Share News

నాన్న అంటేనే హీరో

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:19 AM

నాన్న అంటేనే హీరో.. ఆ తండ్రి వయస్సు 80 ఏళ్లు.. అయితేనేం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకుని కాపాడుకునేందుకు తన వయోభారాన్ని లెక్కచేయలేదు.

నాన్న అంటేనే హీరో

  • వాగులో చిక్కుకున్న కొడుకుని కాపాడేందుకు 80 ఏళ్ల తండ్రి సాహసం

  • నీళ్లలోకి దూకి కుమారుడిని బయటకు లాక్కొచ్చిన వైనం

  • గట్టు నుంచి రెండు కిలోమీటర్ల దూరం బాధితుడిని మోసుకొచ్చిన 108 సిబ్బంది

  • అపస్మారక స్థితిలో కుమారుడు.. కొనసాగుతున్న చికిత్స

దుబ్బాక, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): నాన్న అంటేనే హీరో.. ఆ తండ్రి వయస్సు 80 ఏళ్లు.. అయితేనేం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకుని కాపాడుకునేందుకు తన వయోభారాన్ని లెక్కచేయలేదు. జోరుగా పారుతున్న వాగులో చిక్కుకున్న కొడుకుని రక్షించేందుకు క్షణం ఆలోచించకుండా నీళ్లలోకి దూకేశాడు. కొడుకుని ఒడ్డుకి చేర్చి అతికష్టం మీద ఆస్పత్రికి తరలించాడు. అపస్మారక స్థితిలోనే ఉన్న ఆ కుమారుడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. చిట్టాపూర్‌కు చెందిన కుమర్మగొల్ల నారాయణ(80) తన కొడుకు కుమర్మగొల్ల మల్లయ్య (42)తో కలిసి ఆదివారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. మల్లన్నసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో కూడవెళ్లి వాగు (పెద్దవాగు) పక్కన ఉన్న పొలానికి నీటిని పారించే మోటార్‌ను గట్టుమీదకు లాగే ప్రయత్నం చేశారు.


ఈ క్రమంలో మల్లయ్య వాగు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయి ప్రాణభయంతో కేకలు వేశాడు. వెంటనే నారాయణ ఓ తాడుతో వాగులోకి దూకి కుమారుడికి కట్టి గట్టు మీదకు విసిరాడు. గట్టు మీద ఉన్న మహిళలు వారిని పైకి లాగారు. అయితే, నీళ్లు మింగిన మల్లయ్య అపస్మారక స్థితికి చేరుకోగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలికి అంబులెన్స్‌ తీసుకొచ్చే మార్గం లేకపోవడంతో.. మల్లయ్యను స్ర్టెచర్‌పై ఉంచిన 108 సిబ్బంది సుమారు రెండు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి వాహనంలో ఎక్కించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మల్లయ్యకు చికిత్స కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 03:19 AM