Hyderabad: ఒకప్పుడు కాలుష్య కాసారం.. ఇప్పుడు పర్యావరణహిత నగరం!
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:55 AM
ఏకో టౌన్.. జపాన్‌లోని కిటాక్యూషుకు మరో పేరు. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో నానాయాతనలు పడ్డ ఈ నగరం.. ఇప్పుడు ప్రపంచ పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా నిలిచింది.
కిటాక్యూషు ప్రస్థానం ఆసక్తికరం
పారిశ్రామిక వ్యర్థాలతో బ్యాక్టీరియా బతకడమే కష్టమైన చోట.. ‘ఎకో టౌన్’తో మారిన స్వరూపం
తాజాగా అక్కడ సీఎం బృందం పర్యటన
హైదరాబాద్‌లోనూ ఎకో టౌన్!
అక్కడి ప్రముఖ సంస్థలతో ఒప్పందం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఏకో టౌన్.. జపాన్‌లోని కిటాక్యూషుకు మరో పేరు. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో నానాయాతనలు పడ్డ ఈ నగరం.. ఇప్పుడు ప్రపంచ పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా నిలిచింది. బ్యాక్టీరియా సైతం బతకలేనటువంటి పరిస్థితి నుంచి పర్యావరణహిత నగరంగా మారడం ఆసక్తి కలిగించే ప్రయాణం. అక్కడి ప్రజలు, ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, వ్యాపార సంస్థల ఉమ్మడి ప్రయత్నాలతోపాటు సరైన ప్రణాళిక, లక్ష్యం చేరుకోవాలనే తపన వెరసి.. కాలుష్య భూతం నుంచి విముక్తి పొందింది. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బృందం ఆదివారం కిటాక్యూషును సందర్శించి, అక్కడి మేయర్ కజుహిసా టేకుచితో సమావేశమైంది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు అక్కడి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. మూసీ ప్రక్షాళన మాత్రమే కాదు.. మరో పర్యావరణ పరిరక్షణ దిక్సూచిగా మహానగరం నిలిచేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎకో టౌన్ ఒప్పందం ద్వారా ఈ ప్రక్రియలో మొదటి అడుగు వేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
పారిశ్రామిక విప్లవంతో కాలుష్య కాసారంగా
కిటాక్యూషు నగరం.. జపాన్‌లోని క్యుషూ దీవుల్లో ఉంది. జపాన్‌లో పారిశ్రామిక విప్లవం మొదలైందో... అప్పటి నుంచే అక్కడ కాలుష్యమూ పెరిగింది. 1960 నాటికి అక్కడి గాలి, నీరు, నేల పూర్తిగా కలుషితమయ్యాయి. ఎంతగా అంటే.. కిటాక్యూషు నగరానికి సమీపంలోని డొకాయ్ తీరంలో కనీసం బ్యాక్టీరియా కూడా బతకదనేంతగా! ‘సీ ఆఫ్ డెత్’గా ఆ తీరాన్ని పేర్కొనే వారంటే ఎంతగా ఆ జలాలు కలుషితమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ రీ సైక్లింగ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా కిటాక్యూషు ఎకో టౌన్‌ను తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పలు రకాలుగా నిధులను అందించడంతోపాటు బాండ్స్ జారీ చేయడం ద్వారా స్థానిక ప్రభుత్వం మద్దతు అందించింది. కిటాక్యూషు ఫ్యూచర్ సిటీలో వ్యర్థాల నుంచి ఇంధనం తయారీ సహా అనేక రీసైక్లింగ్ ప్రాజెక్ట్‌లను భాగం చేసింది. వీటితో పాటు ఆటోమేషన్, రోబోటిక్స్, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులను చేపట్టింది. అలాగే, పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించే కంపెనీలకు సర్టిఫికేషన్ అందించడంతో పాటుగా కంపెనీల ప్రయత్నాలను ప్రోత్సహించడానికి కిటాక్యూషు ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపట్టింది. ఈ ప్రయత్నాలు సత్ఫలితాలనే అందించాయి. ఒకప్పుడు సీ ఆఫ్ డెత్‌గా గుర్తింపు పొందిన డొకాయ్ తీరంలో ఇప్పుడు 100కుపైగా చేప జాతులు నివసిస్తుండడం గమనార్హం. ఈ విజయంలో కిటాక్యూషు పర్యావరణ సంబంధిత పరిశ్రమ కమిటీ కీలక పాత్ర పోషించింది. గతంలో కిటాక్యూషు ముడి పదార్ధాలను తమ ఉక్కు పరిశ్రమ కోసం దిగుమతి చేసుకునేది. కానీ, ఇప్పుడు పర్యావరణ సాంకేతికతను ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. కిటాక్యూషు ఇంటర్నేషనల్ టెక్నికల్ కోఆపరేషన్ అసోసియేషన్ ఇప్పుడు ఆసియా ఖండానికి పర్యావరణ అనుకూల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది.
హైదరాబాద్ పరిస్థితి ఇలా...
తోటలు, చెరువులకు ప్రసిద్ధిగాంచిన భాగ్యనగరం కాలగమనంలో కాలుష్య కాసారంగా మారింది. పరిశ్రమల వ్యర్థాలు, ఇళ్ల నుంచి వెలువడే మురుగు చెరువుల్లోకి చేరుతోంది. తాగునీటికి నెలవైన హుస్సేన్‌సాగర్, చేపల పెంపకానికి అనువైన మూసీ.. కలుషితమయ్యాయి. గ్రేటర్‌లోని పలు చెరువుల్లో ప్రస్తుతం జలచరాలకు ఆక్సిజన్ అందని దుస్థితి నెలకొంది. బాగ్‌లు మాయమై బహుళ అంతస్తుల భవనాలతో నగరం కాంక్రీట్ జంగల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లీని తలపించేలా గాలిలో దుమ్ము, ధూళి కణాల తీవ్రత పెరుగుతోంది. అయినా ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బృహత్ ప్రణాళికలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతోన్న వేళ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరూ కరువయ్యే పరిస్థితి రానుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహితంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు జపాన్‌లో మొదటి అడుగు పడింది.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి
BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం
Cybercrime: సైబర్ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News