Share News

Online Betting App Cases: బెట్టింగ్‌ కేసులు సీఐడీకి

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:42 AM

తెలంగాణలో బెట్టింగ్‌ యాప్‌లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ యాప్‌లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది

Online Betting App Cases: బెట్టింగ్‌ కేసులు సీఐడీకి

  • నిర్వాహకుల్లో విదేశీయులే ఎక్కువ

  • ప్రమోటర్లకు హవాలా ద్వారా డబ్బు

  • సీఎం సమీక్ష నిర్వహించే చాన్స్‌!

  • ఇప్పటికే రంగంలోకి ఈడీ, సీఎ్‌సబీ

  • మియాపూర్‌ కేసులో రానా, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ?

  • కేసులను కొట్టివేయండి

  • హైకోర్టులో విష్ణుప్రియ వ్యాజ్యాలు

  • విచారణకు రాని విష్ణుప్రియ, రీతూ

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్‌ యాప్‌ కేసులు సీఐడీకి బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌పై కేసు నమోదు చేశాక.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్ల పరిధుల్లోని ఠాణాలకు ఇదే అంశంపై ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. మియాపూర్‌ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభించడంతో.. ఈ కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులు చాలా మంది విదేశీయులే..! చైనా కంపెనీల ప్రమేయం కూడా బయటపడుతోంది. నిర్వాహకులు రూ.వేల కోట్లను దేశం దాటించారు. యాప్స్‌ ప్రమోటర్లు-- సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లకు హవాలా మార్గాల్లో రెమ్యూనరేషన్‌ చెల్లించారనే ఆరోపణలున్నాయి. దీంతో.. మనీలాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు, సైబర్‌క్రైమ్‌ కోణంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) ఇప్పటికే రంగంలోకి దిగగా.. ప్రభుత్వం అన్ని కేసులను కలిపి.. రాష్ట్ర స్థాయి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీఐడీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.


సినీనటులకు ఇబ్బందులే?

మియాపూర్‌ పోలీసులు నమోదు చేసిన బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో పలువురు దిగ్గజ సినీ నటులు ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. 19 బెట్టింగ్‌ యాప్స్‌నకు సంబంధించిన 25 మంది నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే..! ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచగా.. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌, క్రైమ్స్‌ డీసీపీలు పక్కా ఆధారాలపై దృష్టిసారించాలని ఆదేశించినట్లు తెలిసింది. ‘‘తొందరపాటుతో చార్జ్‌షీట్‌ వేయొద్దు. కేసు నీరుకారకుండా.. పక్కా ఆధారాలను సేకరించి, పకడ్బందీగా ముందుకు సాగాలి. అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి’’ అని సూచించినట్లు సమాచారం. దీంతో దర్యాప్తు అధికారులు.. ఏయే యాప్‌లను ఎవరెవరు ప్రమోట్‌ చేశారు? అందుకోసం వారికి దక్కిన ప్రతిఫలం ఎంత? అగ్రిమెంట్‌ వివరాలేంటి? అనే కోణంపై దృష్టిసారించారు. ఇప్పటి వరకు జంగిల్‌ రమ్మీ అనే యాప్‌ను రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్‌ ప్రమోట్‌ చేశారని, ఏ23 యాప్‌నకు విజయ్‌ దేవరకొండ, యోలో 24/7 యాప్‌ కోసం మంచు లక్ష్మి ప్రచారం కల్పించారని నిర్ధారించారు. 19 యాప్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత.. నిర్వాహకులు, ప్రమోటర్లను గుర్తించి, వారికి నోటీసులిచ్చి, విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది.


హైకోర్టుకు విష్ణుప్రియ

బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌పై మియాపూర్‌, పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ యాంకర్‌ బి.విష్ణుప్రియ మంగళవారం హైకోర్టులో రెండు క్వాష్‌ పిటిషన్లను దాఖలు చేశారు. బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం కల్పించారంటూ వినయ్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు, ఫణీంద్రశర్మ ఫిర్యాదుతో మియాపూర్‌ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే..! ఈ రెండు కేసుల్లోనూ ఫిర్యాదుదారులు తనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని విష్ణుప్రియ తన పిటిషన్లలో గుర్తుచేశారు. పోలీసులకు ఫిర్యాదులు అందింది బెట్టింగ్‌ యాప్‌లపైనేనని, అయితే పోలీసులు సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ తన పేరును చేర్చారని వివరించారు. పోలీసులు పెట్టిన సెక్షన్లేవీ తనకు వర్తించవని, ఈ నేపథ్యంలో ఆయా ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. కాగా.. విష్ణుప్రియ, రీతూ చౌదరి మంగళవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాల్సి ఉండగా.. వారిద్దరూ డుమ్మా కొట్టడం గమనార్హం..!

Updated Date - Mar 26 , 2025 | 04:43 AM