Share News

Revanth Reddy: నేడు స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:34 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఆదివారం రానున్నారు. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Revanth Reddy: నేడు స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌

  • రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • 50 వేల మందితో సభ.. అధికారుల ఏర్పాట్లు

జనగామ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఆదివారం రానున్నారు. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయి. సీఎం సభ కోసం జనాన్ని తరలించేందుకు అధికారులు 260 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో జర్మన్‌ టెక్నాలజీ టెంట్లను వేస్తున్నారు. సభకు వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్‌ఘన్‌పూర్‌ శివారు శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు సీఎం రేవంత్‌ చేరుకుంటారు.


వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను, ఇందిరా మహిళా శక్తి బస్సులను సందర్శిస్తారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, రూ.45.5 కోట్లతో ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి, రూ.5.5 కోట్లతో నూతన డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2లో భాగంగా రూ.148.76 కోట్లతో ఆర్‌ఎస్‌ ఘన్‌పూర్‌ ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌ పనులు, రూ.26 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ డివిజనల్‌ స్థాయి ఆఫీస్‌ కాంప్లెక్స్‌, రూ.25.6 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోకవర్గంలో 750 ఇందిరమ్మ ఇళ్లు, రూ.12.9 కోట్లతో గోవర్ధనగిరి నుంచి చర్లతండా వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రూ.245.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీని ప్రారంభిస్తారు. అనంతరం 3.10 గంటలకు శివునిపల్లి హెలీప్యాడ్‌ నుంచి బేగంపేటకు తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - Mar 16 , 2025 | 04:34 AM