CM Revanth Reddy: మోదీ దిగి రావాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:17 AM
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుందని హెచ్చరించారు.

42% బీసీ రిజర్వేషన్లకు అనుమతించాలి.. లేదంటే ప్రధాని గద్దె దిగాలి
ఉద్యమం దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుంది
బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుంది
దేశాన్ని జాగృతపరుస్తాం.. అన్ని పార్టీల్ని ఏకం చేస్తాం
దిగిరాకపోతే.. గ్రామాల్లో మీ గద్దెలు కూలుతాయ్
అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోం
బీసీ ముసుగులో ఎక్కువకాలం ప్రభుత్వాన్ని ఏలలేరు
రిజర్వేషన్లకు అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తాం
లేదంటే ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటాం
బండి సంజయ్ ప్రాణాలొద్దు.. రిజర్వేషన్లు ఇస్తే చాలు
ఢిల్లీ బీసీ పోరుగర్జన సభలో సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వకపోతే.. ఇది దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుందని, నిప్పురవ్వయి రగులుతుందని అన్నారు. ‘‘దేశం నలుమూలలా జాగృతం చేస్తాం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను, సంఘాలను ఏకం చేస్తాం. మీరు ఢిల్లీ గద్దె మీద ఎలా ఉంటారో చూస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినం. మీరు బీసీల రిజర్వేషన్లు ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం. మీరు మా డిమాండ్‌కు దిగి అయినా రావాలి. లేదంటే గద్దె దిగి అయినా పోవాలి. బీసీ ముసుగులో మీరు ఎక్కువకాలం ప్రభుత్వాన్ని ఏలలేరు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేస్తారో లేదో తమకు అవసరం లేదని, కానీ.. తెలంగాణలో అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటామని ప్రకటించారు. విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘బీసీ పోరుగర్జన’ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. తమ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కులగణన చేపట్టి కులాల లెక్కలు తేలుస్తామంటూ ప్రజలకు మాట ఇచ్చారని, దానిని తాము తెలంగాణలో అమలు చేశామని చెప్పారు. రాహుల్‌గాంధీ మాట ఇస్తే.. దానిని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపైనా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే తాను ఏ సామాజికవర్గమైనా, తనపై ఏ ఒత్తిడి ఉన్నా.. రాహుల్‌గాంధీ మాటను నిలబెట్టడానికే ప్రాధాన్యమిచ్చానని తెలిపారు. తెలంగాణలో అధికారం చేపట్టి వంద రోజులు గడవక ముందే బలహీనవర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మానం చేశామని, కులగణన పూర్తిచేసి ఆ వివరాలను 2024 ఫిబ్రవరి 4న శాసనసభలో పెట్టామని పేర్కొన్నారు. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కొనసాగాలన్నా.. కులాల లెక్కలు తేలాలని న్యాయస్థానాలు చెప్పాయని గుర్తు చేశారు. అందుకే జగగణనలో కులగణన జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. దేశంలో ఏయే కులాల జనాభా ఎంత ఉందో లెక్క తేలాలని, దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయమని, కాంగ్రెస్ ఒక్కసారి హామీ ఇస్తే అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో చేసి చూపించామన్నారు.
దేశానికి దిక్సూచిగా నిలిచాం...
గుజరాత్ సహా బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీసీల జనాభా 56.36 శాతంగా తేల్చామని, దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల్లోనే కాకుండా.. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీల నుంచి ఐఏఎస్, ఏపీఎస్ సహా అన్ని క్యాటగిరీల ఉద్యోగులు వచ్చి ప్రభుత్వ పాలనలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ ఆశిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో బీసీలను ముందువరుసలో నిలిపేందుకే రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు. బీసీలది ధర్మమైన కోరిక అని, దానిని నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన బాధ్యత ఉందని సీఎం అన్నారు. కానీ, బీజేపీ అందుకు సిద్ధంగా లేదని, ఆ పార్టీ విధానపరమైన ఆలోచనే బలహీన వర్గాలకు వ్యతిరేకమని ఆరోపించారు. దేశంలో బలహీన వర్గాల లెక్క తేలాలని భావించి మొరార్జీ దేశాయ్ ఏర్పాటు చేసిన మండల్ కమిషన్‌పై బీజేపీ కుట్ర చేసి.. కమండల్ యాత్ర మొదలు పెట్టిందని రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ.. ఆ కమండల్ ప్రతినిధేనన్నారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. అందుకే.. బలహీన వర్గాల లెక్క తేల్చాల్చి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను చేయలేదన్నారు. రాహుల్‌గాంధీ కులగణన చేయాలనడంతో 2025 వచ్చినా జనగణన చేయకుండా వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ఇది బీసీల సమస్య మాత్రమే కాదని, యావత్ బహుజనుల సమస్య అని తెలిపారు. అందుకే.. బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోం...
దేశ ప్రధానిగా మోదీ బలహీన వర్గాల ప్రజల గుండెచప్పుడు వినాలని, అంతేతప్ప.. చట్టం, అధికారం చేతిలో ఉందని ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము ఇతర రాష్ట్రాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదని, తెలంగాణలో అమలు చేసేందుకు అనుమతి కోరుతున్నామని చెప్పారు. ఈ విషయంపై తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌ను తమ వాళ్లు కలిసినా.. వారు స్పందించలేదని, అందుకే ఢిల్లీకి వచ్చామని అన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లకు అనుమతిస్తే ప్రధాని మోదీని తానే తెలంగాణకు పిలిచి పార్టీలకతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి సన్మానం చేస్తానన్నారు. లేదంటే ఢిల్లీ నుంచి గల్లీల్లోకి వచ్చినప్పుడు తమ చేతికి దొరుకుతారని చెప్పారు. ప్రధాని గద్దె దిగిరాకుంటే, గ్రామాల్లో గద్దెలు కూలుతాయని హెచ్చరించారు. చట్టసభల్లో మెజారిటీ లేకపోయినా.. ఎన్నో చట్టాలు చేశారని, బీసీ రిజర్వేషన్లపై మాత్రం ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాణాలివ్వాల్సిన పనిలేదని, బీసీ రిజర్వేషన్లకు అనుమతిస్తే చాలునని రేవంత్ అన్నారు. తాము ఇక ఢిల్లీకి వచ్చేది లేదని, ప్రధాని మోదీయే గల్లీలకు రావాల్సి వస్తుందని చెప్పారు. ‘‘బీసీల ఆవేదనను మోదీ వినకుంటే మన బలమేంటో చూపించాలి. ధర్మమైన కోరిక కోసం 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్‌లో ధర్మయుద్ధం ప్రకటించండి. మీకు నేను అండగా నిలుస్తాను. మన బలమేంటో చూపిద్దాం. మోదీ దిగిరాకుంటే.. మనల్ని తక్కువ అంచనా వేస్తే... ఎర్రకోట మీద జెండా ఎగరేద్దాం. రిజర్వేషన్లు సాధించుకుందాం’’ అని రేవంత్ అన్నారు.
బీసీలకు బీజేపీ, బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసనసభలో మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్‌ఎస్ ఢిల్లీలో ధర్నాకు ఎందుకు రాలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇందుకు ఆ రెండు పార్టీలు బీసీలకు సమాధానం చెప్పాలన్నారు. ఈడబ్ల్యూఎ్‌సతో 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దనే నిబంధనకు కేంద్రమే మార్గం తెరిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పనతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే సహకరించడం లేదని ఆరోపించారు. కాగా, బీసీ రిజర్వేషన్లను తప్పుదారి పట్టించి, బీసీ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీసీలందరూ ఒకటేనని, మళ్లీ అందులో కులాల లొల్లి వద్దని సూచించారు. కలిసికట్టుగా ముందుకెళ్లాలని కోరారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కులగణన, 42 శాతం రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి మొండిధైర్యం వల్లే సాధ్యమయ్యాయన్నారు. కాగా, తెలంగాణ ప్రజలకు కొట్లాట కొత్త కాదని, పోరాటాలు చేసైనా మన హక్కులు సాధించుకుందామని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి.. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రధాని మోదీ పేరుకే ఓబీసీ అంటున్నారని, కానీ.. బీసీలకు ఆయన చేసిందేమీలేదని మరో విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినట్లుగానే బీసీ రిజర్వేషన్లనూ పట్టుపట్టి సాధించాలని పిలుపునిచ్చారు. ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ తదితరులు మాట్లాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News