Sankranti 2025: హరిదాసులు ఎవరు.. అక్షయపాత్రలో ఎందుకు బియ్యం వేస్తారు..
ABN , Publish Date - Jan 15 , 2025 | 07:59 AM
Makar Sankranti 2025: సంక్రాంతి అనగానే ముగ్గులు, పతంగులు, పిండి వంటలు, హరిదాసులు, బసవన్నే అందరికీ గుర్తుకొస్తారు. అయితే చాలా మందికి హరిదాసుల గురించి తెలియదు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం..
సంక్రాంతి అనగానే ముగ్గులు, పతంగులు, పిండి వంటలు, కొత్త సినిమాలు, హరిదాసులు, బసవన్నే అందరికీ గుర్తుకొస్తారు. అయితే వీరిలో హరిదాసుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హరి నామాన్ని గానం చేస్తూ.. కాళ్లకు గజ్జలు, భుజంపై వీణ, తల మీద అక్షయపాత్రతో సందడి చేస్తుంటారు. వీళ్ల గజ్జల శబ్దం వినగానే హరిదాసులు వచ్చారని బయటకు వచ్చి బియ్యం పోస్తుంటారు. అయితే హరిదాసులు ఎవరు? వీళ్ల కథ ఏంటి? వీరికి బియ్యం ఎందుకు ఇవ్వాలి? దీని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి? అనేది చాలా మందికి తెలియదు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కృష్ణుడికి మరో రూపం!
శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులుగా హరిదాసులను చెబుతుంటారు. వీరి తల మీద ఉండే అక్షయపాత్రలో గనుక బియ్యం పోస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది నమ్మకం. దానధర్మాలను స్వీకరిస్తే హరిదాసులకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. వీరు నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేస్తారు. అలాగే సంక్రాంతి నాడు అందరి నుంచి దానాలు స్వీకరిస్తారు. అక్షయపాత్రను అస్సలు కిందకు దించరు. వీళ్లు శ్రీ కృష్ణుడికి మరో రూపమని కూడా చెబుతుంటారు. సంక్రాంతి ముందు ధనుర్మాసంలో మాత్రమే కనిపించే హరిదాసులు.. మళ్లీ ఏడాది వరకు కనబడరు. ఆ మాసంలోని నెల రోజులు సూర్యోదయానికి ముందు కృష్ణుడు, గోదాదేవిని స్మరిస్తారు. తిరుప్పావైని పఠించి అక్షయపాత్రను తల మీద ధరిస్తారు.
టూ-వీలర్‌లపై..
హరిదాసులు టెక్ యుగానికి తగ్గట్లు అప్‌డేట్ అవుతున్నారు. తల మీద ఉండాల్సిన అక్షయపాత్ర టూవీలర్‌కు పరిమితం చేస్తున్నారు నేటి హరిదాసులు. చక్కటి స్వరంతో పాడే హరినామ సంకీర్తనల్ని సౌండ్ బాక్సులకు పరిమితం చేస్తున్నారు. దానధర్మాలు స్వీకరించేందుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఊరూరా తిరిగే సమయంలో బైకులకు క్యూఆర్ కోడ్‌లు తగిలిస్తున్నారు.
డూడూ బసవన్న..
సంక్రాంతికి బసవన్నల సందడి కూడా మామూలుగా ఉండదు. ఈ బసవన్నలకు వస్త్రదానం, అన్నదానం, ధనదానం, గోదానం చేయడం చాలా పుణ్యంగా చెబుతుంటారు. పండుగకు గంగిరెద్దుని సుందరంగా అలంకరించే వారు.. తాము మాత్రం ఎక్కువగా చిరిగిన బట్టలతోనే తిరుగుతుంటారు. పొట్టకూటి కోసం ఊరూరూ తిరుగుతూ దయనీయ స్థితిలో జీవనం గడుపుతుంటారు. వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని నమ్ముకొని ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here