CEC India: పర్యావరణ అంశాల్లో సీఈసీ కీలకం
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:11 AM
పర్యావరణ అంశాల్లో కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) కీలక పాత్ర పోషిస్తోంది. సుప్రీంకోర్టుకు జ్ఞానేంద్రియాల మాదిరిగా పనిచేస్తూ, అనుమతుల విషయంలో నిర్ణాయకంగా ఉంటుంది.
సుప్రీంకోర్టుకు జ్ఞానేంద్రియాల మాదిరి సంస్థ
సంక్లిష్ట కేసుల్లో అత్యున్నత న్యాయస్థానానికి సహాయం
కేంద్ర సాధికార కమిటీగా ప్రత్యేక అధికారాలు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సాధికార కమిటీ.. క్లుప్తంగా సీఈసీ..! కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ఇటీవల సీఈసీ ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. దీంతో.. ఇప్పుడు సీఈసీపై చర్చ ఊపందుకుంది. పర్యావరణ అంశాల్లో సుప్రీంకోర్టుకు కళ్లు, ముక్కు, చెవులు వంటి జ్ఞానేంద్రియాలుగా సీఈసీ పనిచేస్తుంది. 2002లో ఏర్పాటైనా.. 2008లో పరిధి విస్తృతమై.. ప్రత్యేక అధికారాల ను అందిపుచ్చుకున్న సీఈసీ ఒక్కసారి ‘నో’ చెబి తే.. కేంద్ర పర్యావరణ అనుమతులు రావడం అసాధ్యమే..! అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. అప్పటి సీఎం వైఎస్‌ఆర్ హయాంలో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్‌కు సంబంధించి, బళ్లారి రిజర్వ్ ఫారె స్ట్‌లో తవ్వకాలపై ఈ సంస్థ విచారణ చేపట్టి, మైనింగ్ లీజులను రద్దు చేయాలని సిఫార్సు చేసింది.
పర్యావరణం కోసమే ఏర్పాటు
1995లో మొదలైన ‘టీ.ఎన్ గోదావర్మన్ తిరుమల్‌పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో కేంద్ర స్థాయిలో ఓ సాధికార కమిటీ అవసరమని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు.. 2002 మే 9న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని నియమించింది. అలా సీఈసీ ప్రస్తానం మొదలైంది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లోని పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల పరిరక్షణకు ఈ సంస్థ కృషి చేసింది. అటవీ, పర్యావరణ పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, మొక్కల పెంపకం, జరిగిన నష్టానికి పరిహారంగా అడవుల పెంపకం(రిజర్వ్ ఫారెస్ట్), ప్రణాళికల అమలు తదితర అంశాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది. జాతీ య స్థాయి అధికార పరిధి కలిగిన ఈ కమిటీ.. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను అమలును పర్యవేక్షించడంతోపాటు.. ఆదేశాలు అమలు కాని కేసులను సుప్రీంకోర్టు కు నివేదిస్తుంది.
దేశంలో ఎక్కడ పర్యావరణ నిబంధనల అమలు విషయంలో ఉల్లంఘనలు చోటుచేసుకున్నా.. సుప్రీంకోర్టుకు నివేదిస్తుంది. అంతేకాదు.. పర్యావరణానికి సంబంధించిన కేసుల్లో తగిన చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి సైతం నివేదికలిస్తుంది. ఆ యా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలను క్రోడీకరించి, తన సిఫార్సులను కోర్టుకు అందజేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో భాగంగా ఏ వ్యక్తి నుంచై నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచైనా తగిన డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశిస్తుంది. అటవీ వివాదాల్లో.. వివాదాస్పద ప్రాంతా ల సందర్శన, పరిష్కారానికి తగిన విధంగా ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు లేదా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి, సహాయం కోరుతుంది.
ఒక చెట్టును తొలగించాలన్నా.. సీఈసీ సిఫార్సు తప్పనిసరి
రక్షిత అటవీ ప్రాంతం(రిజర్వ్ ఫారెస్ట్)లో ఒక్క చెట్టును తొలగించాలన్నా సీఈసీ సిఫార్సు లేకుండా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులివ్వదు. రిజర్వు ఫారెస్ట్ కాకుండా.. అటవీ తరహా ప్రాంతాల్లోనూ పనులను చేపట్టాలంటే సీఈసీ సిఫార్సు తప్పనిసరి. అటవీ తరహా భూములుగా పేర్కొంటున్న కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ‘‘చెట్లను తొలగించే ముందు అనుమతి తీసుకున్నారా?’’ అంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే..! దేశవ్యాప్తంగా పర్యావరణం, అటవీ, జీవ వైవిధ్యం వంటి అంశాల్లో నిబంధనల ఉల్లంఘన జరగకుండా అన్ని పర్యావరణ, అటవీ చట్టాలు అమలయ్యేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. సుప్రీంకోర్టుతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం సలహాలు, సూచనలు, సిఫార్సులు అందజేస్తుంది.
- చిక్కుడు ప్రభాకర్, ప్రముఖ న్యాయవాది(హైకోర్టు)
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News