ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:31 PM
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది.
- రేపు పోలింగ్
- మార్చి 3న ఓట్ల లెక్కింపు
- జిల్లాలో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
మంచిర్యాల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఆయా జిల్లాల్లో మొత్తం 54 మంది పట్టభద్రుల విభాగంలో నామినేషన్లు దాఖలు చేయగా టీచర్ ఎమ్మెల్సీ కోసం 16 మంది బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈ నెల 8తో ముగియగా గత 20 రోజులుగా అభ్యర్థులు, వారి మద్ధతు దారులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల పట్టభద్రుల అభ్యర్థులు ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, చిన్నమలై, అంజిరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించగా, స్వతంత్ర అభ్యర్థులు తమకు ఉన్న మార్గాల ద్వారా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ నెలకొంది.
- 27న ఎన్నికలు...
ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ ఎన్నికలు ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 30,921 మంది ఓటర్లు ఉండగా టీచర్స్ ఎన్నికలకు 1,664 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఎన్నికల కోసం జిల్లాలో మొత్తం 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. జిల్లాలో సహాయ ఎన్నికల అధికారిగా కలెక్టర్ కుమార్ దీపక్, డివిజన్ స్థాయిలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 229 మంది పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వచ్చే నెల 3వ తేదీన చేపట్టనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పట్టభద్రుల కోసం 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయల కోసం 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్‌రావు, రాజేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
- ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కుమార్‌దీపక్ ఒక ప్రకటనలో సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారు ఓటు హక్కు వినియోగించుకో వాలన్నారు.