K. Kavitha: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
ABN , Publish Date - Jan 03 , 2025 | 03:51 AM
అందరి ఆకలితీర్చే రైతన్నలను ప్రభుత్వపరంగా ఆదుకోవాల్సిందిపోయి.. రైతుభరోసా పథకానికి నిబంధనలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాత లకు సున్నంపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): అందరి ఆకలితీర్చే రైతన్నలను ప్రభుత్వపరంగా ఆదుకోవాల్సిందిపోయి.. రైతుభరోసా పథకానికి నిబంధనలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాత లకు సున్నంపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన బోధన్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుభరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. ఇప్పటికే ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటుందని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటూ తిప్పలుపెడతారా అని నిలదీశారు.
స్థానికసంస్థల ఎన్నికల్లో గులాబీజెండా ఎగరడం ఖాయమన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని, దాంతో ప్రజలు కాంగ్రె్‌సపై గుర్రుగా ఉన్నారన్నారు. కాగా, ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపచేయాలన్న డిమాండ్లతో శుక్రవారం బీసీ మహాసభ జరగనుంది. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి, బీసీసంఘాలు చేపట్టనున్న బీసీ మహాసభకు పోలీసుశాఖ అనుమతి ఇచ్చిందని కవిత చెప్పారు.