IPL 2025: ఢిల్లీ దుమ్ము రేపుతుందా.. లక్నోకు లక్ కలిసొస్తుందా..
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:38 AM
విశాఖపట్నం వేదికగా సోమవారం రాత్రి ఐపీఎల్-2025 మ్యాచ్ జరగనుంది. రాత్రి 07:30 గంటలకు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లు తలపడనున్నాయి.

విశాఖ: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2025 పండగ ప్రారంభమైంది. ఇప్పటికే రెండ్రోజులుగా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆదివారం నాడు హైదరాబాద్, చెన్నై నగరాల్లో పలు జట్లు తలపడగా.. ఇవాళ(సోమవారం) విశాఖపట్నం వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 07:30 గంటలకు విశాఖలోని డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి(ఏసీఏ-వీడీసీఏ) స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లు తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇరుజట్ల ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. మరోవైపు ఐపీఎల్-2025 మ్యాచ్ విశాఖలో జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ తెలుగు అభిమానులు పెద్దఎత్తున తరలిరానున్నారు. కాగా, విశాఖ స్టేడియం, పిచ్, స్కోర్ అంచనా గురించి గత రికార్డుల ఆధారంగా తెలుసుకుందాం.
విశాఖ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మైదానంలో బ్యాట్స్‌మెన్లు బలమైన షాట్‌లు ఆడేందుకు అనువుగా ఉంటుందని అంటున్నారు. బౌలర్లు వేసిన బంతి స్థిరమైన బౌన్స్‌తో పిచ్‌పై సమాంతరంగా వస్తుందని, ఈ పరిణామం బ్యాటర్లు భారీ స్కోరు చేసేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. ఈ మైదానంలో కొత్త బంతితో పేసర్లకు కొంత మేర స్వింగ్ లభించినా.. ఆట ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు, స్లో బంతులు వేసే బౌలర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
ఐపీఎల్-2024 ఢిల్లీ వర్సెస్ చెన్నై తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు నమోదు కాగా.. తాజాగా జరిగే మ్యాచ్‌లో మెుదట బ్యాటింగ్ చేసే జట్టు 180 నుంచి 200 మధ్య స్కోరు సాధించే అవకాశం ఉంది. ఇది ఛేజింగ్ జట్టుకు డ్యూ కారణంగా కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ బౌలింగ్‌లో కుల్దీప్, స్టార్క్.. లక్నో బ్యాటింగ్‌లో పంత్, పూరన్ ఆధారంగా ఈ పరుగులు అంచనా వేయవచ్చు. అయితే విశాఖ స్టేడియంలో ఛేజింగ్ జట్టు విజయం సాధించే అవకాశం 60 శాతం మేర ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మైదానంలో రెండో ఇన్నింగ్స్‌లో గెలిచిన జట్ల శాతం ఎక్కువగా ఉండడంతో ఈ విధంగా అంచనా వేస్తున్నారు.
ఈ స్టేడియంలో టీ-20 మ్యాచుల్లో 209/8 అత్యధిక స్కోరు 2003లో నమోదైంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఈ రికార్డ్ నమోదైంది. భారత్ ఛేజ్ చేసి ఆస్ట్రేలియాను ఓడించింది. ఐపీఎల్‌లో ఇక్కడ అత్యధిక స్కోరు 2016లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో 206/4గా నమోదైంది. ఐపీఎల్‌లో అత్యధిక ఛేజ్ 193/5 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 2015లో నమోదైంది. ఈ మైదానంలో ఇప్పటివరకూ 15 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. మెుదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎనిమిది సార్లు, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు ఏడు సార్లు గెలిచాయి. ఈ గణాంకాలు పిచ్ సమతుల్యతను చెబుతున్నాయి. అయితే రాత్రి వేళ జరిగి మ్యాచ్‌ల్లో డ్యూ కారణంగా ఛేజింగ్ జట్లు స్వల్ప ఆధిక్యంలో ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి: