Share News

Shahid Diwas: ఘనంగా అమరవీరుల దినోత్సవం.. ఆ ముగ్గురినీ స్మరించుకుంటూ..

ABN , Publish Date - Mar 23 , 2025 | 09:05 AM

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ పోరాటంతోనే కాదు లక్షలాది మంది విప్లవకారుల ప్రాణ త్యాగాలతోనూ ముడిపడి ఉంది. ఎంతో మంది వీరులు నిస్సంకోచంగా, తృణప్రాయంగా భరతమాత కోసం ప్రాణాలను అర్పించారు.

Shahid Diwas: ఘనంగా అమరవీరుల దినోత్సవం.. ఆ ముగ్గురినీ స్మరించుకుంటూ..
Shahid Diwas

ఇంటర్నెట్ డెస్క్: భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు.. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు. వీరి పేర్లు వింటేనే భారతీయుల రక్తం దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అలాంటి దేశభక్తులను ఉరి తీసిన రోజు నేడే. 23 మార్చి, 1931న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరితీసింది. 17, డిసెంబర్ 1928న బ్రిటన్ అధికారి శాండర్స్‌ను హత్య చేయడం, పార్లమెంట్‌లో బాంబులు వేయడం వంటి కారణాలను చూపి ముగ్గురినీ ఉరితీశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా ఆ రోజును అమరవీరుల దినోత్సవం(షహీద్ దివస్)గా జరుపుకుంటారు.


భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కేవలం రాజకీయ పోరాటంతోనే కాదు లక్షలాది మంది విప్లవకారుల ప్రాణ త్యాగాలతోనూ ముడిపడి ఉంది. ఎంతో మంది వీరులు నిస్సంకోచంగా, తృణప్రాయంగా భరతమాత కోసం ప్రాణాలను అర్పించారు. అలాగే భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు సైతం దేశ స్వేచ్ఛ కోసం సంతోషంగా ప్రాణాలను త్యాగం చేశారు. వారి ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర పోరాటం మరింతగా విజృంభించింది. వారిని ఉరితీశారని తెలుసుకున్న ప్రతి భారతీయుడూ కథం తొక్కాడు. లక్షలు, కోట్లుగా రోడ్లపైకి వచ్చి ఆందోళకు దిగారు. ఎట్టకేలకు బ్రిటీష్ సామ్రాజ్య మెడలు వంచి దేశానికి విముక్తి కల్పించారు.


అమరవీరుల దినోత్సవం చరిత్ర..

1919 చట్టం పనితీరును సమీక్షించి రాజ్యాంగ సంస్కరణల కోసం సిఫార్సులు చేసేందుకు 1927లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 1928లో భారతదేశానికి వచ్చింది. అయితే ఏడుగురు సభ్యులున్న సైమన్ కమిషన్‌లో భారతీయులు ఎవ్వరూ లేకపోవడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసన ప్రదర్శనలకు లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించారు. అయితే, బ్రిటిష్ పోలీస్ అధికారి జేమ్స్ స్కాట్ ఆదేశాల మేరకు నిరసనకారులపై అక్టోబర్ 30న లాఠీఛార్జ్ జరిగింది. ఈ ఘటనలో లాలా లజపతి రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. రెండు వారాల తర్వాత 1928 నవంబర్ 17న ఆయన గుండెపోటుతో మరణించారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం వల్లే లజపతి రాయ్ మృతిచెందారని వైద్యులు విశ్వసించారు. దీంతో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు.. జేమ్స్ స్కాట్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. లజపతి రాయ్ మరణించిన నెల తర్వాత డిసెంబర్ 17న శాండర్స్ అనే అధికారిని జేమ్స్ స్కాట్‌గా తప్పుగా భావించి హత్య చేశారు. ఈ కేసులో 1931 మార్చి 23న రాత్రి 07:30 గంటలకు లాహోర్ జైలులో ముగ్గురినీ ఉరితీశారు.


భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల బలిదానం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. భారత్ విముక్తికి బాటలు వేసింది. దీంతో ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున వారి త్యాగాలను స్మరించుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Lok Sabha delimitation: పాతికేళ్లు వాయిదా వేయాలి

Delhi High Court: జస్టిస్‌ వర్మపై విచారణ

Updated Date - Mar 23 , 2025 | 10:26 AM