Share News

YouTubers: 11 మంది యూట్యూబర్లపై కేసు

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:10 AM

కలర్‌ ప్రిడిక్షన్‌.. నంబర్‌ ప్రిడిక్షన్‌.. క్రికెట్‌.. ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్‌ యాప్‌ల ఉచ్చులో పడి.. భారతీయులు రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు.

YouTubers: 11 మంది యూట్యూబర్లపై కేసు

  • బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం చేసినందుకే..

  • నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు త్వరలో నోటీసులు.. అరెస్టుకు అవకాశం

పంజాగుట్ట/హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కలర్‌ ప్రిడిక్షన్‌.. నంబర్‌ ప్రిడిక్షన్‌.. క్రికెట్‌.. ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్‌ యాప్‌ల ఉచ్చులో పడి.. భారతీయులు రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు. ‘‘తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం’’ అంటూ ఇలాంటి యాప్స్‌పై ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్‌స్టా యూజర్లపై పంజాగుట్ట పోలీసులు కొరడా ఝుళిపించారు. హర్షసాయి, విష్ణుప్రియ వంటి యూట్యూబర్లు సహా.. సెలబ్రిటీలు, టీవీ నటులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేటలోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరువుతున్న మియాపూర్‌ వాసి వి.వినయ్‌.. శిక్షణ కేంద్రాల వద్ద విద్యార్థుల్లో చాలా మంది బెట్టింగ్‌ యాప్‌లకు బానిసలై.. ఉన్నదంతా పోగొట్టుకుంటున్న విషయాన్ని గుర్తించారు. పలువురు యూట్యూబర్లు ఈ తరహా యాప్‌లకు ప్రచారం చేస్తున్నారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా బెట్టింగ్‌ యాప్‌లపై ఎక్స్‌ వేదికగా మండిపడుతున్నారు. దీంతో పంజాగుట్ట పోలీసులు సోమవారం 11 మంది యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై గేమింగ్‌ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 3ఏ, 4.. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66డీ, భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స)లోని 318(4) సెక్షన్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో శ్యామల(వైసీపీ అధికార ప్రతినిధి), హర్ష సాయి, ఇమ్రాన్‌ ఖాన్‌, విష్ణు ప్రియ, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్‌ గౌడ్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్‌ పేర్లు ఉన్నాయి. పోలీసులు వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేసి, విచారించనున్నారు. విచారణ సందర్భంగా యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి.. అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది.


సజ్జనార్‌ పోరాటం

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా బెట్టింగ్‌ యాప్‌లకు వ్యతిరేకంగా ఎక్స్‌ వేదికగా పోరాటం సాగిస్తున్నారు. ‘‘బెట్టింగ్‌ యాప్‌లకు సెలబ్రిటీలు, యూట్యూబర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కల్పిస్తున్నారు. ఫలితంగా అమాయకులు నష్టపోతున్నారు. సర్వం కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అంటూ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే..! నిజానికి ఆయన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో.. ఈ తరహా గేమింగ్‌ యాప్‌ నిర్వాహకుల భరతం పట్టారు. యాప్‌ నిర్వాహకుల మూలాల వరకు వెళ్లారు. ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ.. యాప్‌లను నిర్వహించే భారతీయులను అరెస్టు చేయగా.. చైనాలో ఉన్న సూత్రధారులపైనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నా.. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇన్‌స్టా రీల్స్‌ చేసేవారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఈ కోవలోనే సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధుల్లో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే..!

Updated Date - Mar 18 , 2025 | 07:53 AM