అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్‌లైన్లు
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:31 PM
ఏటా వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడో ఓ చోట అగ్గి రాజుకుని అడవిలోని చెట్లకు మంటలు అంటుకుంటాయి. కార్చిచ్చురేగి విలువైన వృక్షాలు, జంతువులు ఆహుతవుతుంటాయి. ఆకురాలే కాలం ప్రారంభం కాగానే పొరపాటున అగ్గిరవ్వలు పడి అంతులేని నష్టం జరుగుతుంది.
- ఏటా వేసవికాలంలో అంతులేని నష్టం
- అగ్నికి ఆహుతవుతున్న విలువైన వృక్ష సంపద, వన్యప్రాణులు
- దెబ్బతింటున్న పర్యావరణం
- నివారణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఏటా వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడో ఓ చోట అగ్గి రాజుకుని అడవిలోని చెట్లకు మంటలు అంటుకుంటాయి. కార్చిచ్చురేగి విలువైన వృక్షాలు, జంతువులు ఆహుతవుతుంటాయి. ఆకురాలే కాలం ప్రారంభం కాగానే పొరపాటున అగ్గిరవ్వలు పడి అంతులేని నష్టం జరుగుతుంది. దీంతో పర్యావరణం దెబ్బతింటుంది. కార్చిచ్చుల నివారణకు అటవీశాఖ సిబ్బంది డిసెంబరు నుంచి ఫైర్‌లైన్ల నిర్వహణతో అటవీ శాఖ అగ్ని నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
- అగ్గి పడకుండా అన్ని చర్యలు :
జిల్లాలో మొత్తం 11 అటవీ రేంజ్‌లు రెండు డివిజన్లు ఉన్నాయి. వీటిలో 2445.40 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. ఇతర జిల్లాలతో పొలిస్తే దీనిలో ఎక్కువగా టేకు ఉండడంతో వేసవి కాలంలో అగ్గి పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు నుంచి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చడంతో పాటు అడవిలో అగ్గి కనిపిస్తే అందుబాటులో ఫోన్‌నంబర్లు కూడా ఉంచారు.
- ముందస్తు చర్యలు..
జిల్లాలోని మొత్తం 243 బీట్‌లలో అటవీ ప్రాంతంలో అగ్గిపడకుండా అటవీ అధికారులు ముందస్తుగా ఫైర్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. బ్లోయర్ల సహాయంతో ఆకులు దగ్గరికి చేసి అంటిస్తారు. దీంతో రోడ్డు మీద నుంచి ఈ లైన్ దాటి లోపలికి వెళ్లే పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ప్రతీ సంవత్సరం అటవీ అధికారులు చర్యలు చేపట్టి కొంత అడవి కాలి పోకుండా చూస్తున్నారు. అగ్గిపడితే వన్యప్రాణులకు నష్టం జరగడమే కాకుండా పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుందని అధికారులు చెబుతున్నారు.
- అడ్వాన్స్ టెక్నాలజీతో..
పైర్‌లైన్లతో పాటు గతంతో పోలిస్తే అడ్వాన్స్ టెక్నాలజీని వాడి పర్యావరణ రక్షణ కోసం అటవీ శాఖ కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అడవిలో అగ్గి పడ్డ కూడా ఫారెస్టు వన్ అగ్ని పోర్టల్ శాటిలైట్ ద్వారా వెంటనే సంబంధిత రేంజ్ కార్యాలయంతో పాటు బీట్ అధికారి మొబైల్‌కు జీపీఎస్ పాయింట్‌తో సంక్షిప్త సందేశం వస్తుంది. దీనితో వెంటనే ఆయా బీట్, సెక్షన్, రేంజ్ అధికారులు అలర్ట్ అయి మంటలు ఆర్పుతున్నారు. దీంతో పర్యావరణానికి ఇ్బంది కాకుండా అనునిత్యం కృషి చేస్తున్నారు.
- గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు..
అడవిలో పడే అగ్గికి సంబందించి గ్రామాల్లో నవంబరు, డిసెంబరు నుంచి అటవీ అధికారులు పెద్ద ఎత్తున వేసవి కాలం వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పోస్టర్ల ఆవిష్కరణ, వాటిని గ్రామాల్లో అంటించడం ప్రత్యేక మొబైల్ నంబర్లు గ్రామస్థులకు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికైనా అడవిలో అగ్గి కనిపిస్తే వెంటనే సదురు నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరుతున్నారు. అలాగే నిధులు అందుబాటులో ఉన్న చోట ఫైర్ వాచర్లను నియమిస్తున్నారు.
ప్రజలు సహకరించాలి..
- గోవింద్‌చాంద్ సర్దార్, ఎఫ్‌ఆర్వో, ఆసిఫాబాద్
వేసవి కాలంలో చెట్ల నుంచి పెద్ద ఎత్తున ఆకులు రాలి ఎండిపోయి ఉండడంతో అగ్గి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దీంతో పర్యావరణ సమతుల్యం కొంత దెబ్బ తింటుంది. ఇలా జరగకుండా ప్రతీ బీట్‌లలో ఫైర్‌లైన్ ఏర్పాటు చేసి అడవిలోకి అగ్గి వెళ్లకుండా చూస్తున్నాము. పశువుల కాపర్లు లేదా పాదాచారులు బీడీలు తాగడం లాంటివి చేసినప్పుడు అగ్నిపుల్లలు ఆర్పివేయాలి. ప్రజలు సహకరించినప్పుడే అడవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా చూసే అవకాశం ఉంటుంది. ప్రత్యేక శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు అగ్నిప్రమాదాలను గుర్తించి ఆర్పడంతో పాటు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై ప్రతీ రోజు వారికి నిబందనలు వివరిస్తున్నాం. సాధ్యమైనంత వరకు అడవిలో అగ్గి పడకుండా చూస్తున్నాం.