PM Modi AC Scheme: మోదీ ఫ్రీ ఏసీ యోజన స్కీం..ప్రభుత్వం నిజంగా ఉచిత ఏసీ ఇస్తుందా
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:52 AM
ఈ ఏడాది ఉగాది నుంచి “మోదీ ఉచిత ఏసీ యోజన 2025” అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రభుత్వమే ఉచితంగా గృహాలకు ఏసీలు ఇస్తున్నారంటూ పలు పోస్టులు చేస్తున్నారు. ఇది నిజమేనా కాదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్ వచ్చిన నేపథ్యంలో ఏసీలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇదే సమయంలో మోదీ ఉచిత ఏసీ యోజన 2025 స్కీం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం మోదీ ప్రభుత్వం ఉచితంగా 5 స్టార్ ఏసీలను ఇస్తోందని ఆ వార్తలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ పథకానికి సంబంధించి, ప్రభుత్వం 1.5 కోట్ల ఏసీలను సిద్ధం చేసిందన్నారు. మే 2025 నుంచి ACల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ క్రమంలో దీని ప్రయోజనాలను పొందడానికి త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు 30 రోజుల్లోపు ఇంట్లో ఏసీ ఏర్పాటు చేస్తారని వైరల్ అవుతున్న వార్తలో ఉంది.
PIB వాస్తవ తనిఖీ
అసలు నిజంగా ఈ స్కీం ఉందా, పీఎం మోదీ ప్రభుత్వం అధికారికంగా ఏసీలను పంపిణీలు చేస్తుందా, లేదా ఇందంతా ట్రోల్స్ కారణంగా ఈ వార్త వైరల్ అవుతుందా అనే విషయాలను ఇక్కడ చూద్దాం. దీనిపై PIB అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వార్త ఫేక్ అని తేల్చింది. ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మకూడదని సూచించింది. దీని గురించి మీకు ఏవైనా లింకులు లేదా ఫొటోలు వచ్చినా కూడా అస్సలు నమ్మకూడదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసి తెలిపింది.
ప్రజలకు అలర్ట్
దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ప్రభుత్వం ఇటువంటి ఏదైనా పథకం అమలు చేయడం లేదని, ఈ వార్తను నమ్మవద్దని హెచ్చరించారు. మీకు వాట్సాప్, ఫేస్‌బుక్, లేదా ఇతర సోషల్ మీడియా వేదికలపై ఈ తరహా లింకులు, ఫొటోలు వచ్చినా నమ్మకండి అని సూచించారు. ఫేక్ న్యూస్‌కు దూరంగా ఉండి, అధికారిక వెబ్ సైట్ ద్వారా వచ్చే వార్తలను మాత్రమే నమ్మాలని పీఐబీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Read More Business News and Latest Telugu News