5 Star Hotel Breakfast Prank: ఫైవ్ స్టార్ హోటల్‌ను బురిడీ కొట్టించబోయిన కంటెంట్ క్రియేటర్.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 08:16 AM
ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ చేసి ప్రాంక్ వీడియో చేద్దామనుకున్న ఓ కంటెంట్ క్రియేటర్ అడ్డంగా బుక్కైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రాంక్ వీడియో కోసం ఏకంగా ఫైవ్ స్టార్ హోటల్‌నే బురిడీ కొట్టించబోయిన ఓ కంటెంట్ క్రియేటర్‌పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేనికైనా ఓ హద్దు ఉండాలంటూ జనాలు ఆమెను దుమ్మెత్తిపోస్తు్న్నారు. తాను ఎలాంటి ప్రాక్ వీడియో ప్లే చేసిందీ చెబుతూ నిశూ తివారీ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫ్రీగా బ్రేక్ ఫాస్ట్ కోసం చేసిన ప్రయత్నం వికటించిందని ఆమె చెప్పుకొచ్చింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆమె సాధారణ దుస్తుల్లో తన టీం సభ్యులతో కలిసి హోటల్‌కు వెళ్లింది. తాను హోటల్‌లోనే గది తీసుకుని ఉంటున్నట్టు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. వారికి తన గది నెంబర్ కూడా చెప్పింది. తొలుత హోటల్ సిబ్బంది ఆమె చెప్పింది నిజమనే నమ్మారు. దీంతో, ఆమె ఖరీదైన భోజనాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. అయితే చివరి నిమిషంలో ఆమె బండారం బయటపడింది.
Read Also: విమానాల్లో ఇచ్చే ఆహారం రుచి వేరుగా ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి కారణం ఏంటంటే..
యువతి బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని బయటకు వెళుతుండగా హోటల్ సిబ్బంది ఆమెను అడ్డగించారు. మరోసారి ఆమె చెప్పిన వివరాలను తనిఖీ చేయడంతో ఆమె బండారం బయటపడింది. పొరపాటున ఇలా జరిగిందని, ఒక హోటల్‌కు బదులు మరో హోటల్‌కు వచ్చామని ఆమె బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ హోటల్ వారు వెనక్కు తగ్గకపోవడంతో ఆమె తను తిన్న తిండికి గాను రూ.3600 చెల్లించి బయటపడాల్సి వచ్చింది. ‘‘ఫ్రీగా ఫుడ్ తిందామనుకుంటే తడిసి మోపెడైంది’’ అన్న క్యాప్షన్‌తో ఆమె పంచుకున్న ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏకంగా 17 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి.
Also Read: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..
ఇలాంటి వీడియో చేసినందుకు నిశూ తివారీపై జనాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘సరదా కోసం నువ్వు ఈ వీడియో చేసి ఉండొచ్చు కానీ ప్రేక్షకులకు మాత్రం తప్పుడు సందేశం వెళుతుంది. ఇలాంటి తుంటరి పనులు చేసేందుకు ప్రోత్సహించేలా ఇలాంటి వీడియోలు చేయడం ఎందుకు?’’ అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. ‘‘ఈ వీడియో ఏమాత్రం ఫన్నీగా లేదు. జనాలు ఈ వీడియో ద్వారా తప్పుడు సందేశం అందకుండా ఉంటే అదే చాలు. ఈ వీడియో స్ఫూర్తితో తుంటరి పనికి దిగేవారు చిక్కుల్లో పడే అవకాశం ఉంది’’ అని మరొకరు అన్నారు. ‘‘ఇలా కెమెరాలు, మైక్రోఫోన్లు బహిరంగంగా ప్రదర్శించి ఉండకపోతే ఈ ప్రాంక్ వీడియో వర్క్ అవుట్ అయ్యేదేమో’’ అని మరో వ్యక్తి అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
Read Also: డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా