IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య భీకర పోరు.. మ్యాచ్ హైలైట్స్ ఇవే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:01 AM
సీఎస్‌కే ఆటగాడు రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 65 రన్స్ చేసి నాటౌట్గా నిలిచారు. జట్టును విజయ తీరాలవైపు నడిపించడంలో తన వంతు కృషి చేశారు. అతని స్థిరమైన ఆట 156 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: చెన్నైలో నిన్న(ఆదివారం) జరిగిన ఐపీఎల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య భీకర పోటీ జరగ్గా.. సీఎస్‌కే ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్‌తో మాయ చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 స్కోర్ చేసి నాటౌట్గా నిలిచారు. రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 రన్స్ చేసి సత్తా చాటారు. స్పిన్నర్ నూర్ అహ్మద్ 18 బంతులు వేసి నాలుగు వికెట్లు తీశారు. కాగా, ముంబై ఇండియన్స్ మాత్రం లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే ఉత్కఠంగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రికార్డులు నమోదు చేశారు. కాగా, మ్యాచ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
హైలైట్స్ & బిగ్ మూమెంట్స్..
సీఎస్‌కే ఆటగాడు రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 65 రన్స్ చేసి నాటౌట్గా నిలిచారు. జట్టును విజయ తీరాలవైపు నడిపించడంలో తన వంతు కృషి చేశారు. అతని స్థిరమైన ఆట 156 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకంగా మారింది. మరో సీఎస్‌కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత కోశాడనే చెప్పాలి. టీమ్ కెప్టెన్‌గా ఉన్న అతను 26 బంతుల్లో ఏకంగా 53 రన్స్ చేసి చెలరేగిపోయాడు. మెుత్తం 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 22 బంతుల్లోనే 50 రన్స్ బాదేసి వేగవంతమైన ఐపీఎల్ అర్ధసెంచరీగా రికార్డు సృష్టించారు. స్పినర్ నూర్ అహ్మద్ సైతం తన మాయాజాలం చూపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కేవలం మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ చేసి మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. తిలక్ వర్మ (31), సూర్య కుమార్ యాదవ్ (29), నమన్ ధీర్ (17), రాబిన్ మిన్జ్(3) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. పేసర్ ఖలీల్ అహ్మద్.. రోహిత్ (0), ర్యాన్ రికెల్టన్ (13) వికెట్లు తీసి ఆరంభంలోనే ఎంఐను దెబ్బతీశారు.
ఇక ముంబై ఇండియన్స్ ప్లేయర్ విగ్నేష్ పుత్తూర్ డెబ్యూ మ్యాచ్‌లో సత్తాచాటారు. 32 బంతుల్లో మూడు వికెట్లు తీసి మెప్పించారు. రుతురాజ్(53), శివమ్ దూబే (9), దీపక్ హుడా (3) వికెట్లను తీసి జోరు మీదున్న వారి దూకుడుకు కళ్లెం వేశారు. రోహిత్ శర్మ డక్ ఔట్ అయ్యి అభిమానులకు నిరాశ మిగిల్చారు. కేవలం 4 బంతుల్లోనే వెనుదిరిగి అభిమానులను షాక్‌కు గురి చేశారు. కాగా, ఇది అతని 18వ ఐపీఎల్ డక్‌గా నమోదైంది. నిన్నటి మ్యాచ్‌లో దీపక్ చాహర్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. 15 బంతుల్లో 28 (1 ఫోర్, 2 సిక్సర్లు) రన్స్ చేసి జట్టు స్కోరును 155/9కి చేర్చారు. చివరి ఓవర్‌లో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన ధోనీ.. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి ఎలాంటి స్కోరూ నమోదు చేయలేదు. అయినా ఆయన స్టేడియంలోకి రావడంతోనే అభిమానులు కేరింతలు కొట్టారు.
రికార్డ్స్..
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఓడిపోవడం అనేది 2012 నుంచి జరుగుతోంది. అదే సీన్ ఈ ఏడాదీ రిపీటైంది. కాగా, వరసగా ఆ టీమ్ తొలి మ్యాచ్ ఓడిపోవడం ఇది 13వ సారి. ఐపీఎల్‌లో 18వ సారి డక్ ఔట్ అయిన రోహిత్ శర్మ.. జాయింట్-మోస్ట్ డక్‌ల రికార్డును సమం చేశారు. నూర్ అహ్మద్ 18 బంతుల్లో నాలుగు వికెట్లు తీసి స్పిన్నర్‌గా ముంబై ఇండియన్స్‌పై ఉత్తమ గణాంకాలు సాధించారు. రుతురాజ్ నిన్న జరిగిన మ్యాచ్‌లో వేగవంతమైన అర్ధశతకాన్ని బాదేశారు. కేవలం 22 బంతుల్లోనే 50 రన్స్ చేసి ఐపీఎల్ కెరీర్‌లోనే వేగవంతమైన అర్ధసెంచరీ నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి: