందడిగా ఉండేదప్పుడు.
ఆ రోజు మర్చిపోలేనిది..
నా భార్యా, పిల్లలే కాదు... మనమళ్లు, మనమరాళ్లూ పిచ్చుకలంటే ఇష్టపడేవారు. నా ఇంటి వెనుక ఉన్న ఇంటిపై సెల్‌ఫోన్ టవర్ ఉండేది. దాని వల్ల కొన్నాళ్లు పిచ్చుకలు రాలేదని గ్రహించా. ఆ టవర్‌ను తీసేసేదాకా ఊరుకోలేదు. టవర్ తీసేసిన తర్వాత తిరిగి పిచ్చుకల రాక మొదలయ్యింది. ప్రతీరోజూ వాటి కోసం ఎదురుచూస్తూనే ఉంటా. ఒక రోజు ఓ స్కూల్ విద్యార్థిని వచ్చి.. ఎండు టెంకాయలతో చేసిన గూళ్లు ఇచ్చింది. ఈ గూళ్లు మా నాన్నతో కలసి చేశానంది. అవే నా జీవితంలో గొప్ప క్షణాలు. ఆ రోజు మర్చిపోలేను. పిచ్చుకలను పట్టించుకోకపోతే మన మనుగడే లేదనేది వాస్తవం. అందుకే నాలో ప్రాణం ఉన్నంతందాకా వాటి సంరక్షణ కోసం పాటుపడుతూనే ఉంటా.’’
- - -
చెన్నైలోని సుదర్శన్ షా ఇంటి దగ్గర రామచిలుకల రాగాలు వినిపిస్తుంటాయి. ఇంటి మీదనే కాదు ఇంటి దగ్గర ఉండే చెట్లమీద సుమారు ఆరువేల చిలుకలు ఎగురుతూ కనిపిస్తాయి. గత పదిహేనేళ్ల నుంచి సుదర్శన్ షా ఈ చిలుకలకు ఆహారాన్ని వేస్తున్నాడు. అందుకే చిలుకల స్వర్గధామంగా మారింది ఆయన ఇల్లు.
‘ప్యారట్ అప్పా’
‘చిలుకల వీధంతా పచ్చని రంగు పులుము కుని ఉంటుంది. ప్రశాంతత, శాంతికి కేరాఫ్ అడ్రస్ షా ఇల్లు’ అంటారు కాలనీవాసులు. ఈయన ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటలకు తన ఇంట్లోకి వీక్షకులను అనుమతిస్తారు. పుట్టినరోజు, పెళ్లి రోజు అనీ... ఉద్యోగం వచ్చిందనీ.. ఇలా ప్రతి శుభవేళ వీక్షకులు ఆయన ఇంటికి వచ్చి చిలుకలకు బియ్యం, పల్లీలు వేస్తారు.
చిలుకలకు మంచి నీళ్లు ఉన్నాయా? లేదా.. ఇతర పక్షులతో ఇబ్బంది ఉందా? అంటూ నిరంతరం డేగకళ్లతో పరిశీలిస్తుంటాడీ పక్షి ప్రేమికుడు. ప్రతీరోజూ ఇంటిమీద రెండు గోడలను కలుపుతూ పొడవాటి చెక్కలు వేస్తారు. వాటి ఉపరితలం మీద ఆహారాన్ని పెడతారు. ఈ ఆహారం తినటానికి రోజూ కనీసం ఆరువేల చిలుకలు వస్తాయి. బర్డ్‌మాన్, ప్యారట్‌మాన్, ప్యారట్ అప్పా, ప్యారట్ సుదర్శన్.. అని పిలుస్తూ ఆయనతో ఫొటోలు దిగుతారు సందర్శకులు. ‘‘రామచిలుకలే నా జీవితం. వాటి సందడితోనే రోజు ప్రారంభమవుతుంది. అవే నా ఏంజెల్స్’’ అంటారు సుదర్శన్ తన క్యాప్‌ను సవరిస్తూ..!

12 ఏళ్లకే ఇంట్లో న్యూ క్లియర్ రియాక్టర్ నిర్మాణం..

వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ చిన్న చిట్కాలు ..

విమానాల్లో ఇచ్చే ఫుడ్స్ రుచిలో తేడా! కారణం ఇదే

మీది నిజంగా డేగ చూపా.. ఈ ఫొటోలో పిల్లిని పట్టుకోండి
