Share News

Egg: కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా.. నిపుణులేం చెబుతున్నారు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:42 PM

మనలో చాలా మందిలో ఈ అనుమానం ఉంది. కోడిగుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా. ఎలా చెబుతాం.. శాస్త్రీయంగా ఉన్న ఆధారాలు ఏంటి అనే సందేహాలకు సమాధానమే ఈ కథనం.

Egg: కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా.. నిపుణులేం చెబుతున్నారు..
Egg

కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. మరీ ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రోజుకు ఒక గుడ్డు ఆహారంలో భాగంగా ఇవ్వాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. గుడ్డు వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి మన దగ్గర చాలా మంది దాన్ని తినరు. కారణం గుడ్డును మాసాహారంగా భావిస్తారు. కోడిగుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా అనే సందేహం ఎన్నో ఏళ్లుగా మనల్ని వేధిస్తుంది. మరి ఇంతకు గుడ్డు శాఖాహారమా.. మాంసాహారామా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..


కోడి నుంచి గుడ్డు వస్తుందని అందరికి తెలుసు. దీనిలో తెల్ల సొన, పచ్చసొన అని రెండు భాగాలుంటాయి. ఇవి కోడి సంతానోత్పత్తికి సంబంధిచిన అంశాలు. గుడ్డు ఫలదీకరణం చెందితే కోడిపిల్లగా మారుతుంది. అయితే బయట మనం మార్కెట్‌లో కొనే గుడ్లు.. ఫలదీకరణం చెందనవి. అంటే వాటిల్లో ఎలాంటి పిండం, జీవం ఉండదు. కాకపోతే ఇవి జంతు మూలం నుంచి వచ్చినవే అవుతాయి.


జీవశాస్త్రం ప్రకారం చూసుకుంటే.. శాఖాహారం అంటే.. అది కేవలం మొక్కల ఆధారిత ఉత్పత్తులను మాత్రమే కలిగి ఉంటుంది. అనగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, విత్తనాలు, ఆకులు వంటివి అన్నమాట. అదే మాంసాహారం అంటే.. అది జంతువు శరీరం అయిన మాంసం కావచ్చు.. అలానే జంతు మూలమైన పదార్థం కావచ్చు. ఇక కోడిగుడ్డు విషయానికి వస్తే.. అది ఫలదీకరణం చెందనప్పటికి.. కోడి శరీరం నుంచి వస్తుంది కాబట్టి.. గుడ్డును జంతు ఉత్పత్తిగానే పరిగణిస్తారు. అంటే జీవశాస్త్రపరంగా చూసుకుంటే.. కోడిగుడ్డు అనేది నాన్ వెజ్ కిందకే వస్తుంది.


కోడిగుడ్డు వెజ్జా, నాన్ వెజ్జా అనేది పక్కకు పెడితే.. అది పోషకాల గని. గుడ్డులో ప్రోటీన్, కొవ్వు, విటమిన్ బీ12, డీ విటమిన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్ని జంతు ఆధారిత ఆహారాల్లో లభిస్తాయి. మొక్కల ఆధారంగా వచ్చే ఆహారాల్లో విటమిన్ బీ12 లభించదు. కానీ ఇది కోడిగుడ్డులో ఉంటుంది. ఈ కారణంగా కూడా గుడ్డును నాన్ వెజ్‌గా చెబుతారు.


అయితే మన దేశంలో కొందరు గుడ్డును వెజిటేరియన్‌గా భావిస్తారు. అందుకు కారణం.. అది మాంసం కాదు.. పైగా ఫలదీకరణం కూడా చెందదు. కనుక దానిలో జీవం లేదు. అలాంటప్పుడు అది శాఖాహారమే అవుతుంది అంటారు. అయితే ఈ వాదన శాస్త్రీయ ఆధారాల కన్నా.. వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. కానీ పోషకాహార, జీవ శాస్త్రాల పరంగా చూస్తే.. కోడిగుడ్డు జంతు ఉత్పత్తే కాబట్టి.. ఇది నాన్ వెజ్ కిందకు వస్తుంది.


అలానే ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని వేరు చేసే విభాగంలో కూడా గుడ్డును నాన్ వెజ్‌గానే పరిగణిస్తారు. మన దేశంలో ఏదైనా ఆహారంలో గుడ్డు వినియోగిస్తే.. ఆ ప్యాకెట్‌పై నాన్ వెజ్‌ను సూచించే గోధుమరంగు మార్క్ ఉంటుంది. దీని ప్రకారం మన దేశంలో కూడా గుడ్డు నాన్ వెజ్ కిందకే వస్తుంది.

ఇవి కూడా చదవండి:

విమానాల్లో ఇచ్చే ఆహారం రుచి వేరుగా ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి కారణం ఏంటంటే..

ఇలాక్కూడా కటింగ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Mar 26 , 2025 | 10:23 AM