LRS Scheme: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించండి!
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:54 AM
రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ఎల్‌ఆర్‌ఎ్‌స(లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)కింద ఫీజు చెల్లించాలని అధికారులు లేఖలు పంపారు. నాలుగేళ్ల క్రితం అనధికారిక లేఅవుట్ల క్రమబ్ధకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే.
20 లక్షల దరఖాస్తుదారులకు లేఖలు
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ఎల్‌ఆర్‌ఎ్‌స(లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)కింద ఫీజు చెల్లించాలని అధికారులు లేఖలు పంపారు. నాలుగేళ్ల క్రితం అనధికారిక లేఅవుట్ల క్రమబ్ధకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. ఆ సమయంలో 25.68 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 20లక్షల దరఖాస్తులు.. నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు అధికారులు తాజాగా గుర్తించారు. నిషేధిత భూములు, జల వనరుల సమీపంలో ఉన్న భూములకు సంబంధించి 5.50లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఈనెల 12వ తేదీనే 18 లక్షల దరఖాస్తులకు ఆటోమేటిక్ ఫీజు జనరేట్ చేసిన అధికారులు.. శుక్రవారం మరో2లక్షల దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని లేఖలు రాశారు. 11 రోజుల్లో 29 వేల దరఖాస్తులు ఆమోదించగా.. ప్రభుత్వానికి రూ.80కోట్ల ఆదాయం వచ్చింది.
మార్చి 31వ తేదీలోగా ఫీజు చెల్లించిన వారికే 25శాతం రాయితీ లభిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇందుకోసం కలెక్టర్లు, రిజిస్ట్రేషన్, మునిసిపల్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించలేని వారు తొలుత ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి..బిల్డింగ్ అనుమతుల సమయంలో 14శాతం ఓపెన్ స్థలం ఫీజు చెల్లించవచ్చని చెబుతున్నారు. అయితే, ఈ నెల చివరి వారంలో ఎక్కువ మంది ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతా ఆన్‌లైన్ విధానమే ఉండడంతో విదేశాల్లో నివసిస్తున్న వారు సైతం అక్కడి నుంచే ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకుంటున్నారు. అయితే, ఫీజు మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించే అవకాశం ఇస్తారా? 25శాతం రాయితీని మార్చి 31 తర్వాత కొనసాగిస్తారా? అంటూ ఎక్కువ మంది అడుగుతుండగా.. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అధికారులు వివరిస్తున్నారు.