Kumaram Bheem Asifabad: మరింత ‘సహకార’ం..
ABN , Publish Date - Jan 15 , 2025 | 10:46 PM
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 15(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఆర్థికవ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయరంగానికి వెన్ను దన్నుగా నిలిచే సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- జిల్లాలో మరిన్ని కొత్త సొసైటీలు
- ప్రస్తుతం 12సంఘాలు, 23,788 మంది సభ్యులు
- మరో మూడు కొత్త వాటికోసం ప్రతిపాదనలు
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 15(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఆర్థికవ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయరంగానికి వెన్ను దన్నుగా నిలిచే సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార సంఘాల సేవలు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు. ముందుగా ఆయా పీఏసీఎస్‌లు, ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలను జిల్లా సహకారశాఖ స్వీకరించింది. జిల్లాలో నూతనంగా మూడు సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
గ్రామాల్లో సేవలు విస్తరించేందుకు..
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 12 ప్రాథమికవ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 23,788వేలు సభ్యులున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు, పంట రుణాల పంపిణీ, గిడ్డంగులు ఇలా పలు సేవలు రైతులకు అందిస్తున్నాయి. కొత్తగా మండలాలు ఏర్పడినప్పటికీ మండల కేంద్రాల్లో పీఏసీఎస్‌లు లేవు. ఈ క్రమంలో అన్ని మండల కేంద్రాల్లో అవసరం ఉన్న గ్రామాల్లో సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది.
15కి చేరుకోనున్న సంఘాలు..
కొన్ని సంవత్సరాలుగా కొత్తగా సంఘాలు ఏర్పాటు చేయ లేదు. గతంలో నష్టాల్లో ఉన్న సంఘాలను మరో సంఘంలో విలీనం చేశారే తప్ప కొత్తవి ఏర్పాటు చేయలేదు. పలుపాత, కొత్త మండల కేంద్రాల్లో సైతం సంఘాలు ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం మండలానికి రెండు సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు స్వీకరించింది. కానీ ఏర్పాటు చేయ లేదు. మళ్లీ ఇటీవల కొత్త,పాత మండల కేంద్రాల్లో సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు స్వీకరించారు. కొత్తగా మూడు సంఘాలు ఏర్పాటు చేస్తే జిల్లాలో సహకార సంఘాలు 15కి చేరుకుంటాయి. దీంతో రైతులకు అందుబాటులో సేవలు ఉంటాయి.
ప్రతిపాదనలు పంపించాం..
- రాథోడ్ బిక్కు, జిల్లా సహకార అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదనలను స్వీకరించాం. అందరి అభిప్రాయాలను తీసుకొని నివేదించాం. జిల్లాలో కొత్తగా పెంచికల్‌పేట, చింతలమానేపల్లి, లింగాపూర్ లలో సంఘాలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాం.