Share News

BYD: బీవైడీకి ఓకే!

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:09 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)తో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం.

BYD: బీవైడీకి ఓకే!

  • తెలంగాణలో ఈవీ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం?

  • ‘మేఘా’తో కలిసి జాయింట్‌ వెంచర్‌

  • రూ.85,000 కోట్ల మేర పెట్టుబడులు

  • షాబాద్‌ వద్ద 500 ఏకరాల్లో ఏర్పాటు!

  • దాంతోపాటు హైదరాబాద్‌ సమీపంలో మరో 3 ప్రాంతాల్లోనూ పరిశీలన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చైనాకు చెందిన దిగ్గజ విద్యుత్‌ కార్ల (ఈవీ) తయారీసంస్థ బీవైడీ (బిల్డ్‌ యువర్‌ డ్రీమ్స్‌) ఎట్టకేలకు భారత్‌లో.. తన ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)తో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ జేవీ ఈక్విటీలో చైనా కంపెనీకి 49ు, ఎంఈఐఎల్‌కు 51ు వాటా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై బీవైడీగానీ, ఎంఈఐఎల్‌గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దశలవారీగా 2032 నాటికి ఏటా ఆరు లక్షల ఈవీలు, 20గిగావాట్ల బ్యాటరీల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసేఈ ప్రాజెక్టు కోసం రెండు కంపెనీలూ సుమారు రూ.85,490 కోట్ల మేర పెట్టుబడులు పెడతాయని అంచనా.


షాబాద్‌ వద్దే ప్రాజెక్ట్‌?

బీవైడీ ఇప్పటికే ఎంఈఐఎల్‌ గ్రూప్‌ కంపెనీ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌తో కలిసి రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని సీతారాంపూర్‌ వద్ద 150 ఎకరాల్లో.. విద్యుత్‌ బ్యాటరీలతో నడిచే బస్సులు తయారు చేస్తోంది. తెలంగాణ ఆర్టీసీతో పాటు అనేక రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు ఈ బస్సులను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎంఈఐఎల్‌తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసే ఈవీ కార్ల ప్రాజెక్టును కూడా షాబాద్‌ మండలంలోనే 500 ఎకరాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రాజెక్టు ఎక్కడ అనే దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, షాబాద్‌తో పాటు హైదరాబాద్‌ సమీపంలోని మరో మూడు ప్రాంతాలనూ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి భారత్‌లో తయారీ యూనిట్‌ ఏర్పాటుకు బీవైడీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 100 కోట్ల డాలర్లతో ప్లాంటు ఏర్పాటు చేస్తామని 2023లో ఎంఈఐఎల్‌తో కలిసి దరఖాస్తు కూడా చేసింది. అయితే భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అయినా పట్టువదలకుండా బీవైడీ-ఎంఈఐఎల్‌ తమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఇటీవల చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. బీవైడీ జేవీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చేందుకు మరికొద్ది రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెప్పాయి.


తెలంగాణలోనే ఎందుకు?

బీవైడీ ఉత్పత్తి యూనిట్‌ కోసం అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే ఇప్పటికే ఎంఈఐఎల్‌ గ్రూప్‌ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌తో ఉన్న అనుబంధంతోపాటు.. ఆ ప్రాజెక్టుకు సమీపంలోనే 500 ఎకరాల భూమి కేటాయించేందుకు, ఈవీలపై రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందునే తెలంగాణను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకుంటే, ప్రాజెక్టు సమీపంలో ఈవీల తయారీకి అవసరమైన అనుబంధ సంస్థల క్లస్టర్‌ కూడా ఏర్పడి పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్రసర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌, జీసీసీలతో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. ఈ ప్రాజెక్టుతో ఆటోమొబైల్‌ కేంద్రంగానూ ఎదిగే అవకాశం ఉంటుందని ఆశిస్తోంది.


టెస్లాకు పోటీ

బీవైడీ ఇప్పటికే చైనా, యూరప్‌ మార్కెట్లలో మస్క్‌కు చెఉందిన టెస్లాకు గట్టి పోటీ ఇస్తోంది. గత ఏడాది బీవైడీ అమ్మకాలు టెస్లాను మించిపోయాయి. అదే టెస్లా కంపెనీ ఇప్పుడు భారత్‌లోనూ కాలుమోపేందుకు సిద్ధమవుతోంది. టాటా మోటార్స్‌తో పాటు కొన్ని జపాన్‌, దక్షిణ కొరియా కంపెనీలూ మన దేశంలో తమ ఈవీ యూనిట్లు ఏర్పాటు చేశాయి. మరికొన్ని కంపెనీలూ ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా.. బీవైడీ ప్రవేశంతో భారత ఈవీల మార్కెట్లో పోటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆ సంస్థ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన రూ.22 లక్షల విలువైన డాల్ఫిన్‌ మోడల్‌ ఈవీ ఇప్పటికే టాటా మోటార్స్‌, ఎంజీ మోటార్‌ ఈవీలకు గట్టి పోటీ ఇస్తోంది.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Mar 29 , 2025 | 05:09 AM