Makaravilakku 2025: మకరవిళక్కు దర్శనం కోసం బారులు తీరిన భక్తులు!
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:49 PM
సంక్రాంతి పండగను పురస్కరించుకుని మరక జ్యోతి దర్శనం కోసం భక్తులు వేలాదిగా విచ్చేశారు..
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండగ రోజున భక్తులకు మకర జ్యోతి (మకర దర్శనం ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా శబరిమలకు విచ్చేస్తున్నారు.
భక్తిప్రపత్తలకు ప్రతిబింబంగా నిలిచే మకర జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేడు స్వామి వారి దీవెనల కోసం లక్షల మంది శబరిమలకు విచ్చేస్తుంటారు. 41 రోజు దీక్ష తీసుకునే అయ్యప్ప భక్తులకు నేడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినం. దాదాపు రెండు నెలల పాటు సాగే మకరవిళక్కు పూజలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజే స్వామి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. మకర జ్యోతి దర్శనంతో సంతోషం, సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.
Sankranti 2025: సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వచ్చేది ఇందువల్లే..
అయ్యప్ప స్వామి చెడును అంతమొందించేందుకు, మంచిని నెలకొల్పేందుకు అవతరించాడని భక్తులు విశ్వసిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మకరవిళక్కు వేడుక జరుపుకుంటారు. మకర జ్యోతి దర్శనంతో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఇక మకర విళక్కు రోజున పందళం నుంచి స్వామి వారి ఆలయంలోని తిరువాభరణం (స్వామి వారి ప్రత్యేక ఆభరణాలు) తీసుకొస్తారు. ఒకానొక సమయంలో అయ్యప్ప స్వామి మానుష రూపంలో పందళం ప్యాలెస్‌కు వచ్చారట. ఆ సందర్భంగా పందళం రాజు తన భక్తిప్రపత్తులను చాటుకునేలా స్వామివారికి బంగారు ఆభరణాలను సమర్పించారట. నాటి నుంచి ఈ ఊరేగింపు సంప్రదాయంగా కొనసాగుతోంది.
Sankranti : సంక్రాంతి రోజున నవగ్రహాల అనుగ్రహం కోసం.. ఇది తినాలంట..
ఏటా భారత్‌లో భక్తులు నిర్వహించే భారీ తీర్థయాత్రల్లో ఇదీ ఒకటి. ఏటా సుమారు 50 లక్షల మంది ఈ సమయంలో శబరిమలకు వస్తారని సమాచారం. 41 రోజుల దీక్ష పాటించిన భక్తులు మకర జ్యోతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తారు. దీక్ష చేపట్టిన వారు బ్రహ్మచర్యం, ఉపవాసం వంటి నియమాలను తూచాతప్పకుండా ఆచరిస్తారు. ఇక శబరిమల వీధుల్లో ఇళ్లను నేడు దీపకాంతులతో అలంకరిస్తారు. బాణసంచా కాలుస్తారు.