IPL 2025 CSK Vs MI Weather Report: నేడు సీఎస్‌కే వర్సెస్ ఎమ్ఐ మ్యాచ్.. వెదర్ రిపోర్టు ఏం చెబుతోందంటే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:09 PM
నేడు చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న సీఎస్‌కే వర్సెస్ ఎమ్ఐ ఐపీఎల్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ నివేదిక నేపథ్యంలో నేడు మ్యాచ్‌కు ఆలస్యంగా మొదలు కావచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: చెన్నైలోని ఎమ్‌ఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7.30 గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్‌కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్‌కే తన సొంత మైదానం నుంచి బరిలోకి దిగనుంది. అయితే, నేడు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్న తరుణంలో మ్యాచ్ సాఫీగా జరుగుతుందా? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
వాతావరణ నివేదిక ఏం చెబుతోందంటే..
చెన్నైలో నేడు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వాన తొలగిపోవచ్చని అంచనా వేసింది. మ్యాచ్ మొత్తం వాష్ అవుట్ కాకపోయినా మైదానం తడిగా ఉంటే మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభం కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. చెపాక్ స్టేడియం పిచ్ స్పిన్‌కు అనుకూలమని అందరికీ తెలిసిందే. మ్యాచ్ గడిచే కొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ వాతావరణం తేమగా ఉంటే మాత్రం మ్యాచ్ మలి దశల్లో బౌలింగ్‌పై కచ్చితంగా ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఎలా సాగుతుందా అని అభిమానులు ఉత్కంఠకు లోనవుతున్నారు.
Also Read: సాల్ట్, కోహ్లీ వీర విహారం.. పది ఓవర్లకు బెంగళూరు స్కోరు ఎంతంటే..
పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని సీఎస్‌కే జట్టు ఉద్దండులైన నూర్ అహ్మద్, ఆర్, అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ త్రయంతో రెడీగా ఉంది. ఇప్పటివరకూ చెపాక్ స్టేడియం వేదికగా 85 మ్యాచులు జరగ్గా 49 సందర్భాల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన టీం విజయం సాధించింది. దీంతో, ఈసారి మొదట టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచేందుకు ప్రయత్నించొచ్చు. ఆ తరువాత స్పిన్నర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసి విజయం కోసం ప్రయత్నించొచ్చు. అయితే మ్యాచ్ తదుపరి దశల్లో తేమ శాతం పెరిగి స్పీన్‌కు అంతగా అనుకూలించకపోవచ్చన్న భయాలు కూడా ఉన్నాయి. దీంతో, నేటి వాతావరణం ఎలా ఉంటుందనే దానిపై కూడా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.
Also Read: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే
గత సీజన్‌లో సీఎస్‌కే, ఎమ్ఐ రెండు తడబడ్డాయి. ప్లేఆఫ్స్‌కు చేరలేక చతికిల పడ్డాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఓటమితో సీఎస్‌కే టోర్నీ నుంచి తప్పుకోగా ఎమ్‌ఐకి మరింత దారుణ పరాభవం ఎదురైంది. పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచి అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో, పాత తప్పులు పునరావృతం కాకుండా రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి.
ఇక గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని జస్‌ప్రీత్ బుమ్రా, ఒక మ్యాచ్ నిషేధానికి గురైన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరమవడం అభిమానుల్ని నిరాశపరిచింది. 2013 ఐపీఎల్ నుంచి ఇప్పటివరకూ ఎమ్ఐ తన ఆరంభ మ్యాచుల్లో గెలిచింది లేదు. ఇలా వివిధ కారణాలతో క్రికెట్ అభిమానుల్లో నేటి మ్యాచ్‌పై ఉత్కంఠ పాతకస్థాయిలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..