వహ్‌వా... ‘వింటర్’ హల్వా
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:33 AM
క్యారెట్ హల్వా, బాదం హల్వా, మూంగ్‌దాల్ హల్వా తెలుసుకానీ... ‘వైట్ హల్వా’ గురించి ఎప్పుడైనా విన్నారా? చలికాలంలో మాత్రమే లభించే దీనినే ‘వింటర్ హల్వా’ అని కూడా పిలుస్తారు. పాత దిల్లీలో ఈ పసందైన స్వీటు కోసం క్యూ కడతారు. ఇక్కడ ఒక్కచోటే దొరికే ఈ హల్వా ప్రత్యేకతలేమిటంటే...
క్యారెట్ హల్వా, బాదం హల్వా, మూంగ్‌దాల్ హల్వా తెలుసుకానీ... ‘వైట్ హల్వా’ గురించి ఎప్పుడైనా విన్నారా? చలికాలంలో మాత్రమే లభించే దీనినే ‘వింటర్ హల్వా’ అని కూడా పిలుస్తారు. పాత దిల్లీలో ఈ పసందైన స్వీటు కోసం క్యూ కడతారు. ఇక్కడ ఒక్కచోటే దొరికే ఈ హల్వా ప్రత్యేకతలేమిటంటే...
ఎక్కడైనా సరే కొత్తదనమే అందర్నీ విశేషంగా ఆకర్షిస్తుంది. పాత దిల్లీలోని షీరెన్ భవన్‌లో ఉండే ‘అహ్మద్ షిరాజ్ స్వీట్‌షాప్’లో దొరికే తెల్ల క్యారెట్ హల్వా కూడా అలాంటిదే. ఎందుకంటే ఇలాంటి తెల్ల క్యారెట్ హల్వా ఎక్కడా దొరకదు మరి. అందులోనూ ప్రతీ ఏడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకే ఈ ‘వింటర్ హల్వా’ తయారుచేస్తారు.
ప్రత్యేకతలివే...
సంప్రదాయ పద్ధతిలో వివిధ రకాల హల్వా తయారు చేయటంలో షిరాజ్ స్వీట్‌షాప్ చెఫ్స్ ముందు వరసలో ఉంటారు. వారే ఈ వెరైటీ హల్వాను కూడా తయారుచేస్తారు. సాధారణంగా క్యారెట్లు నారింజ రంగులో ఉంటాయి కదా... వీళ్లు మాత్రం తెల్లటి క్యారెట్లతో ఈ ప్రత్యేక హల్వాను చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నలుగురు రైతులు పండించిన తెల్ల క్యారెట్లనే ఈ షాప్‌వాళ్లు కొంటారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరు రైతులే ఉన్నారు. వీళ్లు మరెవరికీ తెల్ల క్యారెట్ విత్తనాలను ఇవ్వరు. ఈ స్వీట్‌షాప్ కోసమే వీటిని పండిస్తారు. ఈ రైతులతో అహ్మద్ షిరాజ్ స్వీట్‌షాప్ పూర్వీకుల నుంచి అనుబంధం ఉంది. అందుకే ఘజియాబాద్‌లో పండిన తెల్ల క్యారెట్లను దిల్లీకి తెప్పిస్తారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన చెఫ్స్ భరత్, విష్ణు, అలమ్, బూరే సింగ్, ఉస్తాద్ సుగర్ సింగ్ తోమార్‌లు తెల్ల క్యారెట్ హల్వాను తయారుచేస్తారు. ఈ హల్వా ధర కిలోకి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది. దిల్లీలోని చిట్లీ కబర్ చౌక్‌లో ఉండే ఈ స్వీట్‌షాప్ ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ తెరచి ఉంటుంది. మిగతా మిఠాయిలను పక్కన పెట్టి, ఈ మూడు నెలల పాటు ‘వింటర్ హల్వా’ను రుచి చూస్తారు. ఈ ప్రత్యేక హల్వా కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. కొందరు పార్సిళ్లు తీసుకెళ్తారు. చలికాలం ఈ హల్వా తింటే శరీరం వెచ్చగా మారుతుందట.
వందేళ్ల వారసత్వం...
పాత దిల్లీలోని ఈ స్వీట్‌షాప్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఫయాజుద్దీన్ అనే వ్యక్తి దిల్లీలో స్థిరపడ్డాడు. మిఠాయిలూ చేసేవాడు. క్రమక్రమంగా అక్కడే దుకాణం తెరిచాడు. ప్రస్తుతం మూడోతరం ఈ స్వీటుషాపును నడుపుతోంది. ‘ఎర్ర క్యారెట్‌తో చేసిన హల్వాకు తెల్లరంగు వచ్చేట్లు ఏదైనా కలిపారా?’ అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారట. ‘అచ్చంగా తెల్ల క్యారెట్స్‌తో చేసిన హల్వానే’ అని ప్యాక్ చేసేవారు చెప్పే రొటీన్ డైలాగ్. ‘తరాలు మారినా, నాణ్యతలో మాత్రం తగ్గేదేలే’ అంటున్నారు ప్రస్తుత యజమాని. అర్ధరాత్రి సమయంలో కూడా ఈ హల్వాను వేడివేడిగా సర్వ్ చేస్తారు. ఇదీ వీరి ప్రత్యేకత!
అలోవెరా, గోండు హల్వాలు కూడా...
‘వింటర్ హల్వా’తో పాటు రకరకాల హల్వాలకు ‘అహ్మద్ షిరాజ్ స్వీట్‌షాప్’ ప్రసిద్ధి. ఇక్కడ స్వచ్ఛమైన దేశీనెయ్యితో తయారుచేసిన ‘సోహన్ హల్వా’ బాగా పాపులర్. దీన్ని డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేస్తారు. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ‘హబ్సి హల్వా’ తో పాటు ‘అలోవెరా’ హల్వా చేయటం వీరి ప్రత్యేకత. ఈ హల్వా తింటూ ‘అసలు అలోవెరా వాసనే లేదు. ఇదెలా సాధ్యం?’ అని అడుగుతుంటారట చాలా మంది. అకాసియా రకం చెట్లనుంచి వచ్చే ‘ఎడిబుల్ గమ్’తో చేసిన ‘గోండు హల్వా’ కూడా ఇక్కడ లభిస్తుంది. దీనికి కూడా చాలామంది అభిమానులున్నారు.