Chennamaneni Ramesh: హైకోర్టు ఆదేశాలతో జరిమానా చెల్లించిన చెన్నమనేని
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:49 AM
హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నమనేని రమేష్ బాబు రూ.25 లక్షల కోర్టు ఖర్చులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కి చెల్లించారు. తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందినట్టు కేసులో హైకోర్టు నెపం నిరూపించింది
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు 25 లక్షల చెక్కు అందజేత
వేములవాడ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా భారత పౌరసత్వం పొందారన్న కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు చెన్నమనేని రమేష్ బాబు సోమవారం అమలు చేశారు. వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్‌సకు కోర్టు ఖర్చుల రూపంలో రూ.25 లక్షలు చెల్లించారు. రమే్‌షబాబు తప్పుడు పత్రాలతో అధికారులను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి భారత పౌరసత్వం పొందారని, వాటి ఆధారంగా ఎన్నికల్లో గెలుపొందుతున్నారని పేర్కొంటూ 2009 నుంచి ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 9న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ రమేష్ భారత పౌరుడు కాదని స్పష్టం చేసింది. భారత పౌరుడు కానప్పటికీ నాలుగు పర్యాయాల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అధికారులను, కోర్టులను మోసం చేయడమేనని పేర్కొంది. ఆయనకు రూ. 30 లక్షలు జరిమానాగా విధించింది. ఇందులో ఆది శ్రీనివా్‌సకు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.25 లక్షలు చెల్లించాలని, మరో రూ.ఐదు లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని పేర్కొంది. హైకోర్టు ఆవరణలో చెన్నమనేని తరపు న్యాయవాదులు ఆది శ్రీనివా్‌సకు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తప్పుడు పత్రాలతో మోసగించినందున చెన్నమనేని రమే్‌షపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. వేములవాడ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు