IPL 2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్..
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:20 PM
కె.ఎల్.రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

విశాఖ: ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (సోమవారం) ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో రెండు జట్లు భీకరంగా పోరాడనున్నాయి. ఈ రెండు టీమ్‌లకు కొత్త కెప్టెన్లు రావడం, ఆడగాళ్లలోనూ భారీ మార్పులు, చేర్పులు జరగడంతో ఇరు జట్లకు మ్యాచ్ కీలకంగా మారింది. కొత్త కెప్టెన్లు, ఆడగాళ్ల బలాబలాలు నేటి మ్యాచ్‌తో తేలిపోనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. దీంతోపాటు రెండు టీమ్‌లకూ ఐపీఎల్ సీజన్-2025లో ఇది తొలి మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల బలాబలాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు..
కె.ఎల్.రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాహుల్ స్థిరమైన ఆటతీరు, డు ప్లెలిస్ అనుభవం జట్టుకు బాగా కలిసొచ్చే అంశాలని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. మరోవైపు మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి.నటరాజన్, ముఖేశ్ కుమార్ తమ వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారని భావిస్తున్నారు. స్టార్క్ వేగవంతమైన బంతులు, కుల్దీప్ స్పిన్ బౌలింగ్ కీలక సమయంలో మ్యాచ్‌ను మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, టీమ్ కెప్టెన్ ఆక్సర్ పటేల్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులను చిత్తు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ బలహీనతలు..
ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ మిడిలార్డర్ మాత్రం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మిడిల్ ఆర్డర్‌లో అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వి ఉన్నారు. అయితే టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో వీరిపై ఆధారపడడం సమస్య కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. వీరు స్థిరంగా ఆడకపోవడంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టును గెలిపించడంతో ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీమ్ ఓటమిని రుచి చూసే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే.. అక్సర్ పటేల్ ఆల్ రౌండర్ అయినప్పటికీ కెప్టెన్‌గా పూర్తి అనుభవం లేకపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయే అవకాశాలను పెంచుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్ బలాలు..
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మిడిల్ ఆర్డర్ అత్యంత బలంగా ఉంది. ఈ టీమ్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్ వంటి బలమైన ఆటగాళ్లను కలిగి ఉంది. పంత్, పూరన్ తమ విధ్వంసకర బ్యాంటింగ్ రెచ్చిపోతారని తెలిసిందే. అదే ప్రదర్శనతో నేడు ప్రత్యర్థులకు చుక్కలు చూపించే అవకాశాలూ మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు రవి బిష్ణోయ్ స్పిన్‌తో షమర్ జెసెఫ్ వేగవంతమైన బంతులతో చెలరేగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా లక్నో కెప్టెన్ పంత్ ధైర్యసాహసాలు జట్టును గెలుపు తీరాల వైపు నడిపేందుకు కీలకం కానున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ బలహీనతలు..
బౌలర్లు గాయాల బారిన పడడం లక్నో జట్టుకు అతి పెద్ద సమస్యగా మారింది. అవేశ్ ఖాన్, ఆకాశ్ ఖాన్, మయాంక్ యాదవ్, మెుహ్సిన్ ఖాన్ మ్యాచ్‌కు గైర్హాజరు కావడం టీమ్ బలహీనతగా మారింది. షార్దూల్ ఠాకూర్ జట్టులోకి రావడం కొంత ఊరట కలగించింది. అయినా అనుభవం లేని యువ బౌలర్లపై ఆధారపడడం జట్టుకు రిస్క్‌గా మారింది. మరోవైపు విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో లక్నో టీమ్‌కు పెద్ద దెబ్బే తగిలేలా అనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి: