Hyderabad: 1200 కోట్ల ప్రభుత్వ భూమి పంచుకున్నారు
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:17 AM
తమదంటే తమదంటూ బంజారా కుంజ్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్, యమునా నగర్ కోఆపరేటివ్ సొసైటీ స్వాధీనం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. ఆ సొసైటీల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరిగాయి.
ఏళ్లుగా 2 సొసైటీల పోరు
ఫోర్జరీ పత్రాలతో చెరబట్టేందుకు మరొకరి యత్నం
రాజీకి వచ్చిన సొసైటీలు.. వాటాలు వేసుకున్నాయి
సర్కారు స్థలమని తేల్చిన రెవెన్యూ అధికారులు
బంజారాహిల్స్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎక్కడైనా భూమి బంగారమే.. అదే నగరం నడిబొడ్డున ఖరీదైన బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్-12లోని ఎమ్మెల్యే కాలనీ రోడ్డు సమీపాన గల ఏసీబీ కార్యాలయం ఎదురుగా 102/1 సర్వేనంబర్‌లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ.1200 కోట్లపై మాటే. అత్యంత విలువైన ఈ భూమిపై రెండు సొసైటీలు కన్నేశాయి. తమదంటే తమదంటూ బంజారా కుంజ్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్, యమునా నగర్ కోఆపరేటివ్ సొసైటీ స్వాధీనం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. ఆ సొసైటీల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరిగాయి. క్రిమినల్ కేసులూ నమోదయ్యాయి. రెండు సొసైటీల ప్రతినిధులూ డాక్యుమెంట్లు సృష్టించి యాజమాన్య హక్కులు తమవంటే తమవని కోర్టుకూ వెళ్లారు. మధ్యలో మరో ప్రైవేటు వ్యక్తి పోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించి.. భూమిని చెరబట్టేందుకు ప్రయత్నించాడు.
ఈ పరిస్థితుల్లో ఆ రెండు సొసైటీల ప్రతినిధులు రాజీకి వచ్చి మధ్యేమార్గంగా భూమిని పంచుకుని సరిహద్దులు నిర్ణయించుకున్నారు. బంజారా కుంజ్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్.. తమ భవనం వైపు కొంత స్థలంలో గది నిర్మిస్తే.. యమునా నగర్ కోఆపరేటివ్ సొసైటీ హద్దులు నిర్ణయించింది. ఇంత జరుగుతున్నా ఇటువైపు చూడని షేక్‌పేట మండల రెవె న్యూ అధికారులు ఇటీవల రికార్డులు తనిఖీ చేశారు. తమ పరిధిలోని హకింపేట గ్రామం టీఎస్-193 వార్డు లోపల 102/2 సర్వేనంబర్‌లోని 12 ఎకరాల భూమి సర్కారుదేనని నిర్ధారించారు. ఆ వెంటనే షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి, తమ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. నిర్మాణాలు కూల్చేసి స్థలం స్వాధీనం చేసుకుని.. దాని చుట్టూ ఇనుప కడ్డీలతో ప్రహరీ, నీలిరంగు షీట్లు ఏర్పాటుచేశారు.