Share News

ఊరంతా వేమన ఆరాధ్యులే..

ABN , Publish Date - Jan 12 , 2025 | 07:13 AM

యోగి వేమన పుట్టింది అనంతపురం కొండవీడు ప్రాంతంలో... ఆరాధ్యునిగా వెలసింది పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామంలో... అత్తిలి మండలంలోని కుగ్రామమే ఆరవల్లి. ఆ ఊరిలో జనమంతా వేమన ఆరాధ్యులే. గ్రామప్రజలు ఎక్కడున్నా సరే వేమన జయంతి (జనవరి 18న) ఉత్సవాలకు కుటుంబాలతో సొంతూరుకు చేరుకుంటారు.

ఊరంతా వేమన ఆరాధ్యులే..

యోగి వేమన పుట్టింది అనంతపురం కొండవీడు ప్రాంతంలో... ఆరాధ్యునిగా వెలసింది పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామంలో... అత్తిలి మండలంలోని కుగ్రామమే ఆరవల్లి. ఆ ఊరిలో జనమంతా వేమన ఆరాధ్యులే. గ్రామప్రజలు ఎక్కడున్నా సరే వేమన జయంతి (జనవరి 18న) ఉత్సవాలకు కుటుంబాలతో సొంతూరుకు చేరుకుంటారు. సంక్రాంతి సంబరాలతోపాటు ఆరవల్లిలో వేమన జయంతి అతిపెద్ద పండగ. పైగా ఈసారి వందేళ్ల ఉత్సవం.


వేమన జయంతి రోజున ఆరవల్లి గ్రామస్థులతోపాటు పశుపక్ష్యాదులకూ పండుగే. ఏటా జనవరి 18న వేమన జయంతి నిర్వహిస్తారు. ఆ రోజున ఉదయం నుంచి అన్నప్రసాద వితరణ చేస్తారు. కాలభైరవులకు అంటే గ్రామంలో కుక్కలకు క్రావిడితో అన్నప్రసాదాలు తీసుకువెళ్లి కడుపునిండా పెడతారు. గ్రామంలో ఆటపాటలతో సందడిగా ఉంటుంది. నాలుగు రోజుల ముందు నుంచే ఉత్సవాలు ప్రారంభిస్తారు.


అగ్నిప్రమాదాలు తగ్గాయి...

ఆరవల్లిలో తాటాకు ఇళ్లు ఉండేవి. అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగేవి. ఎందుకిలా జరుగుతుందంటూ స్థానికులు ఆవేదన చెందేవారు. వందేళ్ల క్రితం నాటి మాట అది. అప్పట్లో గ్రామంలోని మగవాళ్లంతా వ్యవసాయ పనులు, ఇతర ఉపాధి కోసం బర్మా(రంగూన్‌) వెళ్లేవారు. మహిళలు వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుచ్చే పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో రంగూన్‌ వెళ్లిన వారిలో వెలగల సత్యనారాయణరెడ్డి ఒకరు. ఆరవల్లిలో సంక్రాంతి ప్రారంభమైందంటే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని రంగూన్‌లో ఉన్న సత్యనారాయణరెడ్డి తన సహచరుల వద్ద ప్రస్తావించారు. అన్నశాంతి చేస్తే సమస్యలు తీరిపోతాయని అక్కడ తోటి మిత్రులు సలహా ఇచ్చారు. యోగి వేమన చిత్రాన్ని గీసి బహుకరించారు.


book1.1.jpg

వేమన ఫొటోను తీసుకొచ్చి సరిగ్గా వందేళ్ల క్రితం ఆరవల్లిలో అన్నశాంతి జరిపారు. వేమన చిత్రపటాకి పూజలు చేసి ఊరంతా అన్న సమారాధనతో పండుగ జరిపారు. అప్పటి నుంచి ప్రమాదాలు తగ్గుతూ వచ్చాయని గ్రామస్తులు చెబుతారు. మొదటిసారిగా జనవరి 18న వేమన జయంతిని నిర్వహించారు. తన శతకాలతో సామాజిక చైతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన వేమన పుట్టింది ఎప్పుడనేది తెలియకపోయినా సరే ఆరవల్లి గ్రామస్తులకు మాత్రం జనవరి 18నే ఆయన జయంతి. కరోనా సమయంలో (2022) అన్నశాంతి వాయిదా వేద్దామని భావించారు. ఆ సమయంలోనే మళ్లీ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. అన్నశాంతి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు బలంగా విశ్వసించారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.


వారింట్లో వందేళ్ల చిత్రపటం...

వెలగల నారాయణరెడ్డి యోగి వేమన సిద్ధాంతాన్ని బలంగా విశ్వసించారు. వేమన రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన కూడా చివరకు వేమన స్ఫూర్తితో జీవనం సాగించారు. అందుకే నారాయణరెడ్డిని ‘దాసు’గా ఆ గ్రామంలో పిలుచుకునేవారు. ఇప్పుడు నాలుగోతరం ఉంది. నారాయణరెడ్డి(దాసు) ప్రారంభించిన జయంతి ఉత్సవాలను నిర్వహించండంలో ఆయన వారసులది ప్రత్యేక పాత్ర. దాసు వంశానికి చెందిన మూడు కుటుంబాలు గ్రామంలో నివాసం ఉంటున్నాయి. వారి పూజ గదుల్లో దేవుని ఫొటోలతోపాటు, వేమన చిత్రపటం ఉంటుంది. నిత్యం వేమనను వారు ఆరాధిస్తారు. రంగూన్‌ నుంచి వందేళ్ల క్రితం దాసు తీసుకొచ్చిన చిత్రపటం ఇంకా వారి ఇంట్లో ఉంది.


ఊరేగింపులో సెంటిమెంట్‌

వేమన జయంతి రోజున గ్రామంలో వేమన చిత్రపటాలతో పల్లకీ ఊరేగింపు ఉంటుంది. దాసు వంశీకులే గ్రామస్తుల నుంచి నివాళులు స్వీకరిస్తారు. పసిపిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల వరకు మూడుసార్లు పల్లకీ కింద నుంచి అటూ ఇటూ వెళతారు. ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తుకు తిరుగుండదని గ్రామస్తుల విశ్వాసం. ఇతర గ్రామాల నుంచి కూడా పిల్లలను తీసుకు వచ్చి పల్లకీ కింద నుంచి తీసుకెళ్తారు. ఆశీర్వాదాలు తీసుకుంటారు.


వేమనకు మందిరం

మొదట్లో నారాయణదాసు ప్రారంభించిన ఉత్సవాల్లో చిత్రపటాలకు పూజించేవారు. ఉత్సవ కమిటీ 1984లో వేమన విగ్రహం ఏర్పాటు చేసి, మందిరం నిర్మించింది. ప్రతి రోజు ఉదయం, సాయంత్ర సంధ్యవేళల్లో వేమన విగ్రహానికి దీపారాధాన చేస్తారు. మంచినీటి చెరువు మధ్యలోనూ వేమన విగ్రహం ఏర్పాటుచేశారు. గ్రామ పొలిమేరలో ఇప్పుడు మరో నూతన విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఆరవల్లి గ్రామానికి చెందినవారే. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వేమన జయంతి ఉత్సవాలకు స్థానికులు తమ గ్రామానికి రావడం విశేషమే కదా.

- రొక్కం కిశోర్‌, భీమవరం

ఫొటోలు: చందన వెంకటబాపూజీ


ఘనంగా వేడుకలు

book1,2.jpg

ఈసారి వేమన 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ముగ్గుల పోటీలు ఉంటాయి. వేమన పల్లకీ ఊరేగింపు రోజున కోలాటం, నృత్య ప్రదర్శనలుంటాయి. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. వేమన మాకు తరతరాలుగా ఆరాధ్యుడు. ఆయనను నిత్యం స్మరించుకుంటాం.

- వెలగల అమ్మిరెడ్డి,

ఉత్సవ నిర్వాహకులు

Updated Date - Jan 12 , 2025 | 07:13 AM