Share News

Kumaram Bheem Asifabad: కొత్త ఏడాదిపై కోటి ఆశలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:28 PM

చింతలమానేపల్లి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, కోటిఆశలు, కొత్తలక్ష్యాలతో కొత్తసంవత్సరం-2025లోకి అడుగుపెట్టారు. 2025లోనైనా తమ సమస్యలు పరిష్కారం కాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Kumaram Bheem Asifabad:   కొత్త ఏడాదిపై కోటి ఆశలు

- పెండింగ్‌ సమస్యలకు పరిష్కారం లభించేనా?

- రేషన్‌ కార్డులు, రైతుభరోసా, పూర్తిస్థాయిలో రుణమాఫీ?

- ఇందిరమ్మ ఇళ్లపై ప్రజల్లో ఆశలు

చింతలమానేపల్లి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, కోటిఆశలు, కొత్తలక్ష్యాలతో కొత్తసంవత్సరం-2025లోకి అడుగుపెట్టారు. 2025లోనైనా తమ సమస్యలు పరిష్కారం కాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కొంతకాలంగా జిల్లా ప్రజలు కొత్తరేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, పూర్తిస్థాయిలో రైతాంగానికి రుణమాఫీ, వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలో పెండింగ్‌ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం ప్రజల్లో వ్యక్తం అవుతున్నది.

రేషన్‌కార్డులకు మోక్షం లభించేనా?

రేషన్‌కార్డులు లేని వారందరికీ సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రభుత్వం నమ్మకంగా చెబుతోంది. దీంతో ప్రజలు ఈ కొత్తసంవత్సరంలో తమ రేషన్‌కార్డుల పరేషాన్‌ తొలగిపోయినట్టేనని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం డిసెంబరు28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన ద్వారా ధరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం జిల్లాలో రేషన్‌ కార్డుల కోసం 13,265మంది ధరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపుగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1,37,284కార్డులున్నాయి. ఇందుల అంత్యోదయ 12,948, తెల్ల రేషన్‌కార్డులు 1,24,336 ఉండగా వీటికి నెలనెలా రేషన్‌ దుకాణాల ద్వారా 2,968టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. అర్హులైన వారు జిల్లాలో మరింత మంది ఉండవచ్చని అంచనా. అర్హులందరికీ ఈ ఏడాదైనా కార్డులు అందుతాయని ఎదురు చూస్తున్నారు.

నీడ దొరికేనా?

2025సంవత్సరంలో కనీసం ఇందిరమ్మ ఇళ్లైనా దక్కాలని గూడులేని జిల్లా పరిధిలోని 15 మండలాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లుగా డబుల్‌ బెడ్రూం ఇంటి కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసి చివరకు నిరాశకు లోనయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్రభత్వం ప్రకటించింది. ధరఖాస్తులను స్వీకరించింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతోంది. సంక్రాంతి తర్వాత ఇళ్ల మంజూరు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నిలువనీడ లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాదైనా తమకు ఇల్లు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

రైతు భరోసా, రుణమాఫీపై ఆశలు..

రైతులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టా ఉన్న వాళ్ల్లందరికీ రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు దఫాలుగా రూ.10వేలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతులు సాగు పనుల కోసం, ఇతర పనుల కోసం ఆ డబ్బులను ఖర్చు చేసుకునేవారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ అధికాంలోకి వచ్చిన మొదటిసారి పాత పద్ధతిలోనే రైతు భరోసా పేరిట రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.5వేలచొప్పున జమ చేశారు. వర్షాకాలంలో, యాసంగి సాగు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో రైతాంగం నిరాశతో ఉంది. ఎకరాకు రూ.15వేలు రెండు దఫాలుగా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైతు భరోసా విధివిధానాలపై చర్చించి ఎన్ని ఎకరాల మేరకు రైతులకు భరోసా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇప్పటికీ ఇవ్వకపోవడంతో రైతాంగం ఈ విషయంలో ఎదురుచూస్తోంది. ఈ ఏడాదైనా రైతాంగాన్ని ఆదుకునేందుకు అడుగులు పడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లాలో 1.40లక్షల మంది రైతుల్లో ప్రభుత్వం 1.38లక్షల మంది రైతులకు సుమారుగా 20 కోట్లపైనే రైతుబంధు అందించింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విడుతల వారీగా రూ.2లక్షల లోపు ఉన్న వారందరికీ మాఫీ చేసింది. రూ. లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 22వేలమంది, రూ.1.5లక్షలలోపు రుణాలు తీసుకున్న వారు 14,623మంది ఉండగా వీరికి మూడు విడతల్లో 51,523మంది రైతుల ఖాతాల్లో రూ.465.84 కోట్లు జమయ్యాయి. నాలుగో విడత కింద 3,664మంది ఖాతాల్లో 41.30 కోట్లు జమయ్యాయి. కానీ రూ. 2లక్షల పైన రుణం ఉన్న వారెవ్వరికీ మాఫీ కాలేదు. రూ.2లక్షలపైన ఉన్న రైతాంగం అంతా రూ.2లక్షల వరకు రుణం మాఫీ చేస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20నుంచి30శాతం మంది రైతులు రుణమాఫీ కాక ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదైనా రుణమాఫీ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:28 PM