త్వరలో విదేశీ విద్య బకాయిల చెల్లింపు: సీతక్క
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:58 AM
ఇక గురుకులాల్లో సోలార్ గీజర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అశ్వాపురం ఎమ్మెల్యే జారే ఆది నారాయణ గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆలయాలుగా అభివర్ణిస్తూ పాటను పాడారు.

త్వరలోనే విదేశీ విద్య పథకం బకాయిలన్నీ చెల్లిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రకటించారు. 1913 మంది విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసిస్తున్నారని, వీరి కోసం రూ.167 కోట్లు చెల్లించామని, మరో రూ.25 కోట్ల్ల బకాయిలున్నాయని, త్వరలోనే వీటిని కూడా విడుదల చేస్తామని చెప్పారు. 2023 డిసెంబరు దాకా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4 వేల కోట్ల బకాయిలు ఉండేవని, వాటిని క్రమంగా చెల్లిస్తూ రూ.1100 కోట్లకు చేర్చామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబు చెప్పారు. రాష్ట్రంలో 83 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, ఇటీవలే దుబ్బాకలో ఓ హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోగా... గుట్టుగా వైద్యం అందించారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించగా మంత్రి సీతక్క కల్పించుకొని.. విద్యార్థుల అంశాన్ని రాజకీయం చేయొద్దని, మీరు స్కూళ్లు కడితే మేం కూల్చలేదు కదా అని నిలదీశారు. 2014 నుంచి 2023 దాకా 114 మంది విద్యార్థులు చనిపోయారని ఆక్షేపించారు. ఇక గురుకులాల్లో సోలార్ గీజర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అశ్వాపురం ఎమ్మెల్యే జారే ఆది నారాయణ గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆలయాలుగా అభివర్ణిస్తూ పాటను పాడారు.
బీఆర్‌ఎస్ హయాంలో అక్బర్ ఎందుకు నోరెత్తలేదు?
ప్రశ్నోత్తరాల్లో ఒక్క ప్రశ్న వాయిదా పడితేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ.. గత పదేళ్లలో ఎన్నో ప్రశ్నలు వాయిదా పడినా ఎందుకు అడగలేదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. అప్పుడు సభను బీఆర్‌ఎస్ బుల్డోజ్ చేసినా ఎందుకు మాట్లాడలేదన్నారు. అసలు ప్రశ్నోత్తరాలే లేకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం సభను నడిపిందని విమర్శించారు.